iDreamPost

తమ్ముడూ….! సచిన్,ధోనీలను చూసి నేర్చుకో:కమ్రాన్ అక్మల్

తమ్ముడూ….! సచిన్,ధోనీలను చూసి నేర్చుకో:కమ్రాన్ అక్మల్

భారత అగ్ర ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, ధోనీ,కోహ్లీ నుంచి మైదానం లోపలా బయటా ఎలా హుందాగా ప్రవర్తించాలో నేర్చుకోవాలని తన సోదరుడు, పాక్‌ నిషేధిత క్రికెటర్ ఉమర్‌ అక్మల్‌కు వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ సూచించాడు.ఈ ఏడాది ప్రారంభములో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఫిక్సింగ్ చేయమంటూ తనను కలిసిన బుకీల సమాచారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులకి అతను తెలపలేదు.కానీ ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో విచారణ జరిపిన పీసీబీ గత సోమవారం అన్ని ఫార్మాట్‌లలో క్రికెట్ ఆడకుండా ఉమర్ అక్మల్‌ను మూడేళ్లపాటు నిషేధించింది.

పాక్ కీపర్ కమ్రాన్ అక్మల్ తన సోదరుడు ఉమర్ అక్మల్ నిషేధంపై స్పందిస్తూ ‘‘ఉమర్‌కి నేనిచ్చే సలహా ఏంటంటే,అతను తన గత తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. నేడు ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఒకప్పుడు ఐపీఎల్‌లో తన దూకుడు వ్యవహారశైలితో విమర్శలు ఎదుర్కొన్నాడు.కానీ వాటి నుంచి అతను పాఠాలు నేర్చుకుంటూ ఉన్నత స్థితికి చేరాడు.అలాగే భారత మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోనీ,సచిన్ టెండూల్కర్ గ్రౌండ్‌లోనే కాదు,బయట కూడా ఒక క్రికెటర్ ఎలా హుందాగా నడుచుకోవాలో ఆచరణలో చూపారు. మరీ ముఖ్యంగా సచిన్ ఎటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు.వారిని గమనించైనా ఉమర్ నేర్చుకోవాలి’’ అని సూచించాడు.

నీతి ప్రవచనాలు వల్లిస్తున్న కమ్రాన్ అక్మల్ కూడా సామాన్యుడు ఏమీ కాదు.పలు సందర్భాలలో అతను కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో తన ప్రవర్తనతో వివాదాస్పద వ్యక్తిగా పేరు గడించాడు.2010 ఆసియా కప్‌లో అతను భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌తో గొడవ పడ్డాడు. ఆ తర్వాత 2012లో బెంగళూరు వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మతో వాగ్వాదానికి దిగాడు. అయితే ప్రస్తుతం పాక్ జట్టులో స్థానం కోల్పోయిన కమ్రాన్ దేశవాళీ క్రికెట్‌కు పరిమితమయ్యాడు.

ఇక న్యూజిలాండ్‌పై ఆడిన తొలి టెస్టులోనే ఉమర్ అక్మల్ 160 బంతులలో 129 పరుగులు చేసి విదేశీ గడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రెండో పాక్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు.కానీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ స్థాయి ప్రదర్శన కనబరచని అతను 16 టెస్ట్ లు,121 వన్డేలు, 84 టీ-20 మ్యాచ్‌లలో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.తాజాగా 29 ఏళ్ల ఉమర్ అక్మల్‌ మూడేళ్ల నిషేధానికి గురవడంతో అతని క్రికెట్ కెరీర్ ముగిసినట్లే అని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి