iDreamPost

నాడు- విపత్తు బాధితులపట్ల అంతులేని ఉదాసీనత , నేడు – బాధ్యతగా ఎదురెళ్లి సాయంచేస్తున్న ప్రభుత్వం

నాడు- విపత్తు బాధితులపట్ల అంతులేని ఉదాసీనత , నేడు – బాధ్యతగా ఎదురెళ్లి సాయంచేస్తున్న ప్రభుత్వం

చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ!

ఏదైనా ఒక దుర్ఘటన జరిగి ప్రజలు తీవ్ర ప్రభావానికి లోనైనప్పుడు దాని తాలూకూ సెగ ప్రభుత్వాలకి తగలకుండా అప్పటికప్పుడు వైద్యసహాయం చేసి ఎంతో కొంత పరిహారం ప్రకటించి తర్వాత మర్చిపోయేవి గత ప్రభుత్వాలు , ఆ తర్వాత సదరు బాధితులు ఈ ప్రకటించిన పరిహారం కోసం ఎమ్మార్వో ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకూ ఏళ్ల తరబడి తిరిగీ తిరిగి విసిగి వేసారిన తర్వాత కొంత చేతులు తడిపిన పిమ్మటో , ఎన్నికల తరుణానో ఆ పరిహారానికి మోక్షం కలిగేది. అప్పటికి బాధితులు లేదా మృతుని బంధువులు మరిన్ని కష్టనష్టాలకు లోనవ్వడమో , కోలుకుని వీటిని మర్చిపోయి తమ జీవితాన్ని గాడిలో పెట్టుకోవడమో జరిగిపోయేది .

ఇందుకు సంబంధించి భారతీయుడు చిత్రంలోని ఓ సన్నివేశం గుర్తు చేసుకొంటే ఓ సంఘటనలో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపుతుండగా రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటున్న వృద్ధుడు ఆ కాల్పులలో మరణిస్తాడు . తర్వాత ప్రభుత్వం అతని భార్యకి కొంత పరిహారం ప్రకటిస్తుంది. దానికోసం ఏళ్ల తరబడి తిరిగిన ఆమె చివరికి అటెండర్ దగ్గర్నుండీ ఆఫీసర్ వరకూ ఎంతెంత చెల్లించాలో అనే అంశంపై ఇతరులకు సలహాలు ఇచ్చేంతగా పరిజ్ఞానం సంపాదించి కూడా తన పరిహారం పొందలేక ఆఫీస్ బయట దుమ్మెత్తి పోసి శాపం పెట్టి వెళుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సామాన్య వృద్ధుడు అవినీతి, అలసత్వాల అంతానికి భారతీయుడిగా ఉద్భవించిన తరువాత ఆమె పరిహారం ఇల్లు వెతుక్కొంటూ ఆమెకి చేరుతుంది .

దురదృష్టవశాత్తు గత ప్రభుత్వ హయాంలో ఏ భారతీయుడూ ఉదయించలేదు. అందుకే అనుకొంటా 2015 లో బాబు గారి ప్రచార కాంక్షకి బలయ్యారు అని పేరొందిన రాజమండ్రి పుష్కర మృతుల తాలూకూ పరిహారం వారి సంబంధీకులకు చెందాటానికి రెండేళ్ల పైన పట్టింది . ఇంకా పలు దుర్ఘటనల్లో తూతూమంతరంగా ప్రకటించిన పరిహారాలు కూడా బాధితులు చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిన ఘటనలు కోకొల్లలు . ఇక్కడ ఏ భారతీయుడూ ఉదయించక పోయినా ప్రజలే నడుం బిగించి మార్పు కోసం బాబు ప్రభుత్వాన్ని దించేసి జగన్ కి పగ్గాలు అప్పచెప్పారు .

అధికారం చేపట్టిన నాటి నుండీ సామాన్యులకు హామీ ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్నీ స్థిరంగా అమలు చేస్తూ మాట నిలబెట్టుకొన్న నాయకుడిగా పేరు పొందుతున్న జగన్ , కరోనా వైరస్ ని కూడా సమర్ధంగా ఎదుర్కొంటూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంటున్న క్రమంలో వైజాగ్ LG పాలిమర్స్ లో అనుకోకుండా గ్యాస్ లీకేజీ ఘటన జరిగి పన్నెండు మంది మృతి చెంది, పలువురు అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యిన దుర్ఘటన పట్ల జగన్ స్పందించిన తీరు ప్రశంసనీయం .

ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్ళటం , బాధితుల వద్దకు వెళ్లి తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పటంతో పాటు ప్రాణ , ఆస్తి నష్టాలకు తగ్గట్టు భారీ పరిహారాన్ని ప్రకటించడం , సత్వరమే ప్రాథమిక విచారణ జరిపించి కంపెనీపై కేసు నమోదు చేయించడం వంటి ఘటనలతో రాష్ట్ర ప్రజల పట్ల తన సానుకూల దృక్పధాన్ని మరోసారి చేతలలో తెలియజేసినట్టు అయ్యింది .

అయితే ప్రతి అంశంలోనూ లేని లోపాల్ని కూడా ఎంచటమే పనిగా పెట్టుకొన్న బాబు , టీడీపీ శ్రేణులు ఈ అంశం పై కూడా పలు విమర్శలు చేసారు . బాబుగారు కోటి రూపాయాలిస్తే ప్రాణాలు తిరిగి వస్తాయా అని , కోటి రూపాయలు సరిపోవని వ్యాఖ్యానించగా , కొందరు టీడీపీ నాయకులు మాత్రం ప్రకటించారు సరే ఇచ్చేది ఎప్పటికో అని పెదవి విరిచారు.

అయితే వారి అంచనాలు పటాపంచలు చేస్తూ దుర్ఘటన జరిగిన మర్నాడే పరిహార , పునరావాసాల కోసం ముప్పై కోట్లు కేటాయించిన జగన్ , వైజాక్ లో పరిస్థితి పట్ల నిన్న అక్కడి మంత్రులు , అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ పరిహారం కోసం ఏ ఒక్క బాధితుడూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగరాదని , మృతుల కుటుంబీకుల వద్దకు సోమవారం ఉదయం మంత్రులు , అధికారులు స్వయంగా వెళ్లి వారికి పరిహారం అందించమని ఆదేశించారు . అందుకనుగుణంగా ఈ రోజు ఉదయం మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్ , ధర్మాన కృష్ణదాస్ , బొత్స సత్యనారాయణ , కురసాల కన్నబాబులు మృతుల ఇళ్లవద్దకు వెళ్లి ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని మృతుల కుటంబీకులకు చెక్కు రూపంలో అందచేశారు .

అలాగే స్టైరీన్ గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో పూర్తిగా సానిటైజ్ చేయించి రసాయన ప్రభావం లేకుండా నిర్వీర్యం చేసి నిరాశ్రయులను వారి ఇళ్లకు చేర్చే కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించాల్సిందిగా మంత్రులను ఆదేశించారు .ఆ తర్వాత సైతం స్థానికులకు ధైర్యం కలిగించేందుకు మంత్రులని ఈ రాత్రి అక్కడే బస చేయమని కోరడం గమనార్హం .

ఇంతటి ప్రమాదానికి కారణమైన స్టైరీన్ ని విశాఖలో ఉంచడానికి వీల్లేదని , కేంద్ర ప్రభుత్వ సహకారంతో వెనక్కి పంపే విధంగా చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి ఆదేశించగా , మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి కూడా తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభించవద్దని LG పాలిమర్స్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది .

కాగా బాధితుల్ని పరామర్శించడానికి తన ప్రయాణానికి అనుమతిమ్మని ప్రధాని కార్యాలయాన్ని , సెంట్రల్ ఏవివేషన్ వారిని అనుమతి కోరుతూ లేఖ పంపగా వారు లాక్ డౌన్ కారణంగా ఏ విధమైన విమాన సర్వీసుల్ని నడపనందున రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి రోడ్డు మార్గంలో వెళ్ళమని సలహా ఇచ్చిందని సమాచారం .

మరి బాబు గారు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని రోడ్డు మార్గాన వచ్చి పరామర్శిస్తారో , తన స్థాయికి తగ్గట్టు విమాన ప్రయాణం కుదర్లేదని లాక్ డౌన్ ముందే వెళ్లి స్థిరపడ్డ హైదరాబాద్ నుండి జూమ్ యాప్ లో పరామర్శిస్తారో ఇంకా తెలియరాలేదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి