iDreamPost

వైఎస్‌ అనుంగ శిష్యుడు మరణం

వైఎస్‌ అనుంగ శిష్యుడు మరణం

ఆయన నమ్మకమైన శిష్యుడు.. ఈయన నమ్మిన వారి కోసం ఏదైనా చేసే నాయకుడు. పిలిచి టికెట్‌ ఇస్తాడు. ఓడితే మరో పదవైనా ఇస్తాడు. ఆయననున్నంత కాలం వారి రాజకీయ ఆస్తిత్వానికి ఢోకా ఉండేది కాదు.

కూచిపూడి సాంబశిరావు అంటే తెలిసిన వారు రాజకీయాల్లో తక్కువే. వైఎస్సార్‌ జమనాలో గుంటూరు జిల్లా రాజకీయాల్లో బలమైన రాయపాటి, కన్నా లక్ష్మీనారాయణలను ఢీకోని పదవులు సంపాదించుకున్న కూచిపూడి దంపతలు గత కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్నారు.

కూచిపూడి సాంబశివరావు వృత్తి రీత్యా లాయర్‌. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో తొలి నుంచి చివరి వరకు పాల్గొన్న అతి కొద్ది మందిలో కూచిపూడి సాంబశివరావు ఒకరు. దళితచైతన్యం ఎక్కువగా ఉన్నా గుంటూరు జిల్లా రాజకీయాల్లో తొలిసారి కూచిపూడి సాంబశివరావుకు 1985లో తాడికొండ నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ 2500 స్వల్ప తేడాతో ఆయన ఓటమి చవిచూశారు. మరో అవకాశం కోసం 14 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. వైఎస్సార్‌ నాయకత్వంలో జరిగిన 1999 ఎన్నికల్లో కూచిపూడి సాంబశివరావుకు మరోసారి టికెట్‌ దక్కింది. కానీ దురదృష్టం వెంటాడింది. ఈ సారి ఐదు వేల తేడాతో ఓడిపోయారు. రాజకీయ జీవితంలో పోటీ చేసిన రెండు సార్లు కేవలం ఐదే వేల తేడాతో ఓడిపోయిన దురదృష్టవంతులు మరొకరు ఉండకపోవచ్చు.

2004లో వైఎస్సార్‌ సీఎం అయిన తర్వాత కూచిపూడి సాంబశివరావుకు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ పదవి ఇచ్చారు. నాగార్జున యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌ శ్రీమతి విజయను గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎంపిక చేశారు. ఆ ఎన్నికల్లో నేరుగా వైఎస్సార్‌ ఫోన్‌ చేసి విజయను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. కూచిపూడి దంపతుల పట్ల వైఎస్సార్‌ అంతటి వాత్సల్యం చూపారు.

నాటి కాంగ్రెస్‌లో బలమైన రాయపాటి, కన్నా లక్ష్మీ నారాయణ వర్గాలకు ధీటుగా కూచిపూడి దంపతలు రాజకీయం నడిపారు. వైఎస్సార్‌ మరణంతో వీరు కూడా రాజకీయంగా తెరమరుగవుతూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వీరు టీడీపీలో చేరారు. కానీ ఎక్కడా పోటీ చేసే అవకాశం రాలేదు.

కూచిపూడి సాంబశివరావు అనారోగ్యంతో ఈ రోజు ఉదయం గుంటూరులోని తన స్వగృహంలో చనిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి