iDreamPost

కేరళ స్థానిక ఎన్నికల్లో సంప్రదాయ ఫలితాలు, ప్రతిపక్షం వైపు మొగ్గుచూపిన మళయాళీలు

కేరళ స్థానిక ఎన్నికల్లో సంప్రదాయ ఫలితాలు, ప్రతిపక్షం వైపు మొగ్గుచూపిన మళయాళీలు

కేరళ స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మూడు దశల్లో సాగిన పోలింగ్ ఫలితాలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 78.62 శాతం పోలింగ్ జరిగింది. అధికార ఎల్డీఎఫ్‌, విపక్ష యూడీఎఫ్ హోరాహోరీగా తలబడ్డాయి. కొన్ని నెలల్లో జరగబోయే శాసన సభ ఎన్నికల ఫలితాలకు అద్దంపట్టేలా స్థానిక ఎన్నికల ఫలితాలుంటాయని అంతా భావిస్తున్నారు. దాంతో అందరి దృష్టి వాటిపై పడింది. అందులోనూ కరోనా విషయంలో కేరళ సర్కారు తీరుకి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. కానీ కేరళ ప్రజల తీర్పు ఎలా ఉందన్నదానికి ఈ ఫలితాలు నిదర్శనంగా ఉంటాయని భావిస్తున్నారు.

సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ లకు దాదాపు సమానంగా ఫలితం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేరళ ఎన్నికల్లో సహజంగా కనిపించే ధోరణి . ప్రతీ ఎన్నికల్లోనూ ఇరు పక్షాలు సమానంగా ఓట్లు సా ధించే పరిస్థితి అక్కడ ఉంటుంది. అయితే 4, 5 శాతం ఉండే తటస్తులు తీర్పు ఆధారంగా తుది ఫలితాలు ఉంటాయి. సాధారణంగా వారు అన్ని వేళలా విపక్షాలకు అండగా ఉండడం, ప్రతిపక్షాలకు పట్టం కట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా దాదాపుగా అదే రీతిలో యూడీఎఫ్ కి స్వల్ప మొగ్గు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రాధమిక అంచనాల ప్రకారం కీలకమైన తిరువనంతపురం కార్పోరేషన్ లో ఎల్డీఎఫ్ ఆధిక్యంలో ఉంది. మొత్తం 6 కార్పోరేషన్లకు గాను యూడీఎఫ్ 4 చోట్ల, ఎల్డీఎఫ్ 2 చోట్ల ఆధిక్యంలో సాగుతున్నాయి. ఇక మొత్తం గ్రామ పంచాయితీల్లో ఎల్డీఎఫ్ 159, యూడీఎఫ్ 144 చోట్ల విజయం సాధించాయి. దాంతో ఫలితాలు హోరాహోరీగా ఉన్నట్టు కనిపిస్తోంది. తుది ఫలితాలు సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది. తుది ఫలితాల్లో యూడీఎఫ్ కి కొంత ఆధిక్యం ఖాయమని అంచనాలున్నాయి.

ఇక బీజేపీ ఆశలు ఈసారి కూడా పండలేదు. రెండు కూటముల మధ్య తాము బలపడాలనే ఉద్దేశంతో ఆపార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉన్న కొద్ది పాటి బలం కూడా కుచించుకుపోతున్నట్టు కనిపిస్తోంది. వరుసగా కేరళ వేదికగా పెద్ద స్థాయి వివాదాలు రాజేసినా ఓటర్లు మాత్రం ఎన్డీయే కూటమి వైపు చూడలేదు. దాంతో ఆ కూటమికి కేవలం 17 చోట్ల మాత్రమే ఆధిక్యం కనిపిస్తోంది. దాంతో గతంతో పోలిస్తే స్వల్పంగా బలం తగ్గుదల ఉన్నట్టు కనిపిస్తోంది. ఏమయినా తదుపరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది తెలుసుకోవడానికి ఈ స్థానిక ఎన్నికలు ఓ ఆధారంగా ఉంటాయని అంతా భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి