iDreamPost

అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు మరో మూడ్రోజులు భారీ వర్ష సూచన!

అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు మరో మూడ్రోజులు భారీ వర్ష సూచన!

రెండు తెలుగు రాష్ట్రాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. అయితే శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణలో కాస్త వర్షం తగ్గుముఖం పట్టిందని నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ, మరో మూడ్రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 24 గంటల్లో తెలంగాణ, కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని తెలిపారు.

కోస్తా ఆంధ్రా- ఒడిశానను ఆనుకునే అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇవాళో రోపో వర్షాలు తగ్గుతాయని ఎదురుచూసిన ప్రజలకు ఇది చేదు వార్తనే చెప్పాలి. జులై 25 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్టాల్లో భారీ వర్షాలు వదిలేలా లేవు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వైద్య, విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. వరదల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. నీటిని విడుదల చేస్తున్నారు కావున.. దిగువ ప్రాంతాల ప్రజలను, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేయాలన్నారు. టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నంబర్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు.

ఏపీలో చూసుకుంటే మన్యం, అల్లూరి, బాపట్ల, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. అంతేకాకుండా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కువ ప్రభావం ఉండే జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు. అత్యవసర పరిస్థితులలో కాంటాక్ట్ చేసేందుకు స్టే కంట్రో రూమ్ నంబర్లు 1070, 1800-4250101 అందుబాటులోకి తెచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి