iDreamPost

మధ్యప్రదేశ్‌లో వైరల్‌గా మారిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆడియో క్లిప్

మధ్యప్రదేశ్‌లో వైరల్‌గా మారిన ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ ఆడియో క్లిప్

మధ్యప్రదేశ్‌లో రెండు వారాల క్రితం ప్రత్యర్థి పార్టీల అగ్రనాయకులు కనిపించటం లేదని అధికార బిజెపి,ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పోస్టర్‌ల యుద్ధం జరిగింది. ఈ ఉదంతంపై రాజకీయ వర్గాలలో ఇంకా చర్చ నడుస్తుండగా తాజాగా సీఎం శివరాజ్ చౌహాన్ ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారి ప్రకంపనలు సృష్టిస్తుంది.

త్వరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. జ్యోతిరాదిత్య సింధియాకు అత్యంత సన్నిహితుడైన సిలావత్ ఇండోర్‌లోని సాన్వర్ నియోజకవర్గం నుంచి బిజెపి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల క్రితం జూన్ 8 న సాన్వర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం శివరాజ్ సింగ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం శివరాజ్ చౌహాన్ మాట్లాడినట్లు చెప్తున్న ఆడియో క్లిప్‌లో అప్పటి కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బిజెపి కేంద్ర అగ్రనాయకత్వం నిర్ణయించింది. జాతీయ నాయకత్వం మార్గదర్శకంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చినట్లు స్పష్టంగా ఉంది. ఇంకా చౌహాన్ పార్టీ కార్యకర్తల వైపుకు తిరిగి జ్యోతిరాదిత్య సింధియా జి మరియు తులసి భాయ్ లేకుండా ప్రభుత్వాన్ని తొలగించడం సాధ్యమేనా దయచేసి మీరే చెప్పండి. వారు సహాయం చేయకుంటే మనకు వేరే మార్గం లేదని పార్టీ కార్యకర్తల చప్పట్ల మధ్య చౌహాన్ పేర్కొనట్లుగా ఉంది.

వైరల్ వీడియోలో సింధియా లేదా సిలావత్ కాంగ్రెస్ పార్టీని మోసం చేయలేదని నేను పూర్తి నమ్మకం, నిజాయితీతో చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేసిన పాత పార్టీ. ఒక బాధాకరమైన పరిస్థితి కారణంగా అతను (సిలావత్) తన మంత్రి పదవిని విడిచిపెట్టాడు. కానీ నేటి కాలంలో నాయకులు సర్పంచ్ పదవిని కూడా వదలటానికి సిద్ధంగా లేరు, అలాంటిది అతను మంత్రి పదవిని త్యాగం చేసాడని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉప ఎన్నికలలో బిజెపి కార్యకర్తలందరూ సిలావత్‌కు మద్దతుగా నిలిచి ఆయనను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అలాగే నేను ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న,బిజెపి ప్రభుత్వం మనుగడ సాగించాలన్న సిలావత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని చౌహాన్ విజ్ఞప్తి చేశారు.

తాజాగా సంచలనం సృష్టిస్తున్న ఆడియో గురించి బిజెపి సీనియర్ నాయకుడు గోవింద్ మాలు స్పందించారు. మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించలేదు, వారి పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో ఒక విభజనను ఎదుర్కొంది, వారు స్వయంగా మా వద్దకు వచ్చి బిజెపి పార్టీలో చేరారు అని మాలు ఒక జాతీయ వార్తా ఛానల్ ప్రతినిధితో తెలిపారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి నకిలీ వీడియోలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయగలదని గోవింద్ మాలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మా కర్తవ్యం అని భావించినట్లు బిజెపి స్పోక్స్ పర్సన్ రజనీష్ అగర్వాల్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ మీడియా ఇంచార్జ్ జీతూ పట్వారీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించటం “ప్రజాస్వామ్య హత్య”గా పేర్కొన్నాడు, పైగా దానిని ఒక ముఖ్యమంత్రి అంగీకరించటం సిగ్గుచేటని విమర్శించారు. బిజెపిపై పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి మేము చట్టపరంగాను, రాజ్యాంగ పరంగాను మార్గాలను అన్వేషిస్తున్నాము అని ప్రకటించారు. శివరాజ్ ప్రభుత్వం మూడు- నాలుగు నెలలకు మించి అధికారంలో ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి కెకె మిశ్రా సీఎం శివరాజ్ చౌహాన్ ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్‌ను తానే విడుదల చేసినట్లు ప్రకటించుకున్నాడు. క్లిప్ యొక్క ప్రామాణికత గురించి ఏమైనా అనుమానాలు ఉంటే ధైర్యంగా తనపై బిజెపి ప్రభుత్వం కేసు పెట్టుకోవచ్చు అని సవాల్ విసిరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి