iDreamPost

నాగబాబు నుంచి నాగార్జునకు – Nostalgia

నాగబాబు నుంచి నాగార్జునకు  – Nostalgia

కొన్నిసార్లు రచయిత లేదా దర్శకుడు సినిమా కోసం ఎంతో కష్టపడి రాసుకున్న కామెడీ ఆశించిన స్థాయిలో స్పందన దక్కించుకోకపోతే అప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. అది ఖచ్చితంగా పండుతుందనే నమ్మకం గట్టిగా ఉన్నప్పుడు దాన్నే మరోసారి ఇంకో మూవీ కోసం వాడుకోవడం కూడా జరుగుతుంది. ఒకవేళ ప్రేక్షకుడు కనక గుర్తుపడితే ఇబ్బంది కానీ లేదంటే హ్యాపీగా వాడుకోవచ్చు. అలాంటిదే ఇది కూడా.

1992లో నాగబాబు హీరోగా ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో 420 అనే సినిమా వచ్చింది. ఓ ఇంగ్లీష్ సినిమా స్ఫూర్తితో చైల్డ్ సెంటిమెంట్ ని మిక్స్ చేసి ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా దీన్ని తీర్చిదిద్దారు. శుభలేఖ సుధాకర్ చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. ఇందులో మంచి కామెడీ ట్రాక్ ఉంటుంది. కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావులు కానిస్టేబుల్స్ గా ఉంటూ దొంగతనాలు మోసాలు చేసే హీరోను పట్టుకునే పనిలో ఉంటారు. ఇది చాలా సరదాగా ఉంటుంది. అయితే 420 ఆశించిన విజయం సాధించలేదు. చక్కగా నవ్వుకోదగ్గ అంశాలు ఉన్నప్పటికీ జనం అంతగా ఆదరించలేదు.

కట్ చేస్తే 1994లో ఇదే ఈవివి సత్యనారాయణ గారు నాగార్జునతో హలో బ్రదర్ చేశారు. ఇది అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్. 420లోని కోట, మల్లికార్జునరావు పాత్రలను చిన్న మార్పుతో యాధాతధంగా తీసుకుని ప్రీ క్లైమాక్స్ లో చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అంతే దీన్ని పబ్లిక్ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చీరాని ఇంగ్లీష్ లో కోట వేసే జోకులకు మల్లికార్జునరావు కౌంటర్లు ఇవ్వడంతో జనం మాములుగా నవ్వలేదు. తాడి మట్టయ్య పేరుతో సహా 420 క్యారెక్టర్స్ ని ఈవివి హలో బ్రదర్ కంటిన్యూ చేశారు.

ఇప్పటికీ హలో బ్రదర్ చూసినప్పుడంతా వీళ్ళిద్దరి కామెడీ కనక లేకపోతే జనం ఏదో వెలితిగా ఫీలయ్యేవారు. 420లో జరిగిన పొరపాట్లను సరిగ్గా విశ్లేషించుకున్న ఈవివి హలో బ్రదర్ లో అన్ని సమతూకంలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమా దెబ్బకే ఈవివి అగ్రస్థానానికి వెళ్ళిపోయి చిరంజీవి, బాలకృష్ణలతో చేసే బంపర్ ఆఫర్లు అందుకున్నారు. పవన్ లాంచ్ చేసే ఛాన్స్ కూడా ఈవివికే వచ్చింది. సో 420లో పండని కామెడీ హలో బ్రదర్ లో వర్కవుట్ కావడం విచిత్రమే కదా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి