iDreamPost

కర్ణాటక కంబళ వీరుడికి అరుదైన ఆహ్వానం..

కర్ణాటక కంబళ వీరుడికి అరుదైన ఆహ్వానం..

కర్ణాటక లో జరిగిన కంబళ పోటిలో చిరుత వేగంతో పరిగెత్తిన శ్రీనివాస గౌడ వీడియో సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవ్వడం తో పాటు దేశంలోని ప్రముఖ వార్తా సంస్థలన్ని ఈ యువకుడి గురించి ప్రసారం చెయ్యడంతో శ్రీనివాస గౌడ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అతను సాధించిన ఘనత ని కొనియాడుతూ పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

గతవారం కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు సమీపంలో కంబళ పోటిలో అతను తన దున్నపోతుల జతతో 142.50 మీటర్ల దూరాన్ని అందరికంటే వేగంగా 13.62 సెకన్ల రికార్డ్ టైమ్ లో పూర్తి చేసినట్టు ప్రకటించిన నిర్వాహకులు అతన్ని విజేతగా ప్రకటించారు. ఆ వివరాల ప్రకారం ఈ వేగాన్ని 100 మీటర్లకు లెక్కేస్తే 9.55 సెకన్లుగా తేలింది. అయితే ఈ వేగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తిన రికార్డ్ లను తన పేరిట నమోదు చేసుకున్న జమైకన్ పరుగుల వీరుడు ఉసేన్ బొల్ట్ పేరిట ఉన్న ఆల్ టైం ప్రపంచ రికార్డ్ ( 100 మీటర్ల పరుగు పందెం 9.58 సెకన్లు) కన్నా ఇది.3 సెకన్లు తక్కువ సమయం. దీనితో శ్రీనివాస గౌడ వేగంలో ఉసేన్ బొల్ట్ ని మించిపొయాడంటూ పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ ఘటన పై స్పందించిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా శ్రీనివాస్ కు ఉత్తమ శిక్షణ ఇప్పిస్తే అతను మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉందని, ఆతని శరీర ధారుడ్యం చూస్తుంటే అతడు అద్లెటిక్స్ లో అత్యున్నతంగా రాణించే సామర్ధ్యం ఉందని, అతనికి 100 మీటర్ల పరుగు పందెంలో శిక్షణ ఇప్పించినా.. లేదా కంబళ ఈవెంట్ ని ఒలంపిక్స్ లో చేర్చినా.. దేశానికి స్వర్ణం ఖాయమని తన వ్యక్తిగత ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ తన ట్విట్ ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు కి ట్యాగ్ చేశాడు.

దీనిపై స్పందించిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కేంద్ర క్రీడా సాధికారిత సంస్థ ‘శాయ్’ ద్వారా అత్యున్నత కోచ్ ఆధ్వర్యంలో శ్రీనివాస గౌడ కు ట్రయిల్ నిర్వహించెందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. కేంద్ర మంత్రి చొరవతో వెంటనే స్పందించిన కేంద్ర క్రీడా సాధికారిత సంస్థ ‘శాయ్’ శ్రీనివాస గౌడ కు ఆహ్వానం పంపింది.

28 ఏళ్ల శ్రీనివాస గౌడకు ట్రయల్స్ కు రావాల్సిందిగా ఇప్పటికే సమాచారం తెలియజేశామని, ఆతని కోసం ట్రైన్ టికెట్స్ కుడా బుక్ చేశామని, సోమవారం బెంగుళూరులో ‘శాయ్’ సెంటర్ లో ప్రఖ్యాత కోచ్ లు నిపుణుల సమక్షంలో ట్రయల్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని శాయ్ ట్విట్ చేసింది.

ఈ నేపధ్యంలో బురద నీళ్లలో రికార్డ్ వేగంతో పరిగెత్తి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న శ్రీనివాస గౌడ నిపుణుల సమక్షంలో రన్నింగ్ షు ధరించి ‘సింతటిక్ రన్నింగ్ ట్రాక్’ పై జరిగే ‘ట్రయల్ రన్’ లో ఏమాత్రం రాణిస్తాడో చూడాలి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి