iDreamPost

వారి అరాచకాలకు పరాకాష్ట..!

వారి అరాచకాలకు పరాకాష్ట..!

ఇన్‌స్టెంట్‌ రుణాలు అందించే లోన్‌ యాప్‌లు గత కొంతకాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అలజడి రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. పోలీస్‌ల దృష్టికి వచ్చింది మొదలు యాప్‌ల నిర్వాహకుల అరాచకాలు రోజుకొకటి బైటపడుతున్నాయి. అప్పు తీసుకున్నవారిని వేధించడంతో పాటు, అతని ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ లిస్టులో ఉన్నవారికి సైతం ఫోన్‌లు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఇప్పటికే బైటపడింది. అయితే ఇది ఎంత తీవ్రంగా ఉంటుందన్నది ఎవరికి వారు నోరు విప్పనప్పటికీ, వీరి అరాచకం ఇటీవలే జరిగిన ఒక సంఘటన బైటపెట్టింది.

తెలంగాణాలోని గుండ్లపోచంపల్లికి చెందిన మోహన్‌ అనే వ్యక్తి లోను యాప్‌ల నిర్వాహకుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు పోలీస్‌లకు ఫిర్యాదు చేసి, అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతిచెందాడన్న విషాదంలోనే ఈ ఏర్పాట్లు చేసుకుంటున్న అతని కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులకు లోన్‌యాప్‌ కాల్‌సెంటర్ల నుంచి ఫోన్లు రావడంతో వారంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.

అప్పుతీసుకున్న మనిషి చనిపోయాడని చెబుతున్నప్పటికీ వరుసగా 46 ఫోన్లు వచ్చాయంటే వీరి వేధింపుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడం తప్పితే మిగిలిన ఏ విషయాల గురించి తమకు సంబంధం లేదన్న రీతిలో సదరు ఫోన్‌ చేసిన వ్యక్తులు మాట్లాడడంతో వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీంతో మరోసారి పోలీస్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.

కాగా ఒక పక్క పోలీసు యంత్రాంగం లోన్‌యాప్‌లపై దృష్టి పెట్టి ఇప్పటికే పలువురు నిర్వాహకులను అరెస్టు చేయడంతో పాటు, దాదాపు 1500లకుపైగా కాల్‌సెంటర్‌ ఉద్యోగులకు నోటీసులు కూడా జారీ చేసారు. గత పదిహేను రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తతంగం మీడియా పరంగా కూడా విస్తృతంగా ప్రచారమవుతోంది. అయినప్పటికీ సదరు యాప్‌ నిర్వాహకులు మాత్రం తమ వ్యాపారం తమదేనన్న రీతిలో వ్యవహరించడం పట్ల జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

వీటి భారిన పడి జేబును గుల్లచేసుకోవడంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కోల్పోయేకంటే వీటి నుంచి రుణం పొందొద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇప్పటికే ఆర్‌బీఐ కూడా దీనిని గురించి స్పష్టమైన ప్రకటనే జారీ చేసింది. చట్ట విరుద్దంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల నుంచి ఎంటువంటి రుణాలు పొందొద్దని ఆ ప్రకటన సారాంశం. అప్పటికప్పుడు వస్తుంది కదా? అని యాప్‌ల ద్వారా రుణం పొందే ముందు ఆ తరువాత ఎదురయ్యే ఇబ్బందులను కూడా గుర్తు చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఒక వేళ వేధింపులు ఎదురవుతున్నప్పటికీ ఆత్మహత్య దీనికి మార్గం కాదని, పోలీస్‌లకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి