iDreamPost

కర్ణాటక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే

కర్ణాటక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే

రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించడంతో కన్నడనాట రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కర్ణాటకలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈనెల 19న పోలింగ్‌ జరుగనుంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ నేత మల్లికార్జున్ ఖర్గేను తమ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించింది.గత లోక్‌సభ ఎన్నికలలో మల్లికార్జున్ ఖర్గే గుల్బర్గా నియోజకవర్గం నుండి పోటీ చేసి బిజెపి అభ్యర్థి ఉమేష్ జాదవ్ చేతిలో ఓటమి చవి చూశారు.

2019 సాధారణ ఎన్నికలలో ఓటమి అనంతరం మాజీ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే జాతీయ రాజకీయాలలోకి తిరిగి ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు.ఈ క్రమములో ఆయన తన రెండవ ఇన్నింగ్స్‌ను రాజ్యసభ ద్వారా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే పార్టీ అధిష్టానం రాజ్యసభ ఎన్నికలలో ఆయనకు అవకాశం కల్పించింది. అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నందున ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడు గెలిచేందుకు 48 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

కర్ణాటకలో 117 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బిజెపి సునాయాసంగా ఇద్దరు రాజ్యసభ సభ్యులను గెలిపించుకోగలదు. ప్రస్తుతం కాంగ్రెస్‌కి 67 మంది, జెడి (ఎస్)కు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.కాబట్టి కాంగ్రెస్ కూడా ఒక రాజ్యసభ సీటు సులువుగా నెగ్గగలదు.అదే సందర్భంలో కాంగ్రెస్‌కు గానీ,బిజెపికి గానీ జెడిఎస్ మద్దతు లేకుండా అదనంగా సీటు గెలిచే అవకాశం లేదు.దీంతో నాలుగో రాజ్యసభ స్థానంపై కాంగ్రెస్,బిజెపి పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.ఇక తమ తరుపున రాజ్యసభ సభ్యుడిని గెలిపించేందుకు జనతాదళ్ (సెక్యులర్)కు మరో 14 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాల్సి ఉంది.

ఈ నెంబర్ గేమ్ ను దృష్టిలో ఉంచుకుని మొన్నటి వరకు తమ మిత్రపక్షంగా ఉన్న జనతాదళ్ (సెక్యులర్) కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డి దేవెగౌడ రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేస్తే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్, జెడి (ఎస్) వర్గాలు చెబుతున్నాయి.కానీ పరోక్ష ఎన్నికైన రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయడానికి దేవెగౌడ నిరాకరిస్తున్నాడు.

అయితే అతని కుమారుడు,మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి, ఇతర జెడిఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రతిపాదనను ఒప్పుకోమని దేవెగౌడకు సూచించినట్లు తెలిసింది. పాత మిత్రపక్షాలు కాంగ్రెస్‌-జెడిఎస్ చేతులు కలిపితే అధికార బిజెపి రెండు రాజ్యసభ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌, జెడిఎస్ కూడా చెరో స్థానం దక్కించుకోవచ్చు. మరోవైపు నాలుగో స్థానంపై సస్పెన్స్ వీడకపోవడంతో అన్ని రాజకీయ పక్షాలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి