iDreamPost

వైద్యుల అరుదైన ఘనత.. అవిభక్త కవలలకు కొత్త జీవితం!

  • Published Jul 27, 2023 | 1:25 PMUpdated Jul 27, 2023 | 1:25 PM
  • Published Jul 27, 2023 | 1:25 PMUpdated Jul 27, 2023 | 1:25 PM
వైద్యుల అరుదైన ఘనత.. అవిభక్త కవలలకు కొత్త జీవితం!

పైన ఫొటోలో చిరునవ్వులు చిందిస్తోన్న చిన్నారులను చూడగానే ఏమనిపిస్తోంది.. అబ్బ.. మచ్చ లేని చందమామలా ఎంత ముద్దుగా ఉన్నారో.. ఒక్కసారి దగ్గరకు తీసుకుని ముద్దు చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది కదా. అయితే నేడు ఆ చిన్నారుల పెదాలపై ఉన్న చిరునవ్వు విరబూయడానికి.. వారు ఎంతో బాధ, నొప్పిని భరించారు. కరెక్ట్‌గా చెప్పాలంటే.. తల్లి గర్భం నుంచి భూమ్మీదకు వచ్చాక.. మరో జన్మ ఎత్తినంత శ్రమ పడ్డారు. అరే ఇంత అందమైన చిన్నారులకు ఏమైంది అంటే.. ఇప్పుడు విడివిడిగా ఉన్న ఈ చిన్నారులు.. పుట్టకతోనే అవిభక్త కవలలు. వారిని చూసి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. కానీ వైద్యుల కృషితో ఆ చిన్నారులు వేరు అయ్యి.. నూతన జీవితాన్ని ఆస్వాదించబోతున్నారు. ఆ వివరాలు..

ఫొటోలోని చిన్నారుల పేరు రిద్ధి, సిద్ధిలు. గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో అవిభక్త కవలలుగా జన్మించారు. వీరి స్వగ్రామం బరేలి. చిన్నారుల తల్లి గర్భవతిగా ఉన్నప్పుడే అంటే నాలుగో నెలలోనే వారు అవిభక్త కవలలుగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు.. ఆ అవిభక్త కవలలను శస్త్ర చికిత్స ద్వారా విడదీసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. చిన్నారులు తల్లి గర్భంలో ఉండగానే వారు అవిభక్త కవలలుగా గుర్తించిన పోలీసులు అత్యాధునిక సౌకర్యాలు గల ఢిల్లీ ఎయిమ్స్‌కు చిన్నారుల తల్లిని రిఫర్ చేశారు. గత ఏడాది జూలై 27 ఛాతీ నుంచి కడుపు వరకూ అతుక్కుపోయి ఉన్న ఆడ కవల శిశువులు రిద్ధి, సిద్ధి జన్మించారు.

పుట్టిన వెంటనే వారిని అయిదు నెలల పాటు ఇంటెన్సివ్ కేర్​ యూనిట్- ఐసీయూలో ఉంచారు. అనంతరం వారికి శస్త్ర చికిత్సను తట్టుకునే సామర్థ్యం వచ్చింది అనుకున్న తర్వాత.. ఈ ఏడాది జూన్‌ 8వ తేదీన చిన్నారులకు శస్త్ర చికిత్స చేశారు. సుమారు తొమ్మిది గంటల పాటు శస్త్ర చికిత్సను నిర్వహించి విజయవంతంగా కవలలను విడదీశారు. ప్రస్తుతం కోలుకుంటున్న ఆ శిశువులిద్దరూ తమ మొదటి పుట్టిన రోజును అనగా జూలై 27న బుధవారం నాడు ఆస్పత్రిలోనే జరుపుకొన్నారు. తమ బిడ్డలకు కొత్త జీవితాన్ని ప్రసాదించారంటూ చిన్నారుల తల్లిదండ్రులు దీపిక, అంకుర్​ గుప్తా.. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్‌ జరుగుతున్నంతసేపు తాము ఎంతో భయపడ్డామని.. కానీ దేవుడి దయ వల్ల తమ బిడ్డలు క్షేమంగా విడదీయబడ్డారని సంతోషం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి