iDreamPost

మీడియా ప్రతినిధులపై దాడి చేసింది రైతులేనా?

మీడియా ప్రతినిధులపై దాడి చేసింది రైతులేనా?

అమరావతి రాజధాని మార్పు అంశంలో ఇప్పటివరకూ శాంతియుతంగా జరిగిన నిరసనలు కాస్తా నేడు హింసాత్మకంగా మారిపోయాయి. రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్న జర్నలిస్టులపై ఆందోళనకారులు దాడికి తెగబడటంతో అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

వివరాల్లోకి వెళ్తే రాజధాని మార్పుపై నిరసనగా ఉద్దండరాయపాలెం దగ్గర ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష ప్రారంభించారు. ఆ మౌన దీక్ష కవరేజి కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు నిరసనకారులు. ఈ ఘటనలో ఆందోళన కారులు పలు వార్తా ఛానెళ్ల ప్రతినిధులపై తీవ్రస్థాయిలో దాడి చేసారు. బండ రాళ్లు కర్రలతో దాడి చేస్తూ భయాందోళనలు కలిగించారు.

ముందుగా ఇంటర్వ్యూ చేసే సమయంలో ప్రముఖ న్యూస్ ఛానెల్ లో పనిచేస్తున్న మహిళా రిపోర్టర్ పై దాడి చేయడానికి ప్రయత్నించడంతో మహిళా జర్నలిస్ట్ పై దాడి చేయటం తగదని వారించే ప్రయత్నం చేసిన మరో టీవీ రిపోర్టర్ పై కూడా ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు. అక్కడితో ఆగకుండా తోటి జర్నలిస్టులపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన మరో రెండు ఛానెళ్ల రిపోర్టర్లపై దాడి చేయటానికి ప్రయత్నించారు నిరసనకారులు. దీనితో పలు టీవీ ఛానెళ్ల రిపోర్టర్లకు గాయాలయ్యాయి.

ఆందోళనకారుల దాడి నుంచి తప్పించుకొని కారులో బయటికి వచ్చే ప్రయత్నం చేసిన రిపోర్టర్లపై వెలగపూడి దగ్గర మరోసారి దాడికి ప్రయత్నించారు నిరసనకారులు. ఈ క్రమంలో ఒక ప్రముఖ వార్తా ఛానెల్ కి చెందిన కారు అద్దాలను ధ్వంసం చేసి కారులో ఉన్న రిపోర్టర్లపై దాడికి ప్రయత్నించారు. ఆందోళనకారులు చేసిన దాడితో మీడియా సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు.

రైతుల ఆందోళనలు ప్రపంచానికి చూపిస్తున్న మీడియాపై దాడికి తెగబడటంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసారు.మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండించారు. మీడియాపై జరిగిన దాడికి నిరసనగా, రాజధాని రైతుల కవరేజిని బాయ్ కాట్ చేయాలనే ఆలోచనలో విలేఖరులు ఉన్నట్లు సమాచారం. కాగా మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిలో అత్యధిక శాతం మహిళలు ఉండటం గమనార్హం.

రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు దాడికి తెగబడ్డారని, రైతులు దాడి చేసే ప్రయత్నం చేయరని మీడియా ప్రతినిధులు ఆరోపించారు.గతంలో తాము చాలా సార్లు ఈ ప్రాంతంలో వార్తలు కవర్‌ చేశామని.. కానీ రైతులు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదని పలువురు జర్నలిస్టులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అసాంఘిక శక్తులు కుట్ర చేశారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మీడియాపై దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని మీడియా ప్రతినిధులు కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి