iDreamPost

వినియోగం ఆఫ్‌.. సంతోషం ఫుల్‌

వినియోగం ఆఫ్‌.. సంతోషం ఫుల్‌

మద్యపాన నిషేధంపై ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మరో మారు రుజువైంది. పాత సంవత్సరం ముగింపు.. కొత్త సంవత్సరం ప్రారంభం.. వేడుకల్లో మద్యం వినియోగం సగానికి సగం తగ్గడం విశేషం. మద్యాన్ని వీలైనంత వరకూ ప్రజలకు అందుబాటులో లేకుండా జగన్‌ సర్కార్‌ తీసుకున్న చర్యలతో ఈ ఏడాది విక్రయాలు సగానికి తగ్గినా.. ఆదాయంలో మాత్రం స్వల్పంగా తగ్గడం గమనార్హం.

బీర్లు రెండు రెట్లు తక్కువగా..

గతేడాది నూతన సంవత్సర వేడుకల సమయంలో రాష్ట్రంలో 2,05,087 కేసుల మద్య విక్రయాలు జరగ్గా ఈ ఏడాది కేవలం 1,32,844 కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక బీర్లు వినియోగంలో రెండు రెట్లు మేర వినియోగం తగ్గింది. గతేడాది 1,45,519 కేసుల బీర్లు ఖర్చు కాగా, ఈ ఏడాది రెండ్లు రెట్లు తక్కువగా అంటే.. 50,995 కేసుల బీర్ల వినియోగం జగరడం గమనార్హం. గతేడాది కంటే 94, 524 కేసులు తక్కువగా విక్రయం కావడం మద్యపాన నిషేధంపై ప్రభుత్వం తీసుకున్నంటున్న చర్యలకు నిదర్శనం.

ఆదాయంలో మార్పు తక్కువే..

మద్యం విక్రయాలు సగంపైగా తగ్గినా ఆదాయం మాత్రం గతేడాది కంటే స్వల్పంగా మారింది. గతేడాది మద్యం విక్రయాల ద్వారా 120 కోట్ల రూపాయల ఆదాయం రాగా. ఈ ఏడాది 15 కోట్లు తక్కువగా అంటే.. 105 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. «మద్యం సామాన్యులకు దూరం చేసేందుకు ధరలు పెంచడంతో వినియోగం తిగ్గినా మద్య ఆదాయంలో మాత్రం పెద్దగా మార్పులేదు.

కృష్ణ టాప్‌.. కర్నూలు లాస్ట్‌..

నూతన సంవత్సర వేడుకల్లో కృష్ణా జిల్లాలో ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగాయి. ఈ జిల్లాలో 17.24 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అత్యల్పంగా కర్నూలులో 3.12 కోట్ల విక్రయాలు జరిగాయి.

తగ్గడానికి ఇవే కారణాలు..

ఏడు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం వైపు మెల్లమెల్లగా అడుగులు వేసింది. మూడు దశల్లో మద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తామన్న ఎన్నికల హామీని సీఎం జగన్‌ ఆచరణలో పెట్టారు. మద్యం దుకాణాలు 20 శాతం తగ్గించారు. ధరలు పెంచారు. సమయం వేళలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేశారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడంతో బెల్టు విక్రయాలకు అడ్డుకట్ట పడింది. ఏడాది చివరి రోజున రాత్రి 12 గంటల వరకు విక్రయాలు జరిపే సాంప్రదాయానికి ముగింపు పలుకుతూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఈ సారి రాత్రి 10 గంటలతోనే విక్రయాలను బంద్‌ చేసింది. కుటుంబాల్లో సంతోషం నింపాలన్న ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి