iDreamPost

జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో టీడీపీ, జనసేన.. పోత్తుపై టీడీపీలో క్లారిటీ..!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో టీడీపీ, జనసేన.. పోత్తుపై టీడీపీలో క్లారిటీ..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఆసక్తికర పోరు సాగే దిశగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు పోటీ పడతాయని అందరూ భావించగా.. తాము బరిలో ఉంటామని జనసేన, టీడీపీలు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాయి.

తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2019 లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలోనూ పోటీ ఊసే జనసేన పార్టీ ఎత్తలేదు. అయితే ఆయా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం జనసేన పోటీలో ఉంటుందనే ప్రచారం మాత్రం సాగుతుంటుంది. తెలంగాణ ఎన్నికల్లో ఇలాంటి నేపథ్యం ఉన్న జనసేన.. ఒక్కసారిగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బరిలో దిగుతామని ప్రకటించడం విశేషం. యువ జనసేనికుల ఆసక్తి, విజ్ఞప్తి మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీలో చేస్తున్నట్లు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు.

సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో నిలవనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా మళ్లీ ఎన్నికల రాజకీయంలోకి టీడీపీ ప్రవేశిస్తోందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ ప్రకటించారు. గత ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేసిన టీడీపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టిన టీడీపీకే హైదరాబాద్‌లో పోటీ చేసే హక్కు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని జోస్యం చెప్పారు.

రేపు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. శుక్రవారంతో ఈ తంతు ముగుస్తుంది. నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజులు మాత్రమే ఉండడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల దాఖలుకు యుద్ధప్రాతిపదికన సిద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రేటర్‌ ఎన్నికల్లో జనసేనతో పోత్తుపై పార్టీలో చర్చించలేనది బీజేపీ నేతలు ప్రకటించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో పొత్తుపై చర్చలు, సీట్ల పంపకం. ఏ డివిజన్‌లో ఎవరు పోటీ చేయాలి, అభ్యర్థుల ఎంపిక అనేది కత్తిమీద సాములాంటిదే. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒంటరిగా పోటీ చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి. వీరి బాటలోనే కమ్యూనిస్టులు నడిచే అవకాశం ఉంది. టీడీపీ తన దారి ఏమిటో ఎవరూ అడగకముందే చెప్పేసింది. ఇక బీజేపీ, జనసేన పొత్తుపై బుధవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి