iDreamPost

గల్లా గిచ్చుడు లోక్‌సభ దాకా వెళ్లిందే..!

గల్లా గిచ్చుడు లోక్‌సభ దాకా వెళ్లిందే..!

టీడీపీ గల్లా జయదేవ్‌.. పెద్దగా పరిచయం లేని పేరు. గుంటూరు లోక్‌సభ ఎంపీగానే కాదు.. అమరరాజా బ్యాటరీస్‌ కంపెనీ అధినేతగా, వ్యాపారవేత్తగా ఆయన చుపరిచితులు. 2018లో బీజేపీతో టీడీపీ తెగతెంపులు అయ్యాక.. ఏపీకి జరిగిన అన్యాయంపై, ప్రత్యేక హోదాపై లోక్‌సభలో అమెరికా ఇంగ్లీష్‌లో మాట్లాడి.. వచ్చాక.. టీడీపీ శ్రేణలు భారీ ర్యాలీ నిర్వహించి ఆయన ఘనతను చాటి చెప్పారు. తాజాగా అమరావతి ఉద్యమంలో గల్లా జయదేవ్‌ పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు.

ఇటీవల అసెంబ్లీ జరిగే సమయంలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్‌ చురుగ్గా పాల్గొన్నారు. అనుమతి లేకపోయినా.. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ వైపు గల్లా వెళ్లారు. అక్కడ పోలీసులు ఆపుతున్నా.. ముందుకే సాగారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను ఆపేందుకు ప్రయత్నించారు. భైఠాయించడంతో చేతులు పట్టుకుని పైకిలేపారు. ఈ క్రమంలో పోలీసులు తనను గిచ్చారంటూ జయదేవ్‌ నానా యాగీ చేశారు. ఘటన జరిగిన మరుసటి రోజు, ఆ తర్వాత మీడియా సమావేశంలోనూ ‘‘ నన్ను గిచ్చారు’’ అంటూ వాపోయారు. చేతి కింద కందిపోయిందని చొక్కా విప్పి మరీ చూపించారు.

ఈ గిచ్చుడు ఎపిసోడ్‌ అయిపోయిందనుకుంటే.. మళ్లీ మొదలైంది. ఈ సారి ఈ గిచ్చుడు యాగీ లోక్‌సభకు చేరింది. ఈ రోజు మంగళవారం లోక్‌సభలో గల్లా జయదేవ్‌ పోలీసులు తనను గిచ్చారంటూ వాపోయారు. ఛలో అసెంబ్లీని అడ్డుకున్నారని మాట్లాడారు. ఇదంతా టీవీల్లో చూస్తున్న అమరావతి ఉద్యమకారులు, రాజకీయ పరిశీలకులు అమరావతి ఉద్యమం గురించి మాట్లాడకుండా తనను గిచ్చారంటూ అర్థంలేని వాదనలు జయదేవ్‌ వినిపించారని ఎద్దేవా చేస్తున్నారు. తనను పోలీసులు గిచ్చారంటూ లోక్‌సభలో మాట్లాడిన జయదేవ్‌.. ఈ విషయాన్ని కూడా రేపు మీడియాతో మాట్లాడినా ఆశ్యర్యం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి