iDreamPost

20 సంవత్సరాల కహో నా ప్యార్ హై – Nostalgia

20 సంవత్సరాల కహో నా ప్యార్ హై – Nostalgia

సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం అంటే 2000వ సంవత్సరం జనవరి 14న ప్రముఖ నటుడు దర్శకుడు రాకేష్ రోషన్ తన తనయుడు హృతిక్ రోషన్ ని హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కహో నా ప్యార్ హై విడుదల. వారసత్వం ట్యాగ్ తో కొడుకుని లాంచ్ చేసినప్పటికీ రాకేష్ రోషన్ మరీ అమితాబ్ బచ్చన్ అంత రేంజ్ వాడు కాదు. అందుకే ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించేలా వచ్చాయి . 

రాకేష్ తమ్ముడు రాజేష్ రోషన్ అందించిన సంగీతం అప్పటికే యూత్ కు ఎక్కేసింది కానీ సౌత్ ప్రేక్షకులకు ఇంకా రీచ్ కాలేదు . రెండు మూడు రోజులు వసూళ్లు గొప్పగా లేవు. క్రిటిక్స్ ఇంత రొటీన్ సినిమాని కొడుకుతో ఎలా తీయాలనిపించిందని నిలదీస్తూ రివ్యూలు రాశారు. కానీ రాకేష్ రోషన్ లెక్కలు అంచనాలు వేరే ఉన్నాయి. అలా వారం గడవకుండానే అప్పుడు మొదలైంది సునామి

ఎక్కడ చూసినా కహో నా ప్యార్ హై గురించిన కబుర్లే. ఎవరి నోట విన్నా కొత్త కుర్రాడు హృతిక్ ఆరుపలకల దేహం గురించి, మతి పోయేలా చేసిన డాన్సుల గురించిన చర్చే. ఆడియో క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అప్పుడప్పుడే మొగ్గతొడుతున్న సిడిల కల్చర్  రెక్కలు విప్పుకుంది. టి స్టాల్స్ మొదలుకుని పబ్బుల దాకా ఇవే పాటలు మారుమ్రోగిపోతున్నాయి. 

మరోవైపు థియేటర్ల దగ్గర యూత్ అందులోనూ ముఖ్యంగా అమ్మాయిలు హృతిక్ ని తెరమీద చూసేందుకు బారులు తీరుతున్నారు. స్క్రీన్లు చాలడం లేదు. కౌంట్ పెరుగుతోంది. అయినా టికెట్లకు డిమాండ్ తగ్గితేగా. ఇదేమి సినిమా అని దుమ్మెత్తిపోసిన మీడియా వర్గం నాలుక కరుచుకుని రీ రివ్యూలు రాయడం మొదలుపెట్టింది. లేదంటే కుర్రకారు ఆ పేపర్లను బ్యాన్ చేసేలా ఉన్నారు

అలా మొదలైన సంచలనం వంద రోజులు దాటినా చల్లారలేదు. వసూళ్ల సునామి అంటే ఏంటో షోలే, డిడిఎల్, హం ఆప్కే హై కౌన్ ల తర్వాత దీంతోనే చూస్తున్నామని ట్రేడ్ పండితులు అంగీకరించారు. మొదటి సినిమాతోనే హృతిక్ రోషన్ కు వచ్చిన క్రేజ్ చూసి అప్పుడప్పుడే  బాలీవుడ్ ని శాశించే స్థాయికి చేరుకుంటున్న ఖాన్లకు ఆందోళన మొదలయ్యింది. నిర్మాతలు బ్లాంకు చెక్కులతో రోషన్ కుటుంబం ఇంటి బయట క్యూలు కడుతున్నారు. మరోపక్క దేశవ్యాప్తంగా కహో నా ప్యార్ హై  ప్రింట్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో ల్యాబులు ఆ పనిలో బిజీగా ఉన్నాయి. ఆడియో సేల్స్ కు ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని చిన్న కేంద్రాల్లో సైతం యాభై రోజులు ఆడిన ఈ సెన్సేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే

ఇందులో కథ చాలా సింపుల్. డబ్బులేక స్వంత కాళ్ళ మీద నిలబడుతూ అభిమానంతో బ్రతికే ఒక అబ్బాయి రిచ్ క్లాస్ అమ్మాయి ప్రేమించుకుంటారు. హీరోయిన్ తండ్రి పాలుపంచుకున్న ఓ కుట్రలో హీరో చనిపోతాడు. బాధతో ఉన్న హీరోయిన్ విదేశాలకు వెళ్ళినప్పుడు అచ్చం అదే పోలికలతో ఉన్న మరో హీరో కనిపిస్తాడు. ఇక అక్కడి నుంచి కొత్త డ్రామా మొదలవుతుంది. ఇద్దరు తిరిగి ఇండియా వచ్చాక ఏం జరిగిందన్నదే క్లైమాక్స్. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు

*ఈ కథకు స్ఫూర్తి 1986లో శివరాజ్ కుమార్ హీరోగా కన్నడలో వచ్చిన రధసప్తమి సినిమా

 
* ఏ బాలీవుడ్ సినిమాకు రాని విధంగా ఏకంగా 92 అవార్డులు గెలుచుకుని లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుందీ చిత్రం 
* ముందుగా అనుకున్న హీరోయిన్ కరీనా కపూర్. కాని కరీనా తల్లి బబితతో రాకేష్ కు మనస్పర్థలు రావడంతో తన ఫ్యామిలీ ఫ్రెండ్ కూతురైన అమీషా పటేల్ ని దీంతో పరిచయం చేశారు 
* కొడుకు మొదటి సినిమా అయినా రాజీ లేకుండా భారీ బడ్జెట్ తో విదేశాల్లో సైతం ఖరీదైన లొకేషన్లలో షూట్ చేశారు రాకేష్ 
* 2000వ సంవత్సరంలో అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాగా కహో నా ప్యార్ హై చరిత్ర సృష్టించింది. మల్టీ స్టారర్ మొహబ్బతే కలెక్షన్లు దీని ముందు చాలా తక్కువగా అనిపించాయి 
* మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ మరియు బెస్ట్ యాక్టర్ గా రెండు ఫిలిం ఫేర్ అవార్డులు సాధించిన ఒకే ఒక్క హీరో హృతిక్ రోషన్ 
* సినిమా విడుదలయ్యాక అతి తక్కువ సమయంలో హృతిక్ కోసం 30 వేల పెళ్లి సంబంధాలు వచ్చాయి
* హృతిక్ తన భార్య సుసానేని మొదటిసారి కలుసుకున్న ట్రాఫిక్ సిగ్నల్ ఎపిసోడ్ ని ఇందులో వాడుకున్నారు 
* ఆడియోలోనే కాదు వీడియో సిడిలు డివిడిల పరంగానూ అమ్మకాల్లో రికార్డులు సొంతం చేసుకుందీ చిత్రం 
* హీరోయిన్ గా పరిచయమైన అమీషా పటేల్ కు అతి తక్కువ కాలంలోనే స్టార్లతో నటించే అవకాశం దక్కింది. పూరి ఏరికోరి పవన్ కళ్యాణ్ బద్రి సినిమా కోసం తనను తీసుకొచ్చాడు

మొత్తానికి ఇండియా మొత్తంలో ఏ భాషలో అయినా ఏ డెబ్యూ హీరోకి రానంత గొప్ప రిసెప్షన్ హృతిక్ రోషన్ అందుకున్నాడు. చరిత్రలో అంతకు ముందు లేదు ఇప్పటిదాకా జరగలేదు. అందుకే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఇప్పటికీ తనదైన స్టార్ డంతో అశేష అభిమానులను 20 ఏళ్ళుగా హృతిక్ రోషన్ అలరిస్తూనే ఉన్నాడు. డౌట్ ఉంటే కహో నా ప్యార్ హైలో పాటలు చూసి ఇటీవలే వచ్చిన వార్ లో హృతిక్ రోషన్ డాన్స్ చూడండి. మేము చెప్పింది నిజమని మీరే ఒప్పుకుంటారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి