iDreamPost

Hyderabad Crime: వెయ్యికి పైగా యువతులకు గాలం, 50 కోట్లు స్వాహా – మహానగరంలో మాయగాడు

Hyderabad Crime: వెయ్యికి పైగా యువతులకు గాలం, 50 కోట్లు స్వాహా – మహానగరంలో మాయగాడు

ఆ కేటుగాడు ఆరేళ్ళలో వెయ్యి మందికి పైగా యువతులకు గాలమేశాడు. 40 నుంచి 50 కోట్లు కాజేశాడు. ఎలా అనుకున్నారు? ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ వేదికగా! అదీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 94 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ దండిగా దోచుకున్నాడు. పాతిక లక్షలు పోగొట్టుకున్న ఓ NRI యువతి ఫిర్యాదుతో ఇతగాడి బండారం బయటపడింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవలే అతణ్ణి అరెస్ట్ చేశారు. ఓ అరవై మందిని మోసం చేసి 6 కోట్లు కొట్టేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. కానీ ఇతగాడి మోసాలు తవ్వేకొద్దీ బయటపడుతూ ప్రస్తుతానికి 50 కోట్ల మార్క్ దగ్గర ఆగాయి.

ఇంతకీ ఈ మాయగాడి పేరేంటనుకున్నారు? హర్ష ఉరఫ్ హర్షవర్ధన్ ఉరఫ్ చెరుకూరి హర్ష. ఇవన్నీ మారు పేర్లు అసలు పేరు మాత్రం జోగాడ వంశీ కృష్ణ. వయసు 31. ఊరు రాజమండ్రిలోని రామచంద్రరావు పేట. బీటెక్ చేసిన వంశీ ఉద్యోగం వెతుక్కుంటూ 2014లో హైదరాబాద్ వచ్చాడు. మొదట్లో కుకట్ పల్లిలోని ఓ హోటల్ లో పని చేశాడు. అప్పుడే మెల్లగా క్రికెట్ బెట్టింగ్ లు మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఓ జాబ్ కన్సల్టెన్సీలో చేరి 10 మంది యువకులను ఉద్యోగం పేరుతో మోసం చేసిన కేసులో అరెస్టయ్యాడు.

జైలు నుంచి వచ్చాక వంశీ కృష్ణ రూటు మార్చాడు. రకరకాల అమ్మాయిల పేర్లతో ఏకంగా 94 ఫేక్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేసి కొత్త దుకాణం తెరిచాడు. ఆన్ లైన్ వివాహ వేదికల్లో రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళలను కాంటాక్ట్ చేసేవాడు. తాను సంపాదించిన దాంట్లో సగానికి సగం సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతానంటూ బిల్డప్ ఇచ్చేవాడు. మారు అకౌంట్ల ద్వారా తనను తానే పొగుడుకుంటూ ఎదుటివాళ్ళను నమ్మించేవాడు. దీంతో చాలా మంది అమ్మాయిలు, మహిళలు అతనికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చేవాళ్ళు. నమ్మకం కలగడానికి ఇతను అవసరంలో ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు ఒకటి, రెండు లక్షలు సర్దుతుండేవాడు. డబ్బులు పోయినా దీని వల్ల మాంచి ప్రచారం జరిగేది. కొత్త చేపలు వల్లో పడేవి. ఇలా ఈ మహానుభావుడు ఆరేళ్ళ కాలంలో వెయ్యి – 1500 మంది అమ్మాయిల నుంచి 50 కోట్ల దాకా డబ్బు గుంజాడని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతానికి అతని అకౌంట్లను ఫ్రీజ్ చేసి 4 కోట్ల లావాదేవీలను నిలిపేశారు. రిమాండ్ లో ఉన్న ఇతగాణ్ణి త్వరలోనే కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి