iDreamPost

‘లియో’ టీమ్ పై తెలుగు ఆడియన్స్ ఫైర్! కారణం..?

  • Author ajaykrishna Updated - 01:04 PM, Sat - 14 October 23
  • Author ajaykrishna Updated - 01:04 PM, Sat - 14 October 23
‘లియో’ టీమ్ పై తెలుగు ఆడియన్స్ ఫైర్! కారణం..?

తెలుగులోకి తమిళ సినిమాలు డబ్ అవుతున్నాయి. ఇదేం కొత్త తంతు కాదు. దశాబ్దాలుగా జరుగుతుంది. సూపర్ స్టార్ రజినీ, కమల్ నుండి నేటి విజయ్, ధనుష్, శివకార్తికేయన్ వరకు అందరు తమిళ హీరోల సినిమాలు తెలుగులోకి డబ్ అవుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులోను ఒకేసారి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విషయం తమిళ డబ్బింగ్ సినిమాల గురించి కాదు. తమిళం నుండి డబ్ అవుతున్న సినిమా పాటలలో తెలుగు లిరిక్స్ విషయం. ఒకప్పుడు తమిళ లిరిక్స్ ఎలా ఉన్నాయో తెలియకపోయినా.. తెలుగులో మాత్రం వినసొంపుగా.. అర్ధవంతమైన పదాలతో.. అచ్చం తెలుగుపాటే అనిపించే విధంగా మన లిరిక్ రైటర్స్ కృషి చేశారు.

ఆ వరుసలో ముందుగా రాజశ్రీ.. ఆ తర్వాత వేటూరి, సిరివెన్నెల, వెన్నెలకంటి, భువనచంద్ర, వనమాలి.. ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, దేవా ఇలా ఒకరి తర్వాత ఒకరు తమిళంలో ఊపు ఊపేస్తున్నారు. అలాంటి తరుణంలో స్టార్ హీరోల సినిమాలు తెలుగు డబ్ చేసి.. చక్కని లిరిక్స్ రాయించేవారు మేకర్స్. ఇళయరాజా, రెహమాన్ తెలుగు లిరిక్స్ విషయంలోను జాగ్రత్తపడేవారు. పైగా తెలుగులో ఉన్న టాప్ లిరిక్ రైటర్స్ నే డబ్ సాంగ్స్ కోసం తీసుకొనేవారు. అలాంటిది ఇప్పుడు కాలం మారి.. కొందరు లెజెండ్స్ కాలం చేసేసరికి.. తెలుగులో అంత అందమైన, హుందాతో కూడిన లిరిక్స్ అందించే రచయితకు కరువయ్యారు.

ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ రైటర్స్ కుదరకపోతే.. ఎవరో ఒకరితో రాయించేస్తున్నారు తమిళ మేకర్స్. తాజాగా దళపతి విజయ్ హీరోగా నటించిన ‘లియో’ నుండి ‘నే రెడీ..’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ లో లిరిక్స్ వింటే.. ఖచ్చితంగా కేవలం ప్రాస కోసం.. ర్యాప్ బీట్ కోసం పదాలను అల్లినట్లు అర్ధమవుతుంది. అసలే ఫాస్ట్ బీటు.. అందులో లిరిక్స్ కూడా అర్ధవంతంగా లేకపోతే డబ్బాలో రాళ్లు వేసి ఊపిన ఫీలింగ్ వస్తుంది. ప్రెజెంట్ ‘నే రెడీ’ సాంగ్ వింటున్న తెలుగు వాళ్లకు అలాంటి ఫీలింగ్ కలుగుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పేరున్న రైటర్స్ కి ఎక్కువ డబ్బు ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేస్తున్నారా? అని మేకర్స్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఒక్క సినిమాలోనే కాదు.. సూపర్ స్టార్ నుండి యంగ్ స్టర్ వరకు తమిళ డబ్బింగ్ సినిమాల పాటలలో ఇదే జరుగుతుంది. మరి దీనిపై ఇకనైనా తమిళ మేకర్స్ దృష్టి పెడతారేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి