iDreamPost

దగ్గుబాటి పయనమెటు?

దగ్గుబాటి పయనమెటు?

నేటి రాజకీయాల్లో పాతకాల సాంప్రదాయ వైఖరితో రాణించటం కష్టమని ఓటమితో డాక్టర్ గారికి అర్ధమయింది. పర్చూరు నియోజకవర్గం నుంచి తన ఓటమిని కలలో కూడా ఊహించని డాక్టర్ గారికి వారి సామాజికవర్గ ఓట్లు పడలేదన్న విషయం కూడా అర్ధమైంది. గెలిచినప్పుడే పెద్దగా ప్రజలలో తిరిగే అలవాటు లేని డాక్టర్ గారు ఓటమి తరువాత సైలెంట్ అయ్యారు. కొడుకు చెంచురామ్‌ కూడా పెద్దగా జనంలో తిరగడం మానేశారు.మరో వైపు వైసీపీలో కొత్త నాయకులు దూసుకుపోతుండటం మాజీ ఇంచార్జ్ రామనాథం బాబు తిరిగి క్రియాశీలకంగా మారటంతో ఆయనని తిరిగి పర్చూరు అసెంబ్లీ ఇంచార్జ్ గా వైసీపీ పార్టీ అధిష్టానం నియమించింది.

బీజేపీలో ఉన్న పురందేశ్వరిని కూడా వైఎస్సార్‌సీపీలో తీసుకురావాలని అధిష్టానం చెప్పడం,అది కుదరకపోవడంతో వారు సైలెంట్‌ అయ్యారన్న వాదనలు దగ్గుబాటి అనుచరులలో ఉన్నా దానిలో వాస్తవం పాలు తక్కువ. వైసీపీ పార్టీ జిల్లా నాయకత్వంతో పెద్దగా సంబంధాలు లేకపోవటం,గతకాలపు పెద్దరికం తాలూకు అభిజాత్యం…అన్ని కలిసి వైసీపీలో డాక్టర్ గారు ఒంటరి అయ్యారు.అధికార పార్టీలో ఉన్నా లేనట్లయ్యారు.

కొత్త ఇంచార్జ్ రామనాథం బాబు ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కాపోవటం, రాష్ట్రంలో 151 సీట్లు గెలిచినా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ప్రకాశం జిల్లాలోని అద్దంకి,పర్చూరు మరియు చీరాలలో వైసీపీ ఓడిపోవటంతో ఆప్రాంతంలో బలమైన నాయకుడి కోసం వైసీపీ నాయకత్వం అన్వేషించింది.మార్టూరు నియోజవర్గం రద్దుతో మార్టూరుతో సహా కొన్ని మండలాలు పర్చూరు నియోజకవర్గంలో కలవగా మరికొన్ని అద్దంకిలో విలీనమయ్యాయి.గతంలో మార్టూరు,అద్దంకి ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాంకూ పర్చూరు ప్రాంతంలో గట్టి అనుచర వర్గం ఉంది.

మరో వైపు కరణం బలరాం ఎమ్మెల్యేగా గెలిచిన రెండవ రోజు నుంచే పార్టీ మారుతాడని ప్రచారం జరిగింది.బీజేపీలోకి వెళుతున్నామని ఆయన అనుచరవర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.ఒక దశలో గంటా శ్రీనివాసరావు నాయకత్వంలో 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళుతున్నారని రాజకీయ వర్గాలలో బలంగా ప్రచారం సాగింది.ఏమైందే ఏమో కానీ ఆ వలసలు ప్రచారానికి మాత్రమే పరిమితమై ఆగిపోయాయి.

తాజాగా ఇప్పుడు బలరాం వైసీపీలో చేరటం(ఆయన చేరలేదు,కొడుకు చేరాడు) ఇరుపక్షాలకు ఉభయతారకం. తెలుగుదేశంలో ఉన్న రోజుల్లో దగ్గుబాటి, బలరాం మధ్య బహిరంగ విబేధాలు లేవు.కానీ మొదటి నుంచి చంద్రబాబు వర్గంగానే గుర్తింపు పొందిన బలరాంకు జిల్లా రాజకీయాలలో దగ్గుబాటితో ఎప్పుడు పొసిగేది కాదు. బలరాం కుటుంబం వైసీపీ రంగప్రవేశంతో ఆప్రాంత రాజకీయ చిత్రం ఎలా మారుతుందో చూడాలి. బలరాం గతంలో మాదిరి జిల్లాస్థాయిలో బలంగా రాజకీయాలు నడుపుతారా?లేక పర్చూరు వరకే పరిమితం అవుతారో వేచి చూడాలి.

మరోవైపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా (రెండు సార్లు పర్చూరు,ఒక ఉప ఎన్నికతో కలుపుకొని రెండుసార్లు మార్టూరు) ఒకసారి బాపట్ల ఎంపీగా,మరొకసారి రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుగారు ఎలా వ్యవహరించబోతున్నారోనన్న ఆసక్తి వైసీపీ కార్యకర్తలలో నెలకొనివుంది.వైసీపీలోనే సర్దుకొని పోతారా లేక అప్రకటిత రాజకీయ సన్యాసం తీసుకుంటారా అన్న చర్చ ప్రకాశం జిల్లాలో జరుగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి