iDreamPost

థియేటర్లో హిట్టు – టీవీలో ఫట్టు

థియేటర్లో హిట్టు – టీవీలో ఫట్టు

అదేంటో ఈ మధ్య థియేటర్లలో బ్రహ్మాండంగా ఆడి బ్లాక్ బస్టర్లుగా పేరు తెచ్చుకున్న సినిమాలు శాటిలైట్ ప్రీమియర్లలో తుస్సుమంటున్నాయి. దానికి తాజా ఉదాహరణ విక్రమ్ హిట్ లిస్ట్ కు వచ్చిన టిఆర్పి. ఇటీవలే టెలికాస్ట్ జరుపుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు వచ్చిన రేటింగ్ కేవలం 5.1. ఇది చాలా అంటే చాలా తక్కువ. ఎన్నో ఏళ్లుగా సక్సెస్ కు దూరమై విజయం కోసం కమల్ హాసన్ పరితపించిపోతున్న టైంలో దక్కిన ఆల్ టైం సెన్సేషన్ ఇది. ముఖ్యంగా తమిళ వెర్షన్ సాధించిన సునామి అంతా ఇంతా కాదు. వరల్డ్ వైడ్ ఏకంగా మూడు వందల కోట్లకు పైగా రాబట్టి రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి స్ట్రాంగ్ మార్కెట్ లీడర్లకు షాక్ ఇచ్చింది.

ఈ మధ్య ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. కెజిఎఫ్ చాప్టర్ 2 కూడా కేవలం 10 లోపే రేటింగ్ కు పరిమితం కావాల్సి వచ్చింది. ఆర్ఆర్ఆర్ 1100 కోట్ల కలెక్షన్లు రాబట్టినా బుల్లితెరపై మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుని దాటలేకపోయింది. ఇప్పుడు విక్రమ్ వంతు వచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ రివెంజ్ డ్రామాలో సూర్య చేసిన క్యామియో, అద్భుతం అనిపించే ట్విస్టులు వెరసి మూడు గంటల నిడివి వెండితెరపై ఏ మాత్రం బోర్ అనిపించలేదు. తెలుగు హక్కులను కేవలం ఆరు కోట్లకు కొంటె ఏకంగా పదిహేను కోట్లకు పైగా రాబట్టి నిర్మాతతో పాటు బయ్యర్లను లాభాల్లో ముంచెత్తింది. అయితే టీవీ రెస్పాన్స్ మాత్రం ఊహించనిది.

దీనికి కారణం ఉంది. థియేటర్ ఓటిటి శాటిలైట్ వీటి మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా పెరిగిపోతోంది. ముఖ్యంగా యాడ్స్ లేకుండా డిజిటల్ లో చూడటం అలవాటైన ప్రేక్షకులకు ఓపికగా గంటల తరబడి ప్రకటనలతో టీవీలో చూసే ఓపిక ఉండటం లేదు. దానికి తోడు ఆన్ లైన్ పైరసీ, లోకల్ కేబుల్ ఛానల్స్ ముందే ప్రసారం చేయడం లాంటి పరిణామాలు ఇలాంటి ఫలితాలకు దారి తీస్తున్నాయి. ఒకప్పుడు టెక్నాలజీ ఇంత స్థాయిలో లేదు కాబట్టి సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ సైతం 14 రేటింగ్ తెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడలా కాదు. విక్రమ్ కూడా హాట్ స్టార్ లో వచ్చిన రెండు నెలల తర్వాత టీవీలో వస్తే ఇంతకన్నా నెంబర్లు ఆశించడం కరెక్ట్ కాదుగా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి