iDreamPost

దక్షిణ కొరియాపై సైనిక చర్యకు సిద్ధమని ప్రకటించిన కిమ్ సోదరి

దక్షిణ కొరియాపై సైనిక చర్యకు సిద్ధమని ప్రకటించిన కిమ్ సోదరి

ఆమె ఆ దేశ అధ్యక్షుడికి కేవలం సోదరి మాత్రమే.కానీ గత కొంత కాలంగా అతని స్థానంలో అధ్యక్ష పదవి చేపట్టనున్న అత్యంత శక్తివంతమైన మహిళగా అంతర్జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది.ఏ అధికార పదవిలో లేని ఆమె పొరుగు దేశంపై కయ్యానికి కాలు దువ్వుతూ హెచ్చరికలు జారీ చెయ్యటం ఇప్పుడు సంచలనంగా మారింది.

మీకు ఈపాటికే అర్ధం అయి ఉంటుంది.ఆమె ఎవరో…ఆదేశం ఏదో…!
అవును మీరనుకున్నట్లు ఆ దేశం ఉత్తర కొరియానే…ఆమె కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ యే.

ఇక విషయంలోకి వస్తే గత వారం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు వ్యతిరేకంగా దక్షణ కొరియా సరిహద్దు వద్ద కరపత్రాలు,గాలి బుడగలను కొందరు వదిలారు.తమ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని దక్షిణ కొరియా ప్రోత్సహిస్తున్నట్లు నార్త్ కొరియా ఆరోపించింది.దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అక్కడి పోలీసులు అణచి వేయకపోవడం కూడా ఉత్తర కొరియాకి ఆగ్రహం తెప్పించింది.

ఈ ఉద్రిక్త పరిస్థితిల మధ్య గత మంగళవారం దక్షిణ కొరియాతో ఆర్ధిక,దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.పైగా ఇరుదేశాలకు ప్రయోజనకరమైన ఆర్థిక ప్రాజెక్టులను పునరుద్ధరించడంలోనూ,తమ దేశంపై అమెరికా విధించిన ఆంక్షలను తొలగించేందుకు సౌత్ కొరియా కృషి చెయ్యటం లేదని ఉత్తర కొరియా అనుమానిస్తుంది.

ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాను శత్రుదేశంగా పేర్కొంటూ అవసరమైతే సైనికచర్యకు కూడా దిగుతామని కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ ప్రకటించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ ఓ కథనం ప్రచురించింది.దాని ప్రకారం దేశ అధ్యక్షుడు,అధికార పార్టీ,ప్రభుత్వం నుంచి నాకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించినట్లు జోంగ్‌ పేర్కొంది.శత్రుదేశంపై తీసుకోవలసిన చర్యల గురించి మా ఆర్మీ చీఫ్ కి ఆదేశాలు ఇచ్చాను.దేశపౌరుల ఆగ్రహాన్ని తగ్గించేందుకు త్వరలోనే ఏం యాక్షన్ తీసుకోవాలో ఆర్మీ చూసుకుంటుందని ఆమె ప్రకటించింది.ఇంకా సరిహద్దులలో ఉన్న ఇరు దేశాలకు చెందిన కార్యాలయాలను కూడా మూసివేస్తామని కిమ్‌ యో జోంగ్‌ హెచ్చరిక జారీ చేసినట్లు అధికార మీడియా వెల్లడించింది.

గత ఏప్రిల్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వినిపించాయి.చివరకు కిమ్‌ మరణించాడని కూడా కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కిమ్‌ జోంగ్ ఉన్‌ తన వారసురాలిగా సోదరి కిమ్‌ యో జోంగ్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఉన్నారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఆమె హెచ్చరికలను పరిశీలిస్తే ప్రభుత్వ వ్యవహారాలలో నిర్ణయాత్మక శక్తిగా కిమ్‌ యో జోంగ్ అవతరించిందని భావించవచ్చు.కాగా ప్రస్తుతం ఆమె దక్షిణ కొరియాకు సంబంధించిన దౌత్య,ఆర్థిక, సైనిక వ్యవహారాలను వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఉత్తర కొరియాను కోరింది.ఉత్తర కొరియా హెచ్చరికలతో ఆదివారం దక్షిణ కొరియా సైనిక ఉన్నత అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించింది.

ప్రపంచమంతా కరోనా సమస్యతో పోరాడుతుంటే కొరియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి