iDreamPost

దళిత మహిళ వంటను తినని చిన్నారులు.. కనిమొళిపై ప్రశంసలు

దళిత మహిళ వంటను తినని చిన్నారులు.. కనిమొళిపై ప్రశంసలు

తమిళనాడు ఇటీవల వరుసగా చర్చల్లో నిలుస్తోంది. సనాతన ధర్మంపై డీఎంకే ఎమ్మెల్యే, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలుసు. దేశమంతా ఈ వ్యాఖ్యలపై చర్చించుకుంది. ఇదే సమయంలో మరో ఘటనతో వార్తల్లో నిలిచింది. అదేంటంటే ముఖ్యమంత్రి అల్పాహార పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు వండి వారుస్తున్నారు. అయితే ఓ పాఠశాలలో అల్పాహారాన్ని దళిత మహిళ వండి, తమ పిల్లలకు వడ్డించడాన్ని తల్లిదండ్రులు అడ్డుకోవడమే కాకుండా.. చిన్నారులను తినకుండా నిలువరిస్తున్నారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం కాగా, అధికార పార్టీ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై అధికార పార్టీ ఎంపీ స్పందించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

దేశం శాస్త్ర సాంకేతికంగా ఎంతో ఎత్తుకు వెళుతుంది. చంద్రుడు, సూర్యుడు, సముద్రంపై ప్రయోగాలు చేస్తే స్థాయికి ఎదిగింది. అయినప్పటికీ ఇంకా కుల, మత అసమానతలు మాత్రం రూపు మాపడం లేదు. అణగారిన వర్గాలు, ఉన్నత వర్గాలు అంటూ చూస్తున్నారు. కుల వివక్షతో కొట్టుకు చస్తున్నారు. ఇంకా వెనుకబడిన వర్గాలను ఇంట్లోకి రాని గ్రామాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తాజాగా తమిళనాడులోని ఎట్టయ్యపాలెం సమీపంలోని చిన్నమలై కుండ్రు గ్రామ పంచాయతీ పరిధిలోని ఉసిలం పట్టికి చెందిన వంటమనిషి మునియసెల్వి తయారు చేసిన ఆహారాన్ని తమ పిల్లలు తినకుండా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దానికి కారణం ఆమె దళిత మహిళ కావడం. ఆ పాఠశాలలో 11 మంది పిల్లలు ఉంటే 9 మంది ఆహారాన్ని తీసుకోవడం లేదు. ఈ విషయంపై కోవిల్ పట్టి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆ తల్లిదండ్రులతో మాట్లాడినప్పటికీ ఉపయోగం లేదు. ఆ మహిళపై తమకేమీ పగలేదని, అయినప్పటికీ తమ పిల్లలు ఆహారాన్ని తినరని తెగేసి చెప్పారు. చివరకు ఆ వంట ఆవిడను మరో చోటికి బదిలీ చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ ఘటనపై  ఎంతో ఆవేదన చెందింది దళిత మహిళ మునియసెల్వి.

ఎట్టకేలకు ఈ అంశం అధికార డీఎంకే దృష్టికి వెళ్లింది.దీనిపై వెంటనే స్పందించారు డీఎంకే ఎంపీ కనిమొళి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.గీతాజీవన్, జిల్లా కలెక్టర్ సెంథిల్ రాజ్‌తో కలిసి పాఠశాలలను సందర్శించారు. ఆ సమయంలోనే పిల్లలతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం వంటావిడ మునియసెల్వితో మాట్లాడారు. గ్రామ కమిటీ సభ్యులతో చర్చలు జరిపారు. గ్రామ పెద్ద గ్రామంలో కుల వివక్ష లేదంటూ పునరుద్ఘాటించారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే పిల్లల్ని అల్పాహారం తీసుకునేందుకు అనుమతించాలని తల్లిదండ్రులను కనిమొళి కోరారు. ఆమె చేసిన ఈ చర్యల పట్ల అందరూ కొనియాడుతున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని’ ప్రారంభించారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. దీని కింద రోజుకు 15.75 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందజేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి