iDreamPost

తప్పేంలేదు.. అవసరమైతే జగనన్నతో మాట్లాడతా – కేటీఆర్

తప్పేంలేదు.. అవసరమైతే జగనన్నతో మాట్లాడతా – కేటీఆర్

తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఓ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మాట్లాడుతానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మడికొండ ఐటీ పార్కులో 40కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఏపీలోను ఐటీ సంస్థలు పెట్టాలని అందుకు అవసరమైతే జగనన్నతో మాట్లాడతానంటూ కేటీఆర్ వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరులో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు 40 శాతం మంది ఉన్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అక్కడ పని చేస్తున్న వారందూ సొంత ప్రాంతాలకు వచ్చేందుకు తహతహలాడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆంధ్రాలోని భీమవరం, నెల్లూరు ప్రాంతాల్లో భవిష్యత్‌లో ఉజ్వలమైన ఉపాధి అవకాశాలు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. అక్కడి పిల్లలకు కూడా టాలెంట్ ఏం తక్కువ లేదన్నారు. ఈ సందర్భంగా ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు.

జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తానన్నారు కేటీఆర్. తప్పేం లేదు.. వాళ్లు బాగుండాలి, మనం బాగుండాలి అలా అయితేనే దేశం బాగుంటుందని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఎంతసేపు కులం, మతం, ప్రాంతం పేరుతో కొట్టుకు చావకుండా ఉపాధి అవకాశాల కోసం కృషి చేయాలని కోరారు. ఎక్కడి వారికి అక్కడే ఉపాధి అవకాశాలు రావాలని కోరారు. దీనికోసం ఎన్నారైలు ఐటీ కంపెనీలు పెట్టాలని పిలుపునిచ్చారు. కంపెనీకి అవసరమైన వసతులు కల్పిస్తామని వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి