iDreamPost

VIDEO: మళ్లీ మళ్లీ ఇలాంటి క్యాచ్‌లు చూడలేరు! రూట్‌ మామ భలే పట్టాడు

  • Published Jul 29, 2023 | 1:11 PMUpdated Jul 29, 2023 | 1:11 PM
  • Published Jul 29, 2023 | 1:11 PMUpdated Jul 29, 2023 | 1:11 PM
VIDEO: మళ్లీ మళ్లీ ఇలాంటి క్యాచ్‌లు చూడలేరు! రూట్‌ మామ భలే పట్టాడు

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య యాషెస్‌ పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్లు చివరి టెస్ట్‌ అయిన ఐదో మ్యాచ్‌లో విజయం కోసం ప్రాణం పెట్టి ఆడుతున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టులో ఇంగ్లండ్‌ అద్భుత విజయం సాధించింది. ఇక నాలుగు టెస్టులో కూడా ఇంగ్లండ్‌ గెలిచే అవకాశం ఉన్నా.. అది కాస్త వర్షార్పణం అయింది. దీంతో ఐదో టెస్టును గెలిచిన సిరీస్‌ను డ్రా చేయాలని ఇంగ్లండ్‌ గట్టిపట్టుదలతో ఆడుతుంటే.. ఎలాగైనా చివరి టెస్టులో గెలిచి సంపూర్ణ ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆసీస్‌ ఆటగాళ్లు కసితో ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌ డ్రా అయినా, ఇంగ్లండ్‌ గెలిచినా కప్పు మాత్రం ఆస్ట్రేలియాకే వెళ్తుంది. సిరీస్‌ డ్రాగా ముగిస్తే.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఆసీస్‌కే యాషెస్‌ ట్రోఫీ దక్కుతుంది. 2022 జరిగిన యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఏకంగా 4-0 తేడాతో గెలిచింది.

ఈ సారి ఆస్ట్రేలియాకు పూర్తి ఆధిక్యం ఇవ్వకూడదని ఇంగ్లండ్‌ భావిస్తోంది. అందుకోసమే ఐదో టెస్టులో ప్రతి బంతికి ప్రాణం పెట్టి ఆడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ సీనియర్‌ స్టార్‌ క్రికెటర్‌ జో రూట్‌ ఓ సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. క్రిస్‌ వోక్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌ ఐదో బంతిని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ మార్కస్‌ లబుషేన్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, బంతి అతని బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌, ఫస్ట్‌ స్లిప్‌ మధ్యలోకి బుల్లెట్‌ వేగంతో దూసుకెళ్లింది. దాన్ని గమనించిన జో రూట్‌ తన ఎడమవైపుకు అద్భుతమైన డైవ్‌ చేస్తూ.. సింగిల్‌ హ్యాండ్‌తో కళ్లుచెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. పక్కనున్న సహచర ఆటగాళ్లు రూట్‌ పట్టిన క్యాచ్‌కు మంత్రముగ్దులైపోయారు. రూట్‌ను చుట్టుముట్టేసి.. అభినందనలతో ముంచేశారు. ఇక ఆ సూపర్‌ క్యాచ్‌కు అవుటైన లబుషేన్‌ చాలా నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

అయితే.. ఈ మ్యాచ్‌లో లబుషేన్‌ దారుణమైన డిఫెన్సివ్‌ బ్యాటింగ్‌ చేశారు. అతను ఏకంగా 82 బంతులు ఎదుర్కొని కేవలం 9 అంటే 9 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. లబుషేన్‌ బ్యాటింగ్‌ చేసి.. ఇంత జిడ్డు బ్యాటింగ్‌ ఏంటీ బ్రో అంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ జిడ్డు ఇన్నింగ్స్‌ చూసి తట్టుకోలేకనే జో రూట్‌ తన వయసును మర్చిపోయి మరీ.. భారీ డైవ్‌ చేస్తూ సూపర్‌ క్యాచ్‌ పట్టాడంటూ జోకులు పేలుస్తున్నారు. రూట్‌ అందుకున్న క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కిందున్న ఆ వీడియో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వీడియో: ఔట్‌ అని వెళ్లిపోయిన స్మిత్‌.. కొంపముంచిన బెయిర్‌ స్టో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి