iDreamPost

Jai Bhim Review : జై భీమ్ రివ్యూ

Jai Bhim Review  :  జై భీమ్ రివ్యూ

గత ఏడాది డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ద్వారా ఆకాశం నీ హద్దురా రూపంలో అద్భుత విజయాన్ని అందుకున్న సూర్య సంవత్సరం గ్యాప్ లో జై భీమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రొటీన్ మాస్ కథలకు దూరంగా సమాజనికి అంతో ఇంతో పనికొచ్చే సబ్జెక్టులను ఏరికోరి ఎంచుకుంటున్న సూర్య థియేటర్లోనే తన సినిమా రావాలనే గిరి గీసుకోలేదు. అందుకే వైవిధ్యభరితమైన సీరియస్ జానర్ ను కొనసాగిస్తున్నాడు. జ్ఞానవేల్ దర్శకత్వంలో తనతో పాటు భార్య జ్యోతిక స్వీయ నిర్మాణంలో సూర్యనే తీసిన ఈ సోషల్ ఇష్యూ థ్రిల్లర్ నిన్న రాత్రి నుంచే ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

ఇది 90 దశకంలో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన కథ. అటవీ కొండ ప్రాంతాల్లో ఉంటూ అగ్ర వర్ణాల చిన్న చూపుతో వివక్షకు గురవుతున్న తెగకు చెందిన రాజన్న(మణికందన్)ను పోలీసులు అన్యాయంగా ఓ దొంగ కేసుని బనాయించి చిత్ర హింసలు పెడతారు. అనూహ్యంగా ఒక రోజుతో అతనితో పాటు మరో ఇద్దరు స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయినట్టుగా పోలీసులు చెబుతారు. అనుమానం వచ్చిన రాజన్న భార్య చిన్నతల్లి(లిజోమోల్ జొస్)న్యాయం కోసం గిరిజనులకు ఉచితంగా కేసులు వాదించే చంద్రు(సూర్య) దగ్గరకు వెళ్తుంది. కానీ సాక్ష్యాలు ఏవీ అనుకూలంగా ఉండవు. ఆ తర్వాత జరిగేది తెరమీదే చూడాలి

నటీనటులు

తనకు ఎంత స్టార్ పవర్ ఇమేజ్ ఉన్నా ఇలాంటి సాహసోపేతమైన కథాంశాలు ఎంచుకుంటున్న సూర్యని ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఇలాంటివి థియేటర్లలో కమర్షియల్ గా ఆడవని గుర్తించి ఓటిటికి మళ్లించడం చాలా మంచి నిర్ణయం. ఇవి ఎలాగూ సామాన్య ప్రేక్షకులు హాలు దాకా వెళ్లి చూడరు. డిజిటల్ కాబట్టి త్వరగా చూసేవాళ్ల సంఖ్య లక్షల నుంచి కోట్లలో ఉంటుంది. సూర్య పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమి లేదు. లాయర్ చంద్రుగా అదరగొట్టాడు. ఎక్కడా హీరోయిజం ఛాయలు లేని ఇలాంటి అండర్ ప్లే క్యారెక్టర్ ని మోసిన తీరు అద్భుతం. కెరీర్ బెస్ట్ లో చేర్చేయొచ్చు.

ఇందులో హీరోయిన్ అంటూ ఎవరూ ప్రత్యేకంగా లేకపోవడం అసలు ఆ సంగతి కూడా గుర్తులేనంతగా సాగిపోతుంది. కేసులో అసలు బాధితుడిగా నటించిన మణికందన్ సహజత్వంతో కట్టిపడేస్తాడు. చిన్నతల్లిగా చేసిన లిజోమోల్ సైతం యాక్టింగ్ స్కూల్ లో ఎమోషనల్ ఎక్స్ ప్రెషన్స్, మెథడ్ యాక్టింగ్ కి ఉదాహరణగా చూపించే స్థాయిలో మెప్పించింది. రావు రమేష్ ది మరీ స్పెషల్ గా అనిపించే రోల్ కాకపోయినా హుందాగా అందులో ఒదిగిపోయారు. ప్రకాష్ రాజ్ ది రొటీనే. వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం కొంత మైనస్. జయప్రకాశ్, రజిష విజయన్, సోమసుందరం, సుబ్రమణి, ఇళవరసు, సుధాకర్ ఇలా క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు

డైరెక్టర్ అండ్ టీమ్

తమిళ సినిమా గత రెండు మూడేళ్లుగా దళిత వివక్ష మీద గట్టి ఫోకస్ పెడుతోంది. పరియేరుమ్ పెరుమాళ్, విసరనై, అసురన్, కర్ణన్ ఇందులో భాగంగా వచ్చినవే. విజయాలు అవార్డులు సాధించినవే. అదే కారణం కాబోలు సూర్య అంత స్టేచర్ ఉన్న హీరో సైతం వీటి వైపు మొగ్గు చూపాడు. బయటి రాష్ట్రాల్లో పక్కనపెడితే ఈ కాన్సెప్ట్ కోలీవుడ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతోంది. అక్కడ ఈ వ్యవస్థ ఇంకా ఉండటమో లేక గతంలో వీళ్లూ బాధితులుగా ఉండటమో చెప్పలేం కానీ వీటిని మనం డబ్బింగ్ రూపంలో చూస్తేనే ఆ సహజత్వాన్ని ఆస్వాదించగలం. జై భీమ్ కూడా అంతే. ఎంతోసేపు ఆలోచనలో పడేసి గుండెలను పిండేసిన ఫీలింగ్ కలిగిస్తుంది.

ఇప్పుడున్న సగటు మధ్య తరగతి మనిషి ప్రపంచం అంతో ఇంతో సౌకర్యంగా సుఖంగా ఉండొచ్చు. కానీ ఇదంతా ఒకవైపే. మనకు తెలియని మరో చీకటి ప్రపంచంలో బయటికి తెలియని కనిపించని లక్షల కన్నీళ్లు చరిత్రలో చదవని పేజీలలో నిలిచిపోయాయి. కేవలం కులం ఆధారంగా ఒక పుట్టుకను సైతం అవమానించే దారుణమైన వ్యవస్థను మన తాతలు ముత్తాతలు పెంచి పోషించారంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజం. జై భీమ్ లో చెప్పాలనుకున్నది ఇదే. ఇప్పుడు కూడా ఎన్నో రాష్ట్రల్లో పరువు హత్యలు జరుగుతున్నాయి. ఎన్నో గ్రామాల్లో వెనుకబడిన వర్గాలకు హోటళ్లలో ప్లేట్లు గ్లాసులు వేరుగా పెడుతున్నారు.

ఇది ఒకప్పుడు ఏ స్థాయిలో ఉందో దర్శకుడు జ్ఞానవేల్ కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే ప్రతిదీ డీటెయిల్డ్ గా చూపించాలి, ఎమోషన్స్ ని బలంగా రిజిస్టర్ చేయాలని రాసుకున్న స్క్రీన్ ప్లే ల్యాగ్ కి గురి కావడంతో ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం అతి నెమ్మదిగా సాగుతుంది. అందులోనూ ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కాదు. సొసైటీ పట్ల అంతో ఇంతో ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే జై భీమ్ ని చివరిదాకా చూడగలరు. అలా కాకుండా ఏదో వినోదం కోసమో ఎంటర్ టైన్మెంట్ కోసమో మొదలుపెడితే మాత్రం దయచేసి చూడటం ఆపేయండని సూర్య మనకు చాలా త్వరగా చెప్పేస్తాడు. అందుకే ముందే ప్రిపేర్ అయ్యి చూడాలి.

పోలీసు వ్యవస్థలో ఎంత దాష్టీకం ఉంటుందో తెలియంది కాదు. ముఖ్యంగా నిందితులను జైళ్లలో ట్రీట్ చేసే తీరు పట్ల మానవ హక్కుల సంఘాలు ఇప్పటికీ కేసులు నమోదు చేస్తూనే ఉన్నాయి. జైభీమ్ లో దీన్ని చాలా లోతుగా చూపించారు. అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం తెలుగులోనూ అంకురం, జైత్రయాత్ర లాంటి సినిమాల ద్వారా దర్శకులు ఇది చెప్పేందుకే ప్రయత్నించారు. మెప్పులు వచ్చాయి కానీ డబ్బులు రాలేదు. అందుకే అలాంటి చిత్రాలు మళ్ళీ తీసేందుకు మన నిర్మాతలు సాహసం చేయలేకపోయారు. జై భీమ్ సూర్య ఒప్పుకోవడం వల్లే ఈ మాత్రం చర్చకు దారి తీస్తోంది కానీ వేరే మీడియం రేంజ్ హీరో అయితే కనీసం పట్టించుకునేవారు కాదు.

మొత్తం చూశాక నిజంగా ఇలా జరుగుతుందా అని ఎవరికైనా సందేహం కలిగితే 90 ప్రాంతంలో లాయర్ చంద్రు టేకప్ చేసిన కేసుల గురించి అప్పటి న్యూస్ పేపర్లు చదివితే అర్థమవుతుంది. ఈ సినిమాలో ఎలాంటి అబద్దాలు లేవు. కాకపోతే నాటకీయత కోసం సినిమాటిక్ ఫ్లేవర్ అద్దారు కాబట్టి దానివల్లే డ్రామా ఎక్కువైన భావన కలుగుతుంది. పకడ్బందీ స్క్రీన్ ప్లే సెట్ చేసుకున్న జ్ఞానవేల్ కోర్టుకు సంబంధించిన సన్నివేశాలను మంచి గ్రిప్పింగ్ గానే రాసుకున్నారు కానీ సౌలభ్యం కోసం కొన్ని లాజిక్స్ మరీ సింపుల్ గా డీల్ చేసిన తీరు కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అది మినహాయిస్తే జైభీమ్ లో వేలెత్తి చూపించే లోపాలు తక్కువే.

సియన్ రొల్డన్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మెప్పిస్తుంది. పాటలు అవసరం లేకపోయినా పెట్టారు కానీ మనకు అంతగా కనెక్ట్ కావు. ఎస్ఆర్ కథిర్ ఛాయాగ్రహణం మంచి స్టాండర్డ్ లో సాగింది. తండాలు, గ్రామీణ నేపధ్యాన్ని సహజంగా కెమెరాలో బంధించారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ మాత్రం అంచనాలకు తగ్గట్టు లేదు. 2 గంటల 44 నిమిషాల నిడివి ఇలాంటి సబ్జెక్టుకి చాలా ఎక్కువ. కొంత తగ్గించాల్సింది. నిర్మాణ విలువల్లో రాజీ లేదు. 2డి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థకు భారీ బడ్జెట్ అవసరం పడలేదు

ప్లస్ గా అనిపించేవి

సూర్య నటన
పర్ఫెక్ట్ క్యాస్టింగ్
ఎలాంటి డీవియేషన్ లేకపోవడం
చర్చించిన అంశం

మైనస్ గా తోచేవి

లెన్త్
ఫస్ట్ హాఫ్ ల్యాగ్
పాటలు

కంక్లూజన్

చాలా సున్నితమైన అంశంతో తెరకెక్కిన జైభీమ్ ఖచ్చితంగా ఎంటర్ టైనర్ కాదు. ఆలోచింపజేసే సీరియస్ థింకర్. ఫ్యామిలీతో కలిసి చూస్తున్నప్పుడు వినోదం తాలూకు అనుభూతి కలగకపోవచ్చు. కానీ సామాజిక స్పృహ ఉండి ఏకాంతంగా ఇలాంటివి చూసినప్పుడు ఖచ్చితంగా కాసేపు శూన్యంలోకి చూస్తూ ఉండిపోతాం. అంతగా ఆలోచనలు రేకెత్తిస్తాడు జైభీమ్. అసలు కులాల వారిగా వివక్ష ఎందుకు ఉండాలి అనే ప్రశ్నకు ఇప్పటిదాకా ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. జైబీమ్ లో కూడా దానికి బదులు దొరకదు. కాకపోతే రాబోయే తరాల ఆలోచనా ధోరణిలో ఈ విషయంగా కొంతైనా మార్పు వచ్చేందుకు ఇవి దోహదపడితే తీసినందుకు కొంతైనా సార్ధకత లభిస్తుంది

ఒక్క మాటలో – ఆలోచింపజేసే భీమ్

Also Read : Varudu Kavalenu Review : వరుడు కావలెను రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి