iDreamPost

చంద్రబాబు ప్రచారానికి చెక్ పెట్టిన కియా

చంద్రబాబు ప్రచారానికి చెక్ పెట్టిన కియా

వెనుకబడిన అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని కార్ల తయారీ ప్లాంట్ తన వల్లనే వచ్చిందని చెప్పుకున్న చంద్రబాబుకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన కియా మోటార్స్ చైర్మన్ హాన్ పార్క్ రాసిన లేఖ బయటపెట్టి షాక్ ఇచ్చారు. ఆ లేఖలో హాన్ పార్క్ తాను వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని 2007లో కలిశానని అప్పుడు ఆయన రాష్ట్రంలో ఆటోమొబైల్ ఫ్యాక్టరీని నెలకొల్పాలని కోరారని భారత్‌లో ఎప్పుడైనా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకుంటే మీ రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తామని మేము వైయస్ కి వాగ్దానం చేశామని దాని ప్రకారమే మేము అనంతపురంలో కియా మోటార్స్‌ని ఏర్పాటు చేశామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు తన ప్రచార పంధాని మార్చారు, కియా మోటార్స్ జగన్ విధానాలను తట్టుకోలేక ఆంధ్ర ప్రదేశ్ నుంచి వెళ్ళిపోతుందని మరో ప్రచారానికి తెర లేపారు.

బాబు హయాంలో 2017 లో డిజిటల్ కంటెంట్ మార్పిడి పేరట టెండర్లు పిలవకుండానే ప్రయోజనం కల్పిస్తూ ఒప్పందం చేసుకున్న బ్రిటన్ సంస్థ అయిన రాయిటర్స్ వైయస్ జగన్ విధానాల వలన కియా మోటార్స్ అనంతపురం నుండి తమిళనాడు రాష్ట్రానికి తరలి వెళ్లి పోతున్నట్లు ఒక వార్త తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రచారంలోకి తెచ్చింది. ఆ వార్త ఆధారంగా రాష్ట్రంలో టీడీపీ అనుకూల ఎల్లో చానల్స్, ఎల్లో వార్తాపత్రికలు ఆ వార్తని బ్యానర్ ఐటంగా రాశాయి. దీంతో తెలుగుదేశం నేతలు కియా తరలింపు అంటూ పెద్ద ఎత్తున నానా యాగీ చేశారు.

ఈ వార్తలపై స్పందించిన కియా మోటార్స్ ప్లాంట్ తరలిపోతుంది అన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. కియా మోటార్స్ లో పూర్తిస్థాయి ఉత్పత్తి చేయాలన్నదే తమ లక్ష్యమని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూఖ్యూన్ షిమ్ తెలిపారు. దీంతో కియా మోటార్స్ తరలిపోతుందంటూ చేసిన ట్వీట్‌పై రాయిటర్స్‌ మీడియా సంస్థ వివరణ ఇచ్చింది. తాను చేసిన ట్వీట్‌ను డిలీట్‌ చేస్తున్నట్టు వెల్లడించింది. తప్పుడు సమాచారం కారణంగానే ‘కియా మోటార్స్‌ తరలింపు’ వార్తలు ప్రసారమయ్యాయని పేర్కొంది. అయితే రాయిటర్స్‌ సంస్థ అలా ట్వీట్‌ చేయడానికి వెనుక ఉన్న సూత్రధారి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి అని పలు అనుమానాలు ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి జగన్ నిర్వహిస్తున్న మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న కియా మొటార్స్ డైరెక్టర్ అనంతపురం జిల్లాలోని తమ కార్ల తయారీ ప్లాంట్‌ను విస్తరించబోతున్నట్లు ప్రకటించారు. దీని కోసం 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నట్లు వెల్లడించారు. కియా మోటర్స్ ప్రకటనతో ఎల్లోమీడియా, తెలుగుదేశం నేతలు చెసిన దుష్ప్పచారం మరోసారి బట్టబయలైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి