iDreamPost

ఇదే ఒరవడి కొనసాగించాలి సీఎం గారు

ఇదే ఒరవడి కొనసాగించాలి సీఎం గారు

మీడియా మేనేజ్‌మెంట్‌లో దేశంలో ఏ పార్టీ కూడా టీడీపీతో పోటీపడలేదు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ఉన్నతి మీడియా మేనేజ్‌మెంట్‌ ద్వారానే సాధ్యమైందని రాజకీయ పరిశీలకులు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. 2008 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్‌ న్యూస్‌ ఛానెళ్లు.. ఇలా అన్ని మాధ్యమాలు బాబు వెన్నంటి ఉన్నాయి. దీనికి ఇరు పక్షాల మధ్య సామాజిక, ఆర్థిక అంశాలు ముఖ్య భూమిక పోషించాయి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు ప్రయోజనాలకు అనుగుణంగా ఆయా మీడియా సంస్థలు పని చేస్తున్నాయి. 2008లో ప్రత్యామ్నాయం వచ్చినా.. చంద్రబాబుకు మద్దతిస్తున్న మీడియాదే పైచేయి.

గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిపాలైన తర్వాత నెలలు తిరగకముందే చంద్రబాబు నూతన ప్రభుత్వంపై మాటల దాడి చేయనారంభించారు. ప్రతి ప్రభుత్వానికి మొదట ఆరు నెలలు ‘‘హనీమూన్‌ పిరియడ్‌’’ ఉంటుందన్న సంగతి మరిచి చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇసుక, ఇంగ్లీష్‌ మీడియం, రాజధాని, కియాపై అసత్య ప్రచారం.. ఇప్పుడు పరిశ్రమలు తరలిపోతున్నాయి.. ఇలా వరుసగా ప్రతి అంశంపై చంద్రబాబు నెగిటివ్‌గా మాట్లాడుతుండగా.. అనుకూల మీడియాలో (ఎల్లో మీడియాగా వైఎస్సార్‌సీపీ పిలుస్తోంది) కథనాలు వండి వారుస్తోంది.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన, రైతు భరోసా, అమ్మ ఒడి లాంటి సంక్షేమ పథకాలు.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, అభివృద్ధి పనులకు పక్కా ప్రణాళిక.. ఇలా అన్ని అంశాల్లో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ముందుకెళుతూ ప్రజల అభిమానాన్ని చూరగొంటోంది. ఈ నేపథ్యంలో తెలుగు మీడియాలో ఓ వర్గం నెగిటివ్‌ కథనాలు ప్రచురిస్తున్నా.. చంద్రబాబు తాను అనుకున్న లబ్ధి మాత్రం పెద్దగా రావడంలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తన వ్యూహాన్ని మార్చారు.

జాతీయ మీడియాను రంగంలోకి దింపారు. తనకున్న పరిచయాలు, స్థానిక మీడియా పెద్దల సహాకారం, ఆర్థికపరమైన అంశాల ఆధారంగా.. జాతీయ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై నెగిటివ్‌ కథనాలు రాయించడం మొదలు పెట్టారు. అందులో భాగమే రాజధాని, కియా వ్యవహారం, పరిశ్రమలు తరలిపోతున్నాయి.. వంటి అంశాలపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు. ఆయా కథనాలను ఉటంకిస్తూ.. ఎల్లో మీడియా మళ్లీ కథనాలు రాస్తూ రాష్ట్రంలో ఏదో జరుగుతోందన్న ఆలోచన ప్రజల మనస్సుల్లో జొప్పించాలని చేయని ప్రయత్నమంటూ లేదు. చంద్రబాబు ఆయా కథనాలను చూపుతూ గంటల తరబడి మీడియాతో మాట్లాడడం నిన్నటి వరకు చూసాం.

స్థానిక మీడియా అసత్య కథనాలను, చంద్రబాబు తీరును.. సోషల్‌ మీడియా ద్వారా వైఎస్సార్‌సీపీ శ్రేణులు తిప్పుకొడుతుండగా.. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల వల్ల జరిగే నష్టం నివారణకు ఇప్పటి వరకు ఏ ప్రయత్నం చేయలేదు. అయితే.. వెనకో, ముందో.. ఏదైతేనేం.. రాష్ట్ర ప్రభుత్వం మేల్కోంది. జాతీయ మీడియా వ్యవహారంలో సీఎం వైఎస్‌ జగన్‌ నేరుగా రంగంలోకి దిగారు. నిన్న సోమవారం జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇంగ్లీష్‌ మీడియం, వైద్యం, రాజధాని, ప్రత్యేక హోదా, మండలి రద్దు, పోలవరం, కియాపై అసత్య ప్రచారం, పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు.. ఇలా ముఖ్యమైన అంశాలపై జాతీయ మీడియా ప్రతినిధులతో తన ఆలోచనలను పంచుకోవడంతో ఇటీవల వరకు జరిగిన పరిణామాలకు కొంత వరకు తెరదించినట్లైంది.

చంద్రబాబు జిమ్మిక్కులను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు తిప్పి కొట్టేలా ఇదే ఒరవడి ఇకపైనూ కొనసాగించడం వల్ల పరిపాలనపై పూర్తిగా దృష్టిపెట్టేందుకు అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి