iDreamPost

ఇఎస్ఐ స్కాంలో అచ్చెన్న పాత్రపై సాక్ష్యాలు దొరికినట్లేనా ?

ఇఎస్ఐ స్కాంలో అచ్చెన్న పాత్రపై సాక్ష్యాలు దొరికినట్లేనా ?

సంచలనం సృష్టించిన ఇఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి, టిడిపి సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు పూర్తిగా ఇరుక్కున్నట్లేనా ? ఏసిబి కస్టడీలో ఉన్న అచ్చెన్నతో పాటు అప్పటి ఉన్నతాధికారులను ఏసిబి విచారిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏసిబి విచారణలో అచ్చెన్న పెద్దగా సహకరించకపోయినా ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళు మాత్రం కుంభకోణానికి సంబంధించిన పూర్తి విషయాలను బయటపెట్టేశారని తెలుస్తోంది. అంటే అరెస్టయిన ఉన్నతాధికారుల సాక్ష్యాలను బట్టి రూ. 157 కోట్ల భారీ కుంభకోణంలో అచ్చెన్నే కీలక సూత్రదారిగా అర్ధమవుతోంది.

ఇఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్న అరెస్టయిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు, లోకేష్, అచ్చెన్న విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. కుంభకోణం జరగలేదని ఎవరూ చెప్పటం లేదు. కాకపోతే జరిగిన కుంభకోణంతో అచ్చెన్నకు సంబంధమే లేదని అంతా ఉన్నతాధికారులదే బాధ్యత అంటూ విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. ఓ శాఖలో కుంభకోణం జరిగిందని నిర్ధారణ అయిన తర్వాత మంత్రికి ప్రమేయం లేకుండా ఉన్నతాధికారుల స్దాయిలోనే జరిగిందంటే నమ్మేవారు ఎవరూ లేరు. శాఖల నిర్వహణలో అంతిమ నిర్ణయం మంత్రిదే అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు.

పైగా అచ్చెన్న లాంటి దూకుడు స్వభావం ఉన్న నేత ఏ శాఖను నిర్వహిస్తుంటే ఆ శాఖలోని ఉన్నతాధికారులు దాదాపు డమ్మీలుగా మిగిలిపోవాల్సిందే. అచ్చెన్నకు తెలీకుండా శాఖల వ్యవహారాలన్నీ మొత్తం ఉన్నతాధికారులే చూసుకునే వాళ్ళంటే వినటానికే ఆశ్చర్యంగా ఉంది. పైగా మందుల కొనుగోలు, వైద్య పరికరాల కొనుగోలులో తెలంగాణాలో ఏ పద్దతి ఫాలో అయితే అదే పద్దతిని ఏపిలో కూడా ఫాలో అవ్వమని తానే లేఖరాసినట్లు అచ్చెన్న అంగీకరించాడు.

కాబట్టే తెలంగాణాలో కుంభకోణానికి తెరలేచినట్లే ఏపిలో కూడా అవినీతి జరిగిందన్నది అందరికీ అర్ధమైపోయింది. అచ్చెన్న లేఖ ఆధారంగానే టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో కాల్ సెంటర్, ఈసీజీ సేవల్లో భారీ దోపిడి జరిగిందని ఏసిబి గుర్తించింది.

మూడు రోజుల విచారణలో అచ్చెన్న పెద్దగా ఏసిబి ఉన్నతాధికారులకు సహకరించలేదని సమాచారం. ఏసిబి ఉన్నతాధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు మాజీమంత్రి మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరించాడట. అయితే కస్టడీలో ఉన్న అప్పటి ఉన్నతాధికారులు మాత్రం కుంభకోణంలో అచ్చెన్న పాత్రను వివరించి చెప్పేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే కుంభకోణంలో అచ్చెన్న పూర్తిగా ఇరుక్కున్నట్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి