iDreamPost

అప్పట్లో టీడీపీ నేతల జేబులు నింపింది.. ఇప్పుడు పేదల కడుపు నింపబోతోంది..

అప్పట్లో టీడీపీ నేతల జేబులు నింపింది.. ఇప్పుడు పేదల కడుపు నింపబోతోంది..

తెలుగుదేశం అధికారంలో ఉండగా.. ఆ పార్టీ నేతల అక్రమ ఆదాయ వనరుల్లో మట్టి కూడా ఒకటి. నీరు చెట్టు పనులు మొదలుకొని.. ప్రాజెక్టుల పనుల వరకు మట్టితోనే తెలుగుదేశం నేతలు జేబులు నింపుకున్నారు. ఇసుక, గ్రావెల్‌ దీనికి అదనం. వీటితో వేల కోట్లు సంపాదించారంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో మట్టిని దోచేయడం వారి జన్మహక్కుగా భావించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు టీడీపీ నేతలకు కల్పవృక్షంగా మారింది. ఇదో మాఫియాగా మారింది. చింతమనేని ప్రభాకర్‌ లాంటి వాళ్లు అయితే.. మట్టి, ఇసుకను తీసుకెళ్లడంలో తప్పేముందని బహిరంగంగానే వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. విపక్ష సభ్యులు ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా ఉండేది కాదు. దీంతో యథేచ్ఛగా దోపిడీ సాగింది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన మట్టి డబ్బులు టీడీపీ నేతల బ్యాంక్‌ అకౌంట్లకు చేరాయి.

ఇప్పుడు ప్రభుత్వం మారింది. మొదటగా ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పుడు మట్టిపై దృష్టి సారించింది. అక్రమాలకు తావు లేకుండా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ సిద్ధం చేశారు. పోలవరంలో కుడి ఎడమ కాలువ పనుల్లో లభ్యమయ్యే మట్టిని విక్రయించడం ద్వారా ప్రభుత్వ ఖజానాను నింపాలని నిర్ణయించింది. ఆ డబ్బులను సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టి పేదవారికి ఉపయోగించాలని భావిస్తోంది. అందుకే అధికారులతో కుడి, ఎడమ కాలవ గట్లపై సర్వే చేయించింది. టీడీపీ నేతలు దోచేయగా.. ఇంకా 12 కోట్ల క్యూబిక్‌ మీటర్ల నిల్వ ఉన్నట్లు తేలింది.

దీంతో ఇందులో భాగంగా మొదటి దశలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని రీచ్‌లలో దాదాపు 58లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. ఇందుకోసం మార్చి 19న టెండర్లు ఖరారు చేయనుంది. క్యూబిక్‌ మీటర్‌ మట్టి రేటు రూ. 86, క్యూబిక్‌ మీటర్‌ గ్రావెల్‌ రేటు రూ. 113గా నిర్ణయించారు. దీనికంటే ఎవరు ఎక్కువకు కోట్‌ చేస్తే వారికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.

అలాగే మట్టి విక్రయంతో కాలువ గట్లు ఖాళీ అవుతాయని, తద్వారా దాదాపు 5వేల ఎకరాలు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ విధంగా కూడా ప్రభుత్వానికి ఆదాయం రానుంది.

విజన్‌ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ప్రభుత్వానికి ఆదాయమే కాకుండా పేదలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తారనడానికి ఇదే ఉదాహరణ. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనా విధానానికి సీనియర్‌ ఐఏఎస్‌లు సైతం ఫిదా అవుతున్నారు. కొత్త ఇసుక విధానం ఎంత విజయవంతమైందో.. మట్టి అమ్మకాలు కూడా అంతే సక్సెస్‌ అవుతాయని పేర్కొంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి