iDreamPost

తెరకెక్కనున్న రియల్ మల్లేశ్వరి

తెరకెక్కనున్న రియల్ మల్లేశ్వరి

మల్లీశ్వరి అని పేరు వినగానే మనకు గుర్తొచ్చే పేర్లు రెండే. ఒకటి భానుమతి గారు. రెండు కత్రినా కైఫ్. ఈ టైటిల్ తో రెండు సినిమాలు సాధించిన విజయం తాలుకు ప్రభావం అది. కాని ఈ పాత్రలు కల్పితం. కాని నిజ జీవితంలోనూ ఓ మల్లీశ్వరి ఉన్నారని క్రీడల పట్ల ఆవగాహన ఉన్న వాళ్ళెవరైనా టక్కున చెప్తారు. ఆవిడే కరణం మల్లేశ్వరి. లేడీ వెయిట్ లిఫ్టర్ గా 2000 ఒలంపిక్స్ లో కాంస్య పతాకం సాధించిన మల్లేశ్వరి దేశం గర్వపడే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్నారు. 12 ఏళ్ళ వయసులోనే నీలంశెట్టి అప్పన్న అనే శిక్షకుడి ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకున్న మల్లేశ్వరి ఆ తర్వాత మూడేళ్ళకే ఢిల్లీలోని నేషనల్ క్యాంప్ లో జాయినైపోయారు.

1994లో ఇస్తాంబుల్ లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ ఆ తర్వాత ఏడాది ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ గెలవడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఐదుగురు ఆడ సంతానంలో ఒకరైన మల్లేశ్వరి రిటైర్ అయ్యాక ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియాలో ఉన్నత ఉద్యోగంలో స్థిరపడ్డారు. పేదరికంలో పుట్టి పెరిగిన మల్లేశ్వరి ఎదుగుదలలో చాలా పోరాటం ఉంది. దాన్నే స్ఫూర్తిగా తీసుకుని రచయిత కోన వెంకట్ బయోపిక్ నిర్మించే ఆలోచనలో ఉన్నారట.

దీనికి సంబంధించిన అనుమతులు చర్చలు ఇటీవలే పూర్తి చేశారని సమాచారం. అయితే మల్లేశ్వరిగా ఎవరు నటిస్తారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మల్లేశ్వరిది కాస్త బొద్దుగా ఉండే రూపం. బయోపిక్ సహజంగా రావాలంటే ఆ రూపం ఉన్న ఆర్టిస్ట్ నే తీసుకోవాలి. అలా అని ఇమేజ్ లేని హీరోయిన్లతో చేస్తే బిజినెస్ చిక్కులు వస్తాయి. మరి కోన వెంకట్ ఎవరిని సెలెక్ట్ చేసుకోబోతున్నాడో వేచి చూడాలి. కథానాయిక సెట్ అయిపోతే షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టబోతున్నారని న్యూస్. దర్శకత్వం కూడా ఒక స్టార్ డైరెక్టర్ డీల్ చేసే ఛాన్స్ ఉందని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి అచ్చ తెలుగు మహిళా క్రీడాకారిణి బయోపిక్ త్వరలోనే రాబోతుందన్న మాట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి