iDreamPost

ఇది టెస్ట్ మ్యాచ్ కాదు, ఐదురోజుల వ‌న్డే

ఇది టెస్ట్ మ్యాచ్ కాదు, ఐదురోజుల వ‌న్డే

300ర‌న్స్ కొడితే గెల‌వ‌డం గ్యారెంటీ అన్న వ‌న్డే క్రికెట్ ను 400 ప‌రుగుల‌ను దాటించేసింది ఇంగ్లాండ్. ఓపెన‌ర్ల నుంచి చివ‌ర‌కు వ‌ర‌కు బాదుడే తార‌క మంత్రం. ఇప్పుడు అదే టెక్నిక్ ను టెస్ట్ ల్లోనూ మొద‌లుపెట్టింది. మూడు టెస్ట్ ల సీరీస్ లో హార్డ్ హిట్టింగ్ తో న్యూజిలాండ్ ను మానసికంగా దెబ్బ‌తీసిన ఇంగ్లాండ్, అదే ధాటి ఇండియాకు చూపించింది.

277, 299, 296. ఇప్పుడు 378. ఇంగ్లండ్ నాలుగు వరుస టెస్ట్ మ్యాచ్‌లలో నాలుగు సూప‌ర్ ఛేజింగ్‌లు. ఈ సిరీస్‌ను 2-2తో కైవసం చేసుకుంది ఇంగ్లాండ్. 378 టార్గెట్ ఇచ్చి ఇండియా ఎప్పుడూ ఓడిపోలేదు. ఈసారి మాత్రం, ఇంగ్లాండ్ 76.4 ఓవ‌ర్లో మూడు వికెట్ల న‌ష్టానికి, 378 ప‌రుగులు చేసింది. జోరూట్( Joe Root)
173 బాల్స్ లో 142 ర‌న్స్ కొడితే, బెయిర్ స్టో( Jonny Bairstow) 145 బాల్స్ లో 114 సాధించాడు. ఇద్ద‌రి ర‌న్ రేటు 80. టెస్ట్ క్రికెట్ లో ఇలాంటి బ్యాటింగ్ అసాధారణం. అందులోనూ ఇండియాలాంటి బౌలింగ్ ఎటాక్ మీద‌. ఈ త‌రహా ఛేజింగ్ ను కోచ్ ద్రావిడ్ ముందుగానే ఊహించాడు. ఇది యేడాది క్రితం నాటి ఇంగ్లాండ్ కాద‌ని చెప్పాడు. అత‌ని అంచ‌నా నిజ‌మైంది.

జో రూట్ కవర్‌లలోకి రివర్స్-స్వీప్ చేసి, సింగిల్‌తో జ‌ట్టును గెలిపించాడు. ఇది సింబాలిక్ షాట్. ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్ లో ఈ ఇంగ్లాండ్ జట్టు ప్రపంచంలోని రెండు అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ దాడులకు ఎదుర్కొంటూ, సాహసాన్ని చూపించింది. ముందు న్యూజిలాండ్ సీరీస్ ను గెల్చిన ఇంగ్లాండ్, ఈసారి ఇండియా బౌలింగ్ ఎటాక్ కు ఎదురొడ్డి నిల్చింది.

ఇది ఇంకెంత్ర మాత్రం టెస్ట్ క్రికెట్ కాదు. క్రీజులో పాతుకుపోయి, ఓవ‌ర్లు తినేసి, బౌల‌ర్లు ఆల‌సిపోయేలా చేసి, పిచ్ కు తగ్గ‌ట్టుగా ఆడ‌టంకాదు. బ్యాటింగ్ లో దూకుడు. ఓవ‌ర్ కు క‌నీసం ఐదు ర‌న్స్ అయినా కొట్టాలి. రిజ‌ల్ట్ కావాలి. విజ‌య‌మో వీర‌స్వ‌ర్గ‌మో పిచ్ లోనే తేలిపోవాల‌న్న‌ది ఇంగ్లాండ్ స్టైల్. దీనికి పెట్టిన పేరు Bazball. మొద‌టి బాల్ నుంచి బాదుడే.

పిచ్ ఫ్లాట్ గా ఉంది కాబ‌ట్టి, ఇంగ్లాండ్ చెల‌రేగి ఆడింది. అంతెందుకు రిష‌బ్ పంత్, ఆల్ రౌండ‌ర్ జ‌డేజా ఇంగ్లాండ్ కు అదే దూకుడు చూపించారు. కాని ఈ సాహ‌సం ఎంత‌కాలం కొన‌సాగించ‌గ‌ల‌రు? స్వింగ్ అవుతున్న‌ప్పుడు, బాల్ గింగ‌రాలు తిరుగుతున్న‌ప్పుడు హిట్టింగ్ చేయ‌గ‌ల‌రా? అప్పుడుకూడా అదే దూకుడ‌ని అంటోంది ఇంగ్లాండ్.

బ్రెండన్ మెకల్లమ్ కోచ్ గా వ‌చ్చాడు. బెన్ స్టోక్స్ కెప్టెన్ అయ్యాడు. ఇద్ద‌రు క‌ల‌సి ఈ ఇంగ్లాండ్ జట్టుపై చూపించిన ప్ర‌భావం ఏంటో, జో రూట్- జానీ బెయిర్‌స్టో మైదానంలో ప్ర‌ద‌ర్శించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి