iDreamPost

చిన్నబోయిన చెన్నై!!

చిన్నబోయిన చెన్నై!!

ఐపీఎల్ లో ఏదైనా జరగొచ్చు. భారీ స్కోర్లు సాధించామని బౌలింగ్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం తప్పదు. పెద్ద స్కోర్లు సైతం బౌలింగ్ సరిగా లేకుంటే చిన్నబోతాయి అని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు నిరూపించారు. బ్యాటింగ్ బౌలింగ్లలో ఏమరుపాటుగా ఉంటే ఎం జరుగుతుందో శనివారం చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ రెండో మ్యాచ్ చెబుతుంది.

టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన చెన్నై ఓపెనర్లు రుతు రాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ లు త్వరగానే పెవిలియన్ చేరిన ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన సురేష్ రైనా చాలా ధాటిగా ఆడాడు. అతడికి అంబటి రాయుడు తోడుకావడంతో వీరిద్దరి భాగస్వామ్యం స్కోరుబోర్డును పరిగెలెట్టించింది. అయితే ఒకరి తర్వాత ఒకరు రైనా, రాయుడు అవుట్ అవ్వడం తో స్కోరుబోర్డు నెమ్మదించింది. కెప్టెన్ ధోనీ మీద కోటి ఆశలు పెట్టుకుంటే డెక్ అవుట్ అవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే చివర్లో సామ్ కరణ్, జడేజాలు మళ్ళీ పరుగుల వేట లో ముందుకు సాగడం తో చెన్నై మంచి స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. ట్వంటీ ట్వంటీ ఫార్మట్ కు ఇది మంచి స్కోర్ అయినా దీనిని కాపాడుకోవడంలో చెన్నై సూపర్ కింగ్స్ విఫలమైంది.

లక్ష్య చేదనకు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ వికెట్లు తీయడానికి చెన్నై బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. వారి విధ్వంసాన్ని అడ్డుకోలేక పోయారు. గత ఐపీఎల్ ఫార్మాట్లలో దారుణంగా విఫలమైన పృథ్వీ షా ధాటిగా ఆడి, తన సత్తా నిరూపించడానికి తాపత్రయ పడినట్లు కనిపించింది. అందులోనూ పృథ్వీషా, శిఖర్ ధావన్ ల క్యాచ్ లను పలుమార్లు చెన్నై ఫీల్డర్లు వదిలేయడంతో వారికీ జీవధారం లభించడం, దానిని పుష్కలంగా వారు వాడుకోవడం కనిపించింది. మైదానానికి అన్నివైపులా, ఇటు ఫాస్ట్ బౌలింగ్ లో అటు స్పిన్నర్ అనే తేడా లేకుండా పృథ్వీషా చాలా రేగిపోయి పరుగులు సాధించాడు. అతడికి సీనియర్ అయిన ధావన్ మంచి జోడీ అందించడంతో భారీ స్కోరును చాలా సులభంగా ఢిల్లీ క్యాపిటల్స్ అధిగమించి నట్లయింది. చెన్నై కెప్టెన్ ధోనీ పదేపదే బౌలర్లను మారుస్తున్న ఢిల్లీ ఓపెనర్లను అడ్డుకోలేక పోయారు. దాదాపు ప్రతి బంతి ని బౌండరీ దాటిచాలన్న ఇద్దరిలో కనిపించింది. అందులోనూ కుడి ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్లు కావడంతో వారిని ఔట్ చేయడం చెన్నై బౌలర్ల వల్ల కాలేకపోయింది. 138 పరుగుల వద్ద మొదటి వికెట్ పృథ్వీషా రూపంలో చెన్నై కు దక్కడంతో చెన్నై శిబిరం ఊపిరి పీల్చుకుంది. 38 బాల్స్ లో 72 రన్స్ వ్యక్తిగత స్కోరు వద్ద పృథ్వీషా అవుట్ కావడంతో, ధావన్ కు కెప్టెన్ రిషబ్ పంత్ జతకలిశాడు. పృథ్వీ షా అవుట్ అయిన తర్వాత అతని బాధ్యతను ధావన్ తీసుకున్నాడు. ఫోర్ల బౌండరీలు కురిపిస్తూ ఏకంగా 54 బంతుల్లో 85 రన్స్ వ్యక్తిగత స్కోరు వద్ద ధావన్ అవుటయ్యాడు. అప్పటికి లక్ష్యం 21 బాల్స్ లో 22 గా ఉండటంతో మిగిలిన బ్యాట్స్ మాన్ విజయానికి అవసరం అయిన పరుగులు పూర్తి చేశారు.

ఆదివారం సాయంత్రం హైదరాబాద్ సన్రైజర్స్ తో కలకత్తా నైట్ రైడర్స్ తలపడనుంది. ఇద్దరూ సమఉజ్జీలుగా నే కనిపిస్తున్నప్పటికీ, బౌలింగ్లో సన్రైజర్స్ బలంగా ఉంటే బ్యాటింగ్లో కోల్కతా నైట్ రైడర్స్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. మరోపక్క రెండు జట్ల గెలుపు ఓటముల నిష్పత్తులు దాదాపు సమానంగానే ఉన్నాయి. రెండు జట్లు ఐపీఎల్లో తలపడిన 19 మ్యాచ్ లను పరిశీలిస్తే కోల్కతా కాస్త పైచేయి సాధించి 12 మ్యాచ్ లలో విజయం సాధిస్తే, హైదరాబాద్ ఏడు మ్యాచ్ల్లో మాత్రమే విజయాలు నమోదు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి