iDreamPost

జేసీకి దక్కని ఉపసమనం.. మరిన్ని షాకులు ఇచ్చేందుకు సిద్ధమైన పోలీసులు

జేసీకి దక్కని ఉపసమనం.. మరిన్ని షాకులు ఇచ్చేందుకు సిద్ధమైన పోలీసులు

జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ డాక్యుమెంట్లు కేసులో అరెస్ట్‌ అయిన అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డిలు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా వారిని రెండు రోజుల పాటు పోలీస్‌ కస్టడికీ అనుమతించింది. ఫలితంగా ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారించేందుకు పోలీసులుకు అవకాశం లభించింది. 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై జేసీ ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. ఆయన నుంచి కీలక సమాచారం సేకరించారని తెలిసింది.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాలను విక్రయించారనే అభియోగాలపై ఈ నెల 13వ తేదీ శనివారం అనంతపురం పోలీసులు జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డిలను హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. వారిని అనంతపురం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారు. అనంతపురం జైలులో కరోనా లక్షణాలతో ఓ ఖైధీ ఉండడంతో ముందు జాగ్రత్తగా జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడుని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

శనివారం అరెస్ట్‌ కాగా జేసీ.. సోమవారం ఆన్‌లైన్‌లోనే బెయిల్‌ దాఖలు చేసుకున్నారు. ఈ రోజు విచారించిన న్యాయస్థానం వారి పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఫోర్జరీ కేసులో ఉపసమనం దక్కని జేసీ ప్రభాకర్‌రెడ్డికి పోలీసులు వరుస షాక్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరో ఐదు కేసుల్లో పిటీ వారెంట్లు సిద్ధం చేశారు. ఒక కేసులో బెయిల్‌ వచ్చినా మరో కేసులో ఆయన్ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌లోనే ఉంచే అవకాశాలున్నాయి. తాజా పరిస్థితి చూస్తే.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌లు 14 రోజులకు మించి జైలు జీవితం గడపడం ఖాయంగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి