iDreamPost

షీలా దీక్షిత్‌ సరసన కేజ్రీవాల్‌..

షీలా దీక్షిత్‌ సరసన కేజ్రీవాల్‌..

చిన్న రాష్ట్రమైనా దేశ రాజధాని కావడంతో ఢిల్లీ శాసన సభకు జరిగే ఎన్నికలు, ఫలితాలపై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. తాజాగా వెలువడిన ఢిల్లీ శాసన సభ ఏడో సాధారణ ఎన్నికల్లో అర్వింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ విజయదుందుభి మోగించింది. మొత్తంగా 62 సీట్లతో ఘన విజయం సాధించింది. 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది.

తాజా విజయంతో అర్వింద్‌ కేజ్రీవాల్‌ ముచ్చటగా మూడో సారి సీఎం కాబోతున్నారు. వరుసగా మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోతున్న కేజ్రీవాల్‌ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత షీలా దీక్షిత్‌ సరసన చేరారు.షీలా దీక్షిత్‌ కూడా వరుసగా మూడు సార్లు ఢిల్లీ సీఎం అయ్యారు. ఇప్పుడు అదే కోవలో కేజ్రీవాల్‌ కుడా ఢిల్లీ పీఠం ఎక్కబోతున్నారు.

1952 ఎన్నికల్లో కేటగిరి – సీ రాష్ట్రంగా ఉన్న ఢిల్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. 1956లో వచ్చిన స్టేట్‌ రియార్గనైజేషన్‌ కమిషన్‌ (ఎస్‌ఆర్‌సీ) వల్ల సీ రాష్ట్రాలు రద్దుయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది. ఆ తర్వాత 1991లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా తిరిగి ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించారు. 1993లో మొదటి సారి ఎన్నికలు జరగగా.. తాజాగా జరిగిన ఎన్నికలు ఏడో విడత.

ఏడు విడతల్లో ఒక సారి బీజేపీ, మూడు సార్లు కాంగ్రెస్, మూడు సార్లు ఆప్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1993లో జరిగిన మొదటి ఎన్నికల్లో 70 స్థానాలు గల ఢిల్లీ శాసన సభలో బీజేపీ 49 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్లలో మదన్ లాల్ ఖురాన, సాహిబ్‌ సింగ్‌ వర్మ, సుస్మా స్వరాజ్‌లు.. ముఖ్యమంత్రులుగా పని చేశారు. 1998 ఎన్నికల్లో 52 సీట్లు, 2003 ఎన్నికల్లో 47, 2008 ఎన్నికల్లో 43 సీట్లు గెలుచుకుని వరుసగా మూడు సార్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ మూడు సార్లు షీలా దీక్షిత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

1993 నుంచి 2013 వరకు నాలుగు పర్యాయాలు ఢిల్లీలో జాతీయ పార్టీలదే హవా కాగా 2013 ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఆప్‌ దూసుకొచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 31, ఆప్‌ 28, కాంగ్రెస్‌ 8 సీట్లు గెలుచుకోవడంతో హంగ్‌ ఏర్పడింది. కాంగ్రెస్‌ మద్దతుతో అర్వింద్‌ కేజ్రీవాల్‌ సీఎంగా ప్రమాణం చేశారు. సంకీర్ణ సర్కారుకు చెల్లుచీటి పాడుతూ.. 2015 ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్‌కు 67 సీట్లతో రికార్డు విజయం అందించడంతో కేజ్రీవాల్‌ రెండో సారి సీఎం అయ్యారు. తిరిగి ఈ రోజు వెలువడిన ఫలితాల్లో 62 సీట్లు గెలుచుకున్న కేజ్రీ ముచ్చటగా మూడో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తద్వారా ఢిల్లీలో వరుసగా మూడు సార్లు సీఎం అయిన షీలా దీక్షిత్‌ సరసన కేజ్రీవాల్‌ నిలవబోతుండడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి