iDreamPost

అలుపెరుగని బాటసారి ‘దాసరి’ – Nostalgia

అలుపెరుగని బాటసారి ‘దాసరి’ – Nostalgia

ఇప్పటి తరం దర్శకుల్లో కెరీర్ మొత్తం కలిపి మహా అయితే ఓ పాతిక సినిమాలు చేయడమే గొప్ప అనుకునేలా ఉన్నాయి పరిస్థితులు. అలాంటిది ఏకంగా 140 చిత్రాలకు కెప్టెన్ గా వ్యవహరించి చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో ఆణిముత్యాలను అందించడం మాత్రం దాసరి గారికే సాధ్యమయ్యింది. మొదటి సినిమా ‘తాత మనవడు’తోనే ప్రేక్షకులను హృదయాలను గెలిచి సున్నితమైన సెంటిమెంట్ తోనే వసూళ్ల వర్షం కురిపించేలా చేసిన దాసరి గారి జన్మదినం ఈ రోజు. ప్రత్యక్షంగా మన మధ్య లేకపోయినా నిత్యం దాసరి గారి చిత్రాలు, ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లోని పాటలు టీవీలోనో యుట్యూబ్లోనో ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటాయి.

దర్శకరత్నగా పేరొందిన దాసరి గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవు. ఇప్పుడంటే మహానటిని చూసి మురిసిపోయాం కాని ఎన్నో ఏళ్ళ క్రితమే ఇలాంటి సబ్జెక్టుతోనే ‘శివరంజని’ తీసి అబ్బురపరిచారు. షష్టిపూర్తి వయసులో అక్కినేని నాగేశ్వర్ రావు గారితో ‘ప్రేమాభిషేకం’ లాంటి లవ్ స్టొరీతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం దాసరి గారికే చెల్లింది. హీరొయిన్ గా కెరీర్ డౌన్ అయిపోయి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు మార్కెట్ తగ్గిన టైంలో విజయశాంతితో ‘ఒసేయ్ రాములమ్మా’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తీసి ఆవిడకు మరో పదేళ్ళ కెరీర్ ని ఇవ్వడం మర్చిపోయేది కాదు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం టైంలో తీసిన ‘బొబ్బిలి పులి’ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

స్టార్ లేకుండా చేసిన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ వంద రోజులు ఆడింది. ‘కటకటాల రుద్రయ్య’ లాంటి కమర్షియల్ హిట్స్, ‘తాండ్రపాపా రాయుడు’ లాంటి పీరియాడిక్ డ్రామా, ‘ఎంఎల్ఎ ఏడుకొండలు’ లాంటి సెటైరికల్ మూవీ ఒకటా రెండా ప్రతి జానర్ లోనూ తనదైన ముద్రవేసిన దాసరి గారు మరోవైపు నటుడిగానూ చిరకాలం నిలిచిపోయే ఘనతలు ఎన్నో అందుకున్నారు. ‘సూరిగాడు’లో దాసరి గారి పెర్ఫార్మన్స్ కు కంటతడి పెట్టని ప్రేక్షకులు లేరు. చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమయ్యేంత కీర్తి ప్రతిష్టలు ఉన్న దాసరి నారాయణరావు గారు భౌతికంగా లేకపోయినా ఎప్పటికి మర్చిపోలేని సినిమాల రూపంలో సజీవంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో అలుపెరుగని బాటసారిగా తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటారు. అందుకే ఆయన పుట్టినరోజు మూవీ లవర్స్ కి చిరస్మరణీయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి