iDreamPost

జగన్ను కలవటం ఇప్పుడు కరణం బలరాం వంతు

జగన్ను కలవటం ఇప్పుడు కరణం బలరాం వంతు

సీనియర్ టిడిపి నాయకుడు, ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ రాత్రికి కరణం బలరాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కరణం బలరాం,ఆయన తనయుడు వెంకటేష్ గత ఎన్నికలకు ముందే వైఎస్సార్ సీపీలో చేరుతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. బలరాం అడిగిన సీట్లు ఇవ్వటానికి వైసీపీ తిరష్కరించటంతో ఆయన టీడీపీ లోనే కొనసాగాడు.

చీరాల శాససభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ ని వీడి వైసీపీ లో చేరడంతో ఖాళీ అయిన చీరాల సీటును బలరాంకి ఇచ్చారు. అద్దంకిని గొట్టిపాటికి ఇచ్చే ఒప్పందం మీద చీరాల ఎమ్మెల్యే సీటు ఇవ్వటంతో పాటు ఎన్నికలకయ్యే వ్యయం కోసం బుజ్జి చేత ఆర్ధిక సహాయం , వైసీపీ కోసం ఐదేళ్లు కష్టపడి ఎన్నికల ముందు సీటు రాక టీడీపీ పార్టీకి మారిన యెడం బాలాజీ సపోర్ట్ లాంటివి బేరీజు వేసుకుని అప్పటి పరిస్థితుల బట్టి అసంతృప్తిగానే చీరాలలో పోటీకి ఒప్పుకొన్నాడని అప్పట్లో టీడీపీ శ్రేణుల్లో బాగా చర్చ నడిచింది .ఆమంచి మీద వ్యతిరేకత వలనో లేక బలరాం అదృష్టమోగాని వైసీపీ సునామీని తట్టుకొని బలరాం గెలిచాడు.

అయితే తాజాగా కరణం బలరాం ముఖ్యమంత్రిని జగన్ ను కలుస్తున్నారనే వార్తలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న తరుణంలో కరణం బలరాం సీఎంను కలవబోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది . ఇదే సమయంలో బలరాం తీరు గమనించిన బాబు అమెరికాలో ఉన్న చీరాల నేత యెడం బాలాజీని హుటాహుటిన పిలిపిస్తున్నారని సమాచారం , బహుశా ఆయన రేపటికే ఇండియా రావొచ్చు .

కరణం బలరాంకు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. మార్టూరు & అద్దంకి శాసనసభ్యుడిగా మరియు ఒంగోలు ఎంపీగా పనిచేసిన ఆయనకు ప్రకాశం జిల్లా రాజకీయాలపై మంచిపట్టు ఉంది.ప్రస్తుత శాసనసభల్లో 1978 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఇద్దరే ఇద్దరు… ఒకరు చంద్రబాబు మరొకరు కరణం బలరాం.. అంత సీనియర బలరాం .చంద్రబాబు ,బలరాంల మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. చంద్రబాబు కు అప్పట్లో పెళ్లి సంబంధం కూడా చూశానని బలరాం చెప్తుంటారు.

అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే వచ్చినా కచ్చితంగా రాజీనామా చేసి రావాలని, ఫిరాయింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమని జగన్ ఎన్నికల ముందు నుంచి చెబుతూ వచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే సిద్ధాంతం పై నిలబడి ఉన్నారు.

చంద్రబాబుతో విభేదించి జగన్ ని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు గన్నవరం వంశీ మరియు గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి భవిష్యత్ ఇప్పటికి తేలలేదు. వారు జగన్ ను మరోసారి కలిసింది లేదు. సీనియర్ నాయకుడిగా ఉన్న కరణం బలరాం అవన్నీ ఆలోచించుకోకుండా ,భవిషత్తు మీద నిర్దిష్ట వాగ్దానం లేకుండా ముఖ్యమంత్రిని కలవరు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 

అయితే ప్రస్తుతం కరణం బలరాం వైసిపికి మద్దతిచ్చేందుకు ముఖ్యమంత్రిని కలుస్తారా లేదా మరేదైనా కారణం ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ కరణం బలరాం టిడిపిని వీడితే జిల్లాలో పలు నియోజక వర్గాల్లో ప్రభావం చూపగల నేతని కోల్పోయినట్టవుతుంది . ఇది తెలుగుదేశం పార్టీకి జిల్లాలో కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి