iDreamPost

ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్న ముఖ్యమంత్రి

ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్న ముఖ్యమంత్రి

70 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని తాము ఐదేళ్లలో చేశామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. అందుకే తమ ప్రభుత్వంపై ఢిల్లీ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నిన్న నామినేషన్ల చివరి రోజున కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ శాసన సభకు నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్‌ పై విధంగా వ్యాఖ్యానించారు.

ఢిల్లీ ప్రజలతోపాటు ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు కూడా తమకు ఓట్లు వేయాలని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. వేరే పార్టీ అధికారంలోకి వస్తే తాము చేపట్టిన పథకాలు, అభివృద్ధి ఆగిపోతాయని హెచ్చరించారు. విద్య, వైద్య వ్యవస్థల్లో తాము సమూల మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఆ రెండు వ్యవస్థలను మరింతగా మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో తాగునీరు, ఉచిత విద్యుత్‌ వంటి కార్యక్రమాలు అమలు చేశామని, మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టాలంటే మళ్లీ అధికారం ఇవ్వాలని కోరారు.

70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 8వ తేదీన పోలింగ్‌ జరగనుంది. 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో కేజ్రీవాల్‌ పార్టీ ఆప్‌.. సంచలన విజయం సాధించింది. 67 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. బీజేపీ మూడు సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్‌ ఖాతానే తెరవలేదు. ఈ సారి ఆప్, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్, ఆర్‌జేడీ కూటమి కట్టాయి. ఈ సారి కేజ్రీకే ఢిల్లీ ప్రజలు పట్టం కడతారా…? లేదా మరో పార్టీకి అధికారం ఇస్తారా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి