iDreamPost

45 ఏళ్ల త‌రువాత ఇండియా-చైనా స‌రిహ‌ద్దు వ‌ద్ద ఘ‌ట‌నః- మృతి చెందిన కల్నల్ తెలంగాణ వాసి

45 ఏళ్ల త‌రువాత ఇండియా-చైనా స‌రిహ‌ద్దు వ‌ద్ద ఘ‌ట‌నః- మృతి చెందిన కల్నల్ తెలంగాణ వాసి

ఇండియా-చైనా స‌రిహ‌ద్దు ప్రాంతంలో మ‌ళ్లీ 45 ఏళ్ల త‌రువాత మొద‌టి సారి సైనికులు మృత్యు ఘ‌ట‌న చోటు చేసుకుంది. లైన్ ఆఫ్ యాక్చువ‌ల్ కంట్రోల్ (ఎల్ఎసి) వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. చైనాతో భార‌త దేశ స‌రిహ‌ద్దు స‌మ‌స్య ద‌శాబ్దాలుగా కొన‌సాగుతుంది.

అయితే చివ‌రిసారిగా 45 ఏళ్ల క్రితం చైనా తులుంగ్లాలో అస్సాం రైఫిల్స్ పెట్రోలింగ్‌ను మెరుపుదాడికి గురి చేసింది. 1975 అక్టోబ‌ర్ 20న తులుంగ్‌లాలో భార‌త‌దేశం న‌లుగురు సైనికుల‌ను కోల్పోయింది. అప్పుడే చివరిసారిగా భారతదేశం-చైనా సరిహద్దులో బుల్లెట్లను కాల్పులు జ‌రిగాయి. అయితే ఇరు దేశాలు 1987లో సుమ్‌డోరోంగ్ చు లోయలోనూ, 2013లో డెప్సాంగ్ లోనూ,  2014 లో చుమర్ వద్ద, 2017లో డోక్లామ్ వ‌ద్ద చిన్న చిన్న చేదు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి.

1962 నుంచి 1975 మ‌ధ్య‌ భారతదేశం, చైనా మధ్య 1967 లో నాథూ లా పాస్ లో అతి పెద్ద ఘ‌ర్ష‌ణ‌ జ‌రిగింది. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో 80 మంది భారతీయ సైనికులు చ‌నిపోయారు. ఇందులో మ‌ర‌ణించిన వారిలో చైనా సైనికులు కూడా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.  ఆ త‌రువాత జ‌రిగిన ఘ‌ట‌న ఇదే.

ఈ ఘర్షణలో ఒక అధికారి (కల్నల్), ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్ బాబు సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సంతోష్‌ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి ఉపేంద్ర‌, త‌ల్లి మంజులకు ఒక్క‌డే కుమారుడు. బిక్కుమ‌ల్ల సంతోష్ బాబు ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు సూర్యాపేట‌లో చ‌దువుకున్నారు. ఆరో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్మీడియేట్ వ‌ర‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చ‌దువుకున్నాడు. డిగ్రీ పుణేలోనూ, ఐఎంఎ డెహ్రాడూన్‌లోనూ పూర్తి చేశారు. సంతోష్ మొద‌టి పోస్టింగ్ జ‌మ్ము కాశ్మీర్‌లో చేశారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. భార్య, పిల్లలు ఢిల్లీలోనే ఉంటున్నారు. 

హైదరబాద్‌కు బదిలీ అంతలోనే…

సంతోష్‌ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందరు. మూడు నెలల క్రితమే సంతోష్‌ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. సంతోష్‌ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె త‌ల్లి మంజుల మాట్లాడుతూ త‌న కుమారుడు వీర మ‌ర‌ణం ఒక‌వైపు బాధ‌గానూ, మ‌రోవైపు సంతోషంగా ఉంద‌ని అన్నారు. దేశం కోసం త‌న కొడుకును ఇచ్చినా…త‌ల్లిగా బాధ‌ప‌డుతున్నాన‌ని క‌న్నీరు మున్నీరు అయ్యారు. త‌న‌కు ఒక్క‌డే కుమారుడ‌ని, ఒక కూతుర‌ని తెలిపారు. త‌న కోడ‌లు ఢిల్లీలో ఉంటుంద‌ని, ఆమెకు సోమ‌వారం రాత్రే స‌మాచారం అందింద‌ని, తాను త‌ట్టుకోలేన‌ని త‌న‌కు మాత్రం ఈ రోజు మ‌ధఆ్యాహ్నం 2 గంట‌ల‌కు త‌న కోడ‌లు స‌మాచారం అందించిన‌ట్లు తెలిపారు. 

లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో  భారత్‌, చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.

సంతోష్ తోపాటు ఇద్ద‌రు జ‌వాన్లు మ‌ర‌ణించారు. అందులో త‌మిళ‌నాడులోని రామ్‌నాథ్ పురం జిల్లాలోని క‌డుక్కుల్లూర్ గ్రామానికి చెందిన ప‌ల‌నీ, జార్ఖండ్ లోని స‌హ్బీగంజ్‌కు చెందిన కుంద‌న్ కుమార్ ఓఝా ఉన్నారు.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి