iDreamPost

మ్యాచ్ గెలిచిన పంజాబ్.. మనసులు గెలిచిన సంజు!

మ్యాచ్ గెలిచిన పంజాబ్.. మనసులు గెలిచిన సంజు!

పంజాబ్ మ్యాచ్ గెలిచింది. అయితే… కేరళ కుర్రాడు, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం అందరి మనసులు గెలిచాడు. మొదటి నుంచి చివరి వరకు క్రీజ్లో నిలిచి అతడు మ్యాచ్ కోసం పోరాడిన ఆట అందరినీ ఆకట్టుకుంది. పోరాడితే పోయేదేమీ ఉండదు.. అన్న సూత్రాన్ని నమ్ముకున్న కేరళ కుర్రోడు రాజస్థాన్ ను గెలిపించినంత పని చేసాడు. సహచరుల మద్దతు లేకున్నా మొదటి నుంచి చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. భారీ లక్ష్యాన్ని ఎం సాధిస్తుంది అనుకున్న జట్టును విజయం ముంగిట వరకు తీసుకొచ్చాడు. చివరి బంతికి 5 పరుగులు కావలసిన తరుణంలో భారీ షాట్ గతి తప్పడంతో మ్యాచ్ రాజస్థాన్ నుంచి చేజారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏమైనా జరగొచ్చు అన్న దానికి సోమవారం పంజాబ్, రాజస్థాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ మరో ఉదాహరణగా నిలిచింది.

బ్యాటింగ్ లో సత్తా చాటిన పంజాబ్ జట్టు ఐపీఎల్ మొదటి మ్యాచ్ను విజయంతో ఆరంభించింది. రాజస్థాన్ రాయల్స్ తో ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ బ్యాట్స్మెన్స్ అంతా రావడంతోనే హిట్టింగ్ మొదలు పెట్టారు. మొదటి వికెట్ త్వరగా కోల్పోయిన పంజాబ్ ను వికెట్ డౌన్ లో క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ తన సహజసిద్ధమైన ఆటతో స్కోరుబోర్డు వేగాన్ని పెంచాడు. మరో పక్క కెప్టెన్ కె.ఎల్.రాహుల్ సైతం ఎక్కడా తగ్గకుండా బౌండరీలు సాధించాడు. వీరిద్దరు క్రీజ్లో ఉండగా సింగిల్స్ తక్కువగా బౌండరీలు ఎక్కువగా వచ్చాయి. 42 రన్స్ చేసిన తర్వాత అవుట్ అయిన గేల్ మెరుపులను తర్వాత వచ్చిన దీపక్ హుడా కొనసాగించాడు. గేల్ కంటే వేగంగా స్కోర్ పెంచే బాధ్యత తీసుకున్నాడు. వరుస సిక్సర్లతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. హుడా అర్థ సెంచరీ సాధించే సరికి 2 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. మరోపక్క కె.ఎల్.రాహుల్ సైతం ధాటిగా ఆడుతూ ముందుకు సాగడంతో వీరి జోడిని ఎలాగైనా అడ్డుకోవాలనే తలంపుతో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ వరుసగా బౌలర్లను మార్చాడు. రాజస్థాన్ జట్టులోని ఎనిమిది మంది సభ్యులు బౌలింగ్ వేయడం విశేషం. 91 పరుగులు చేసిన కెప్టెన్ కేఎల్ రాహుల్ క్యాచ్ను అద్భుతంగా తేవతీయ అందుకోవడంతో ఇన్నింగ్స్ కు తెర పడింది. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అంతగా ప్రభావం చూపకపోవడం తో పంజాబ్ 221 పరుగులు సాధించింది.

222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఖాతా తెరవకుండానే మొదటి వికెట్ కోల్పోయింది. తర్వాత వరుసగా రెండు వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ సంజు నిలకడగా ఆడుతూ, జట్టును ఆదుకునే ప్రయత్నం చేసాడు. సంజు కు ఏకంగా మూడు క్యాచ్ లు వదిలేసారు. దింతో వచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ చక్కగా వినియోగించుకున్నాడు. వినియోగించుకోవడం కాదు ఏకంగా చివరి వరకు నిలిచి మ్యాచ్ ను గెలిపించినంత పనిచేశాడు. రాజస్థాన్ బ్యాట్స్మెన్లు పరుగులు సాధించడానికి కష్టపడిన మెల్లగా రన్ రేట్ తగ్గించుకుంటూ వచ్చారు . క్రీజ్లో నిలదొక్కుకుని ఒక్కో పరుగు చేస్తున్నా సరే లక్ష్యం చాలా పెద్దగా ఉండటంతో, చేరుకోవడం చాలా కష్టం అయ్యింది. అందులోనూ రాజస్థాన్లో సీనియర్ బ్యాట్స్మెన్లు ఎవరూ లేకపోవడంతో కుర్రాళ్ళు దిక్కు అయ్యారు. ఆడుకొచ్చారు. అవసరం అయిన సందర్భంలో గట్టిగా హిట్టింగ్ చేసే పంచ్ హిట్టర్ లేకపోవడం రాజస్థాన్ ప్రధాన లోపంగా కనిపించింది. జూనియర్ బ్యాట్స్ మాన్ లను పంజాబ్ బౌలర్లు తికమక పెట్టి, బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడం కష్టం అయ్యింది. శివమ్ దూబే, బట్లర్, రియాన్ పరాగ్ దాటిగా ఆడిన క్రీజ్లో నిలదొక్కుకుకోలేకపోయారు అప్పటికే బాల్స్ తక్కువ, చేయాల్సిన రన్స్ ఎక్కువ కావడంతో విజయం మీద ఆశలు పోయాయి. అయితే క్రీజులో నిలబడి ఉన్న సంజు శాంసన్ మాత్రం విజయం మీద ఎక్కడ నమ్మకం కోల్పోలేదు. ప్రతి బంతిని బదుతూ 52 బాల్స్ లో సెంచరీ చేశాడు. అక్కడితో ఆగిపోకుండా మ్యాచ్ను గెలిపించేందుకు బాధ్యతగా ఆడాడు. అయితే చివరి ఓవర్లో 13 రన్స్ సాధించాలి అన్న తరుణంలో స్ట్రైకింగ్ కు సరైన భాగస్వామి లేకపోవడంతో పాటు, పంజాబ్ బౌలర్ హర్ష దీప్ చక్కటి బంతులు వేయడంతో 4 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది.

మంగళవారం ముంబై ఇండియన్స్ కు కోల్కతా నైట్రైడర్స్ కు మ్యాచ్ జరగనుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్ ముంబై కి చాలా కీలకం. మొదటి మ్యాచ్లో ఓటమి పాలై వెనుకబడిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో గెలిస్తే మళ్ళీ పుంజుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి