iDreamPost

పిడుగులు పడుతున్నప్పుడు షవర్ బాత్ చేస్తున్నారా?

పిడుగులు పడుతున్నప్పుడు షవర్ బాత్ చేస్తున్నారా?

మీకు వర్షాకాలంలో షవర్ బాత్ చేసే అలవాటుందా? ఉరుములు, పిడుగులు మీ ఏరియాలో సర్వ సాధారణమా?  అయితే ఒక్క క్షణం ఆగండి. పిడుగులతో కూడిన వర్షం పడేటప్పుడు షవర్ బాత్ చేసినా, స్నానం చేసినా, అంట్లు కడిగినా మీ ప్రాణానికే ప్రమాదం వాటిల్లవచ్చు. మామూలుగా అయితే పిడుగులు పడేటప్పుడు చెట్టు కింద నిల్చోకూడదని, కిటికీకి దగ్గరగా ఉండకూడదని, కార్డ్ ఫోన్ లో మాట్లాడకూడదని మనకు తెలుసు. కానీ షవర్ లేదా టాప్ తిప్పినా కూడా ప్రమాదమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంత ప్రమాదం దేనికి?

పిడుగుపాటు ఇంటిని తాకినప్పుడు దాన్నుంచి పుట్టిన విద్యుచ్ఛక్తి మెటల్ వైర్ల ద్వారా కానీ పైపుల్లో నీటి ద్వారా కానీ నేలను తాకే ప్రయత్నం చేస్తుంది. అందుకే షవర్ కానీ టాపులు కానీ తిప్పి ఉంటే కరెంట్ షాక్ కొట్టి ప్రాణానికే ముప్పు రావచ్చు.

జాగ్రత్తగా ఉండడమెలా?

ఉరుములు, పిడుగుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 24 వేల మంది చనిపోతున్నారు, 2 లక్షల 40 వేల మంది గాయపడుతున్నారు. అందుకే పిడుగులు పడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పిడుగులతో కూడిన వాన కురుస్తున్నప్పుడు ట్యాప్స్ తిప్పకపోవడమే మంచిది. అలాగే కాంక్రీట్ గోడకు ఆనుకోకపోవడం కూడా ఉత్తమం. కాంక్రీట్ నుంచి కరెంట్ పాస్ కాకపోయినా అది కట్టడానికి ఇనుప చువ్వలు వాడి ఉంటే ప్రమాదమే! పిడుగులు పడేటప్పుడు టీవీలు, కంప్యూటర్లు, వాషింగ్ మెషీన్ల కేబుల్స్ ప్లగ్గుల్లో పెట్టి అసలు పని చేయకూడదు. వాటి వైర్లను ఎలక్ట్టిక్ సాకెట్లలో నుంచి తీసేయడం మేలైన పని.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి