iDreamPost

బీజేపీకి టచ్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి?

బీజేపీకి టచ్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి?

2024 ఎన్నికలలో ఎలా అయినా అధికారం చేజిక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే పని చేయడం మొదలుపెట్టింది. అయితే తాము ఏం చేస్తామో ప్రజలకు చెప్పాల్సింది పోయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా దానికి కారణం జగన్ అనే ప్రచారం చేయడంలో ఆ పార్టీ నేతలు అందరూ తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గెలిచే అవకాశం లేదు అనుకుంటున్న నేతలను పక్కన పెట్టడానికి చంద్రబాబు వెనుకాడడం లేదని తెలుస్తోంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చేయించిన సర్వేలో తాడిపత్రి నియోజకవర్గం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి కనుక టికెట్ కేటాయిస్తే గెలిచే అవకాశమే లేదని తేలింది. ఇదే విషయాన్ని చంద్రబాబు జేసీ దివాకర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారట.

మున్సిపాలిటీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన విధంగా గెలిచి చైర్మన్ గా ఎన్నికైన ప్రభాకర్ రెడ్డి ప్రవర్తన వింతగా ఉందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రవర్తనతో తెలుగుదేశం పార్టీ నాయకులే కాక నియోజకవర్గంలోని కార్యకర్తలు సైతం ఇబ్బంది పడుతున్నట్లుగా చంద్రబాబు దృష్టికి జిల్లా నాయకులు తీసుకువెళ్లారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని దివాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన చంద్రబాబు మున్సిపాలిటీలో అనుభవం ఉన్న సీనియర్ తెలుగుదేశం నాయకుల పైన కూడా ఆయన చిందులు వేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని ఇది కరెక్ట్ పద్ధతి కాదని కూడా చెప్పడంతో ఈ విషయం మీద మీరు మాట్లాడుతున్నారు నేను మాట్లాడలేకపోతున్నాను అంతే తేడా అని దివాకర్ రెడ్డి చంద్రబాబుకు బదులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఆయన తీరు ఇలానే ఉంటే ఆయన కుమారుడికి సైతం టిక్కెట్ కేటాయించలేమని మీకే టికెట్ కేటాయిస్తానని చెప్పడంతో జేసీ దివాకర్ రెడ్డి సైతం ఏమీ మాట్లాడలేక వెనుతిరిగారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాలను అవగతం చేసుకున్న ప్రభాకర్ రెడ్డి బీజేపీ జాతీయ నాయకులను తన ఇంటికి భోజనానికి పిలిపించి పరోక్షంగా తాను బీజేపీ వైపు చూస్తున్నానని సూచనలు అధిష్టానానికి పంపారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇక బస్సుయాత్ర పేరుతో జిల్లాలో పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెడతారేమో అనే అనుమానం కూడా పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళడంతో ఆయన దానికి అనుమతి ఇవ్వకూడదని భావిస్తున్నట్టు సమాచారం. కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వైయస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముందు ప్రభాకర్ రెడ్డి చిందులు ఏమాత్రం పనిచేయవని బాబు భావిస్తున్నారట. దీంతో ఇక తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు తెలుగుదేశం నుంచి పోటీ చేయడం కష్టమేనని తెలుస్తోంది. ఒకవేళ తన కుటుంబానికి కనుక టికెట్ ఇవ్వకపోతే ఆయన బీజేపీలో చేరే అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలా అయినా బలపడాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇలా అసంతృప్త నేతలను వేరే పార్టీల వైపు చూడకుండా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి