iDreamPost

Sarfaraz Khan: వీడియో: టీమిండియాకు సెలక్ట్ అయిన సర్ఫరాజ్.. పట్టరాని సంతోషంలో తండ్రి!

  • Published Jan 29, 2024 | 9:33 PMUpdated Jan 29, 2024 | 9:33 PM

టీమిండియాలో చోటు కోసం సర్ఫరాజ్ ఖాన్ చేయని ప్రయత్నం లేదు. ఐపీఎల్​తో పాటు డొమెస్టిక్ క్రికెట్​లోనూ దుమ్మురేపాడు. అయినా చోటు దక్కలేదు. ఎట్టకేలకు ఇంగ్లండ్​తో సిరీస్​కు సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది.

టీమిండియాలో చోటు కోసం సర్ఫరాజ్ ఖాన్ చేయని ప్రయత్నం లేదు. ఐపీఎల్​తో పాటు డొమెస్టిక్ క్రికెట్​లోనూ దుమ్మురేపాడు. అయినా చోటు దక్కలేదు. ఎట్టకేలకు ఇంగ్లండ్​తో సిరీస్​కు సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది.

  • Published Jan 29, 2024 | 9:33 PMUpdated Jan 29, 2024 | 9:33 PM
Sarfaraz Khan: వీడియో: టీమిండియాకు సెలక్ట్ అయిన సర్ఫరాజ్.. పట్టరాని సంతోషంలో తండ్రి!

క్రికెట్​ను ఓ మతంలా భావించే భారత్​లో జాతీయ జట్టుకు ఆడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ డ్రీమ్​ను నిజం చేసుకునేందుకు వేలాది మంది క్రికెటర్లు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే వారిలో ఏ కొందరికో మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. కొందరికి ఆ ఛాన్స్ త్వరగానే వస్తే.. మరికొందరి విషయంలో మాత్రం ఏళ్లకు ఏళ్లు గడిచిపోతాయి. ఈ కోవలోకే వస్తాడు యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. దాదాపుగా పదేళ్లుగా భారత జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడీ స్టైలిష్ బ్యాటర్. ఐపీఎల్​తో పాటు డొమెస్టిక్ క్రికెట్​లోనూ తానేంటో చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. సెంచరీలు మీద సెంచరీలతో పాటు డబుల్, ట్రిపుల్ సెంచరీ బాదినా సెలక్టర్లు మాత్రం కరుణించలేదు. అధిక బరువు, ఫిట్​నెస్​ ఇష్యూస్ వల్ల అతడికి మొండిచేయి చూపారని వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఇంగ్లండ్​తో రెండో టెస్ట్​కు సర్ఫరాజ్​కు పిలుపు వచ్చింది. దీంతో అతడి తండ్రి నౌషద్ ఖాన్ పట్టరాని సంతోషంలో ఉన్నాడు.

రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్​ను ఎంపిక చేశారు సెలక్టర్లు. అతడ్ని వెంటనే టీమ్​తో జాయిన్ అవ్వాలని ఆదేశించారు. రాక రాక ఇన్నాళ్లకు తమ కల నెరవేరడంతో సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కొడుకు భారత్​కు ఆడాలని తాను కన్న కల నిజం కావడంతో ఆయన ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆయన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి థ్యాంక్స్ చెప్పారు. తన కొడుకు మీద నమ్మకం ఉంచినందుకు బోర్డుకు రుణపడి ఉంటామన్నారు. సర్ఫరాజ్ జర్నీ గురించి మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ‘సర్ఫరాజ్ టెస్ట్​ టీమ్​కు సెలక్ట్ అయ్యాడు. దీనికి ముంబై క్రికెట్ అసోసియేషన్​తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీకి కృతజ్ఞతలు చెప్పాలి. అతడు ఈ స్థాయికి చేరుకోవడంలో వాళ్ల కృషి ఎంతో ఉంది. మా మీద నమ్మకం ఉంచినందుకు బీసీసీఐకి, సెలక్టర్లకు థ్యాంక్స్. సర్ఫరాజ్ కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. అతడు భారత జట్టు తరఫున అద్భుతంగా ఆడాలని, టీమ్ సక్సెస్​లో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నా’ అని నౌషద్ ఖాన్ చెప్పుకొచ్చారు.

కాగా, ఇంగ్లండ్​తో జరిగే రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమయ్యారు. ఇంజ్యురీల కారణంగా వీళ్లిద్దరూ ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. వీళ్ల స్థానాల్లో సర్ఫరాజ్​తో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్​ను బోర్డు సెలక్ట్ చేసింది. వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు మొదలవనుంది. ఇక, ఉప్పల్ టెస్టులో రన్నింగ్ చేస్తుండగా జడేజాకు మడమ కండరం పట్టేసింది. రాహుల్​కు తొడ కండరం నొప్పి రావడంతో రెస్ట్ కావాలని అతడు బోర్డును కోరాడు. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. తమ వైద్యబృందం ఎప్పటికప్పుడు వాళ్లిద్దర్నీ పర్యవేక్షిస్తోందని తెలిపింది. వాళ్ల స్థానంలో సెలక్షన్ కమిటీ ముగ్గురు ఆటగాళ్లను సెలక్ట్ చేసిందని పేర్కొంది. కేఎల్, జడ్డూకు రీప్లేస్​మెంట్​గా సర్ఫరాజ్, సౌరభ్, సుందర్​ను టీమ్​లోకి తీసుకున్నామని వెల్లడించింది. మరి.. సర్ఫరాజ్ టెస్టు ఎంట్రీ కోసం మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి