iDreamPost

ఆసక్తికరంగా నూతన ఎన్నికల కమీషనర్ కనగరాజ్ నివేదిక …

ఆసక్తికరంగా నూతన ఎన్నికల కమీషనర్ కనగరాజ్ నివేదిక …

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ , జీవోల వలన తాను పదవి కోల్పోయానని మాజీ ఈసీ నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేయడం , దానికి కౌంటర్ గా పంచాయితీ రాజ్ శాఖ చీఫ్ సెక్రటరీ ద్వివేది , ఈసీ సెక్రటరీ రామ్ సుందర రెడ్డిలు పలు అంశాలతో కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . అయితే నిన్న సోమవారం ప్రస్తుత ఎన్నికల కమిషనర్ కనగరాజ్ పలు న్యాయపరమైన అంశాలతో మరో పిటిషన్ దాఖలు చేశారు .

ఈసీ పదవీ కాలం , సర్వీస్ రూల్స్ విషయంలో తుది నిర్ణయం గవర్నర్ దని , ఎన్నికల కమిషనర్ విషయంగా చేసే ఏ చట్టమైనా తర్వాతి కమిషనర్ లకు కూడా వర్తిస్తుందని అందువలన కేవలం తనకోసమే ఆర్డినెన్స్ జారీ చేశారన్న నిమ్మగడ్డ వాదన అర్ధరహితమని కోర్టుకి తెలిపారు.అలాగే జీవో నెంబర్ 617 వలన తను పదవి కోల్పోయానన్న నిమ్మగడ్డ ఆరోపణ అసత్యమని ఆర్డినెన్స్ లోని క్లాజ్ 5 ప్రకారం ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన రోజే ఈసీ పదవి కోల్పోయారు తప్ప జీవో 617 వలన కాదని వివరించారు .

అలాగే బాధిత వ్యక్తిగా చెప్పుకొంటున్న నిమ్మగడ్డ స్వయంగా పిటిషన్ దాఖలు చేశాక ఇదే అంశం పై ఇతరులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు , రిట్ పిటిషన్స్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నిస్తూనే సదరు పిటిషన్లు నిమ్మగడ్డ పిటిషన్లకు కాపీ పేస్ట్ అని నిమ్మగడ్డ పిటిషన్ లోని 13 పేరాలు మరో పిటిషనర్ కామినేని శ్రీనివాస్ తర్వాతి రోజు పిటిషన్ లో యధాతధంగా వాడారని దీన్ని బట్టి నిమ్మగడ్డ తన పిటిషన్ కాపీ కామినేని కిచ్చి పిటిషన్ వేయటానికి ప్రోత్సహించాడని నివేదికలో కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు . అలాగే ఆర్డినెన్స్ ద్వారా పదవి కోల్పోయిన పాత కమిషనర్ ఏ హోదాలో పిటిషన్ దాఖలు చేస్తారంటూ ఆసక్తికరమైన ప్రశ్న లేవనెత్తారు .

దీని ద్వారా రమేష్ మినహా మరెవరికీ పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదంటూనే రమేష్ అర్హతని సైతం ప్రశ్నించినట్టయ్యింది . అలాగే కేంద్రానికి భద్రత కోరుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన లేఖ విషయం ప్రస్తావిస్తూ ఆ లేఖ కానీ దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ ప్రస్తుతం ఈసీ కార్యాలయంలో లేవంటూ వివరణ ఇస్తూ సదరు లేఖ తాలూకూ ప్రొసీడింగ్స్ వివరాల గురించి మాజీ ఈసీ నిమ్మగడ్డ సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేసినట్టు అయ్యింది .

కాగా ఈ లేఖ పై నెంబర్ , సంతకాల విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీకి పిర్యాదు చేసిన దరిమిలా సీఐడీ విచారణలో లేఖను డౌన్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్ ని ధ్వంసం చేయడంతో పాటు , దాన్ని ఎడిట్ చేసిన లాప్ టాప్ ను , పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ప్రింట్ అవుట్ తీసిన డెస్క్ టాప్ ను పలుమార్లు పార్మాట్ చేసి ఆధారాలు గల్లంతు చేసిన విషయం బయట పడటం పాఠకులకు విదితమే . మరి లేఖ , దాని తాలూకూ ఫైల్స్ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో లేవంటూ అందుకుగాను కోర్టుకి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని మాజీ ఈసీకి కల్పించిన ప్రస్తుత ఈసీ కనగరాజ్ చాతుర్యానికి నిమ్మగడ్డ బోల్తా పడినంత పని అయినట్టే .

అత్యంత క్లిష్టమైన ఈ అంశాల్ని నిమ్మగడ్డ ఏ విధంగా రీ కౌంటర్ చేస్తాడనేది ఆసక్తికరం .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి