iDreamPost

లోకేష్ ప‌ర్య‌ట‌న‌తో పార్టీకి లాభమా..? నష్టమా..?

లోకేష్ ప‌ర్య‌ట‌న‌తో పార్టీకి లాభమా..?  నష్టమా..?

ఎమ్మెల్సీ నారా లోకేష్‌.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడి కుమారుడు. అయిన‌ప్ప‌టికీ రాజ‌కీయంగా లోకేష్ అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయార‌నేది వాస్త‌వం. ఆయ‌న రాజ‌కీయ వ్య‌వ‌హార శైలి, ప్ర‌సంగాలు ఎప్పుడూ విమ‌ర్శ‌ల పాల‌వుతూనే ఉంటాయి. ఒక‌టో.. అరో ఎక్క‌డో చోట ఆక‌ట్టుకుంటున్నా.. అత్య‌ధికంగా లోకేష్ వ‌ల్ల టీడీపీ న‌వ్వుల పాల‌వుతుంద‌నే గుస‌గుస‌లు పార్టీలోనే వినిపిస్తుంటాయి. వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో కొన్ని రోజులుగా బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు లోకేష్ ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఆయ‌న ప‌ర్యట‌న‌తో తెలుగుదేశానికి మంచి జ‌రుగుతోందా..? లేదా..? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకు కార‌ణాలు అనేకం క‌నిపిస్తున్నాయి. ఆయ‌న ప‌ర్య‌టించిన అనంత‌పురం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న‌లే ఇందుకు నిద‌ర్శ‌నాలుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

చిచ్చు పెడుతున్న లోకేష్ ప‌ర్య‌ట‌న‌

నారా లోకేష్ ఎక్క‌డికెళ్లినా అక్క‌డ పార్టీలో ఏదో చిచ్చు రేగుతోంది. లోకేశ్ జ‌నంలోకి వ‌స్తున్నారంటే పార్టీ లోని కొంత మంది ఏం జ‌రుగుతుందోన‌ని ఆందోళ‌న‌కు గురి అవుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. అధినేత కుమారుడు కాబ‌ట్టి స్వాగ‌తం ప‌లుకుతున్నారు కానీ.. లేదంటే ఆయ‌నకు ఎవ‌రైనా ప్రాధాన్యం ఇస్తారా..? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీలో వ్యక్తుల ఆధిపత్య పోరు కారణంగా సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ శమంతకమణితో పాటు ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. శమంతకమణి నిష్క్రమణతో నేతల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. సింగనమల నియోజకవర్గ ప్రస్తుత ఇన్ చార్జి బండారు శ్రావణి కూడా పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత నారా లోకేష్‌ అనంతపురం పర్యటన విభేదాలను బయపడేసింది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన శ్రావణి.. లోకేష్‌ పర్యటనకు దూరంగా ఉన్నారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఎంఎస్‌ రాజుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఆకివీడు మండ‌లంలో జ‌రిగిన ఘ‌ట‌న కూడా తెలుగుదేశం శ్రేణుల‌ను ఉలిక్కిపాటుకు గురి చేసింది. అది ప్ర‌మాద‌మే అయిన‌ప్ప‌టికీ లోకేష్ మ‌రోసారి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారారు.

పార్టీ శ్రేణులే విడ్డూర‌మ‌నుకునేలా…

కోస్తా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్ర‌భుత్వంపై ఆయ‌న చేసిన విమ‌ర్శ చివ‌రికి టీడీపీ శ్రేణుల్నే ముక్కున వేలేసుకునేలా చేసింది. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయకుండా.. కేంద్రం వద్ద తాకట్టు పెట్టేశారని లోకేశ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారో లేదో పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని ఆయ‌న నిలదీశారు. 2014లో కూడా వైసీపీపై తండ్రీకొడుకులు ఇలాంటి ఆరోప‌ణ‌లే చేశారు. చివ‌రికి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ఎన్‌డీఏ నుంచి బ‌య‌టికొచ్చి ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోస‌మంటూ కాంగ్రెస్‌తో చేతులు క‌లిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ …ఆ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్‌తో కలిసి చంద్ర‌బాబు సుడిగాలి పర్య‌ట‌న‌లు చేశారు. ఇప్పుడు వైసీపీని పిల్ల కాంగ్రెస్ అని లోకేశ్ మాట్లాడ్డం సొంత పార్టీ శ్రేణుల‌కే విడ్డూర‌మ‌నిపిస్తోంద‌న‌డం అతిశ‌యోక్తి కాదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి