iDreamPost

తొమ్మిదేళ్లుగా ఖాళీ పీఠం

తొమ్మిదేళ్లుగా ఖాళీ పీఠం

ఆ జిల్లాకు ఆ ఊరే కేంద్రం… జిల్లాకు చెందిన పెద్ద పెద్ద నాయ‌కులంతా ఉండేది ఆ సిటీలోనే. అలాంటి సిటీలో స‌మ‌స్య‌లేవి ఉండ‌కూడ‌దు. స‌మ‌స్య‌లే లేకుంటే ఇక నేత‌ల‌కెందుకు భ‌యం.. అర్థంకావ‌డం లేదా.. ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే..

ఇప్పుడు మ‌నం చ‌దివిందంతా రాయ‌ల‌సీమ ముఖ‌ద్వార‌మైన క‌ర్నూలు గురించే. జిల్లా కేంద్ర‌మైన క‌ర్నూలు న‌గ‌ర‌పాల‌క సంస్థ చాలా పెద్ద‌ది. క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ‌మే కాకుండా ప‌క్క‌నున్న పాణ్యం, కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన వార్డులు కూడా క‌ర్నూలు మున్సిపాలిటీ కింద‌కే వ‌స్తాయి. మొత్తం మూడు నియోజ‌కవ‌ర్గాల‌కు క‌లిపి 51 వార్డులు ఉన్నాయి. ఇంత పెద్ద మున్సిపాలిటీ అయినా పాల‌క‌వ‌ర్గం మాత్రం ఉండ‌దు. ఉండ‌ద‌నుకఉంటే అస్స‌లు పాల‌క‌వ‌ర్గ‌మే లేద‌ని కాదు. ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగి చాలా ఏళ్ల‌యింది.

2010లో క‌ర్నూలు న‌గ‌ర‌పాల‌క సంస్థ పాల‌క‌వ‌ర్గం ముగిసింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే తొమ్మిదేళ్లు పాల‌క‌వ‌ర్గం లేద‌న‌మాట‌. 2005లో ఎన్నిక‌లు జ‌ర‌గ్గా ఆ పాల‌క‌వ‌ర్గం ఐదేళ్ల‌పాటు కొన‌సాగింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్నూలు మున్సిపాలిటీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు. మొద‌ట్లో క‌ర్నూలు శివారులోని గ్రామాలు కార్పోరేష‌న్‌లో విలీనం కార‌ణంగా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. ఆ త‌రువాత కుల‌గ‌ణ‌న‌, వార్డు ఓట‌ర్ల జాబితా అంటూ ఎన్నిక‌లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి.

అయితే 2014లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టిన త‌రువాత ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుంద‌ని అంతా అనుకున్నా ఆ దిశ‌గా అడుగులు వేయ‌లేదు. కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక‌లు నిర్వ‌హించిన తెలుగుదేశం ప్ర‌భుత్వం క‌ర్నూలు కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌కు మాత్రం సాహ‌సించ‌లేక పోయింది. ఐదేళ్లు అధికారంలో ఉన్నా కార్పోరేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు. దీంతో జిల్లా క‌లెక్ట‌ర్ క‌ర్నూలు కార్పోరేష‌న్‌కు ప్ర‌త్యేక అధికారిగా ఉంటున్నారు.

ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టి ఆరు నెల‌లు గ‌డిచింది.వెంట‌నే మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్దం చేసింది. త్వ‌ర‌లోనే కార్పోరేష‌న్ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. దీంతో తొమ్మిదేళ్ల నుంచి కార్పోరేష‌న్‌కు ఎన్నిక‌లు లేవ‌ని.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక వెంట‌నే నిర్వ‌హిస్తోంద‌ని అంతా చ‌ర్చించుకుంటున్నారు. ఏదేమైనా కార్పోరేష‌న్ ఎన్నిక‌లు జరిగి పాల‌క‌వ‌ర్గం వ‌స్తేనే అభివృద్ధి దిశ‌లో క‌ర్నూలు మ‌రింత ముందుకు వెళుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి