iDreamPost

కేజ్రీమార్క్ లౌకిక‌వాద‌మా.. సాఫ్ట్ హిందూత్వ‌మా

కేజ్రీమార్క్ లౌకిక‌వాద‌మా.. సాఫ్ట్ హిందూత్వ‌మా

ఢిల్లీలో వ‌రుస‌గా మూడోసారి ముఖ్య‌మంత్రి పీఠం అర‌వింద్ కేజ్రీవాల్ ద‌క్కించుకోవ‌డం చిన్న విష‌యం కాదు. మోడీ-షా కొలువై ఉన్న దేశ రాజ‌ధానిలో వ‌రుస‌గా రెండోసారి ఆ జంట‌ను మ‌ట్టిక‌రిపించ‌డంతో కేజ్రీవాల్ క్రేజ్ అమాతంగా పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. అప‌ర ఛాణిక్యుడిగా అభిమానులు పిలుచుకునే అమిత్ షా ఎంత‌గా ప్ర‌య‌త్నించినా అంతుచిక్క‌కుండా విజ‌య‌బావుటా ఎగురువేసిన ఆప్ విజ‌య ర‌హ‌స్యంపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు సాగుతున్నాయి. సంక్షేమ ప‌థ‌కాలు, కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్, గుజ‌రాత్-ఢిల్లీ మోడ‌ల్ అభివృద్ధిపై చ‌ర్చ అంటూ ప‌లు విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. అదే క్ర‌మంలో విజ‌యం త‌ర్వాత తొలిసారిగా ప్రెస్ మీట్ లో కేజ్రీవాల్ ప్ర‌స్తావించిన హ‌నుమాన్ విష‌యంపై కూడా చ‌ర్చ మొద‌ల‌య్యింది. భార‌త్ మాతాకి జై అంటూ ఏకే చేసిన నినాదాల గురించి కొంద‌రు మాట్లాడుతున్నారు. జై శ్రీరామ్ అంటూ బీజేపీ చేసిన ప్ర‌చారాన్ని తిప్పికొట్టేందుకు సాఫ్ట్ హిందూత్వ వాద‌న‌ను కేజ్రీవాల్ ముందుకు తీసుకొచ్చార‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుని బ‌ల‌ప‌ర‌చ‌డం స‌హా ప‌లు విష‌యాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విధానాల‌ను గుర్తు చేస్తున్నారు. త‌ద్వారా బీజేపీకి విరుగుడు మంత్రం కేజ్రీవాల్ ముందుకు తీసుకొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు.

ఇటీవ‌ల తెలంగాణా స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఇలాంటి వాద‌న‌ను ముందుకు తీసుకొచ్చారు. త‌న‌ను మించిన హిందువు ఎవ‌రంటూ ఆయ‌న ఎదురు ప్ర‌శ్న వేశారు. తాను చేసినన్ని యాగాలు ఏ బీజేపీ నాయ‌కుడ‌యినా చేశారా అంటూ ఆయ‌న నిల‌దీయ‌డం విశేషం. అదే క్ర‌మంలో ఇప్పుడు ఢిల్లీ ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హారం క‌నిపిస్తోంది. దాంతో బీజేపీ హిందూత్వ ఎజెండాకు విరుగుడుగా సాఫ్ట్ , స్ట్ర‌యిట్ హిందూ మ‌త ఆచారాల‌ను ప్ర‌స్తావించ‌డం , పాటించ‌డం వీరి ఎజెండాలో ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. త‌ద్వారా భ‌విష్య‌త్ లో బీజేపీ మ‌త ప్ర‌స్తావ‌న‌కు మంచి మందుగా ఇలాంటి నేతలంతా భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో మోడీ మీద గురిపెట్టి, మిగిలిన అంశాల‌ను విస్మ‌రించే తీరుతో కాకుండా పూర్తిగా మోడీపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు ఈ ఇద్ద‌రు నేత‌లు దూరంగా ఉంటున్నారు. బీజేపీకి ప‌లు అంశాల్లో మ‌ద్ధ‌తుగా ఉంటూనే, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆపార్టీని ఓడించ‌డానికి హిందూ సంప్ర‌దాయాల‌ను పాటించ‌డం ద్వారా బీజేపీకి పెద్ద ప్ర‌శ్న‌గా మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి బీజేపీ లౌకిక‌వాదం మీద గురిపెడుతోంది. సుదీర్ఘ‌కాలంగా దేశ ఐక్య‌త‌కు మూల‌స్తంభంగా ఉన్న సెక్యుల‌రిజాన్ని ఎండ‌గ‌డుతోంది. దాని గురించి మాట్లాడేవారిని సూడో సెక్యుల‌రిస్టులు, మ‌తోన్మాదుల‌ను బుజ్జ‌గిస్తున్నారంటూ కాంగ్రెస్ వైఖ‌రిని ప్ర‌స్తావిస్తూ ఏకంగా రాజ్యాంగ ప్రాధ‌మిక సూత్రాల మీద దాడి చేస్తోంది. అలాంటి స‌మ‌యంలో లౌకిక వాదం అంటే అన్ని మ‌తాల‌కు స‌మాన ఆదర‌ణ కాద‌ని, మ‌తానికి, రాజ్యానికి సంబంధం లేని పాల‌న అనే అస‌లు విష‌యాన్ని మ‌రుగున ప‌రుస్తోంది. త‌ద్వారా మెజార్టీ మ‌త‌స్తుల‌ను మ‌చ్చిక చేసుకునే మార్గంగా మ‌ల‌చుకుంది. ఈ ప‌రిణామాల‌తో లౌకిక‌వాదం వ్య‌క్తిగ‌త ఆచారాల‌తో ముడిపెట్ట‌డం స‌రికాద‌ని స్వ‌తంత్ర్య‌పోరాటం నుంచే ఈ దేశానికి అనుభ‌వం ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు మ‌హాత్మ‌గాంధీ నిత్యం రామ‌నామం జ‌పించేవారు. రాముడి భ‌క్తుడిన‌ని చెప్పుకోవ‌డానికి సందేహించ‌లేదు. అయినా ఆయ‌న ఇత‌ర మ‌తాల విష‌యంలో ఎటువంటి ప‌ట్టింపులు లేకుండా వ్య‌వ‌హ‌రించారు. త‌ద్వారా స‌ర్వ‌మ‌తాలు ఒక‌టేన‌నే సందేశాన్ని ఇచ్చారు. దేశంలో లౌకిక‌త‌త్వ విధానాల‌ను పాటించ‌డం ద్వారా భార‌తీయ‌త నిలుస్తుంద‌ని చాటారు. తాను సనాత‌న హిందువున‌ని చెప్పుకోవ‌డానికి, చివ‌ర‌కు వ‌ర్ణాశ్ర‌మ ధ‌ర్మాన్ని కూడా పాటించాల‌ని అన‌డానికి సందేహించ‌ని గాంధీ, పాల‌నా విష‌యాల్లో మాత్రం లౌకిక‌వాదాన్ని బ‌ల‌ప‌ర‌చ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు కేజ్రీవాల్, కేసీఆర్ వంటి వారు కూడా త‌మ సొంత మ‌తాచారాల విష‌యంలో వెన‌కడుగు వేయ‌కుండానే లౌకిక‌త‌త్వ ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్ప‌డం ద్వారా బీజేపీకి బ్రేకులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

మ‌తాచారాల‌ను పాటించ‌డం ఎవ‌రికీ అభ్యంత‌రం ఉండ‌దు. అది వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ అన‌డంలో సందేహం లేదు. భార‌త రాజ్యాంగం కూడా అదే చెబుతోంది. ఇత‌ర మ‌తాల‌ను నిందించ‌డం, ఇత‌ర మ‌త‌స్తుల‌ను వేధించ‌డం, కించ‌ప‌ర‌చ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినప్పుడే మ‌తోన్మాద ప్ర‌మాదం దాపురిస్తుంది. అది దేశానికి అపార న‌ష్టం చేస్తోంది. భార‌తీయుల మ‌ధ్య మ‌త విభ‌జ‌న‌కు కార‌ణం అవుతోంది. అలాంటి విభ‌జ‌న రాజ‌కీయాల ద్వారా అధికారం సాధించిన పాల‌కులు మ‌రింత‌గా చిచ్చు పెట్టే చ‌ట్టాల‌ను రూపొందిస్తున్న క్ర‌మంలో కేజ్రీవాల్ విజ‌యం , దాని వెనుక ఆయ‌న హిందూ మంత్రం విశేషంగా మారుతున్నాయి. స్వ‌తంత్ర పోరాటంలో కూడా తిల‌క్ స‌హా అనేక‌మంది గ‌ణేష్ మండ‌పాల‌ను కూడా ప్ర‌జ‌ల్లో స్వ‌తంత్రకాంక్ష ర‌గిలించేందుకు వాడుకున్న‌ట్టుగా ఈ హ‌నుమాన్ ముద్ర‌తో కేజ్రీవాల్, యాగాల ద్వారా కేసీఆర్ వంటి వారు ఎంత‌వ‌ర‌కూ బీజేపీకి అడ్డుక‌ట్ట వేయ‌గ‌లుగుతారు అన్న‌ది చూడాలి. ఇలాంటి హిందూమ‌తాచారాల‌ను బ‌హిరంగంగా పాటిస్తూ బీజేపీ మ‌త రాజ‌కీయాల‌కు ఎదురుతిరుగుతున్న నేత‌ల‌ను ఆపార్టీ ఎలా ఎదుర్కొంటుంద‌న్న‌ది కూడా ఆస‌క్తిక‌ర‌మే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి