iDreamPost

ఈ సారి ఆంధ్రజ్యోతి వదిలేసింది.. టీడీపీ మాత్రం వారిదన్నది..

ఈ సారి ఆంధ్రజ్యోతి వదిలేసింది.. టీడీపీ మాత్రం వారిదన్నది..

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఏ కొత్త సంక్షేమ పథకం ప్రారంభించినా అది పాతదేనని, చంద్రబాబు ఇప్పటికే అమలు చేశారనో, పాత పథకానికే కొత్త పేర్లు పెడుతున్నారనో తాటికాయంత అక్షరాలతో జగన్‌ ప్రభవాన్ని తగ్గించేలా కథనాలు రాసే ఆంధ్రజ్యోతి జగనన్న తోడు పథకం ప్రారంభించిన సమయంలో మాత్రం పూర్వపుదారిలో నడవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పథకం ప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం తక్కువగా.. ఆ పథకాన్ని తక్కువ చేసేలా కథనం ఎక్కువగా రాసే ఆంధ్రజ్యోతి.. ఈ సారి మాత్రం కేవలం సీఎం జగన్‌ ప్రసంగం వరకే పరిమితమై తన పాఠకులను ఆశ్చర్యకితులను చేస్తోంది.

అయితే టీడీపీ, బీజీపీ నేతలు మాత్రం ఈ పథకంపై పెదవి విరుస్తూ ప్రెస్‌మీట్లు, ప్రెస్‌ నోట్లు విడుదల చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకమని, పేరు మార్చి తనదిగా సీఎం జగన్‌ తనదిగా గొప్పులు చెప్పుకుంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ మీడియా ముందుకొచ్చారు. ఆత్మనిర్భర్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు 5 వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని నిర్ణయించిందని, అందులో భాగమే ఈ పథకమంటూ చెప్పుకొచ్చారు. సకాలంలో రుణాలు చెల్లిస్తే కేంద్రమే వడ్డీ చెల్లిస్తుందని కూడా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారని కూడా పట్టాభిరామ్‌ చెప్పుకొచ్చారు.

ఇక బీజేపీ నేతలు కూడా ఇదే పల్లవి అందుకున్నారు. జగనన్న తోడు పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదేనంటూ బీజేపీ నేతలు విష్ణువర్థన్‌ రెడ్డి, నాగోతు రమేష్‌నాయుడులు మీడియాకు ప్రకటనలు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టుకోవడంపై ఆక్షేపించారు.

జగనన్న తోడు పథకం కేంద్ర ప్రభుత్వానిదంటున్న టీడీపీ, బీజేపీ నేతలకు వైసీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అయితే పక్కనే ఉన్న తెలంగాణలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నాయి. అక్కడ అమలు చేసి ఉంటే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పడం లేదని నిలదీస్తున్నాయి. ఆత్మనిర్భర భారత్‌ కార్యక్రమం కరోనా సమయంలో చేపట్టినది. కానీ చిరు వ్యాపారులకు పది వేల రూపాయల రుణం వడ్డీ లేకుండా ఇస్తామని సీఎం జగన్‌ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. ఆ హామీనే ఇప్పుడు అమలు చేసిన విషయం వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. ఈ విషయాలు కూడా తెలియకుండా టీడీపీ , బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి