iDreamPost

చంద్రబాబు మళ్లీ వచ్చాడు..ఎన్నాళ్లుంటారో

చంద్రబాబు మళ్లీ వచ్చాడు..ఎన్నాళ్లుంటారో

చంద్రబాబు మళ్లీ ఆంద్రప్రదేశ్ లోకి రావడం ఆసక్తికరమే. ఈసారి ఎన్నాళ్లుంటారన్నదే ప్రశ్న. గతంలో ఆయన హైదారబాద్ ఉంచి ఏపీలో అడుగుపెడుతున్నప్పుడు భారీ హంగామా చేశారు. టీడీపీ శ్రేణులను హైవే పైకి పిలిచి స్వాగత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి కూడా అప్పట్లో లాక్ డౌన్ సమయంలో హడావిడి చేసి ఈసారి ఎందుకు సైలెంట్ గా కరకట్టకు చేరుకున్నారోననే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో కూడా మూడు రోజుల పర్యటన కోసం ఏపీకి వచ్చినప్పుడు పెద్ద ప్రచారం చేసిన బాబు అనుకూల మీడియా ఈసారి దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.

ఇప్పటికే ఏడు నెలలుగా చంద్రబాబు, ఆయన తనయుడు కూడా హైదరాబాద్ కి పరిమితమయ్యారు. ప్రజలంతా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు పూర్తిగా జూమ్ కి పరిమితమయ్యారు. జనాలను ఆదుకునేందుకు ఆయన వ్యక్తిగతంగా సహాయం అందించిన దాఖాలాలు కనిపించలేదు. వయసు రీత్యా చంద్రబాబు బయటకు రాలేకపోయినా ఆపార్టీ ప్రధానా కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇంటికే పరిమితం కావడం, తన బరువు తగ్గించుకోవడానికి ప్రాధాన్యత తప్ప, జనాలు భారంగా ఉన్నప్పుడు ఉపశమనం కలిగించే యత్నాలు చేయకపోవడం విస్మయకరమే.

ఏపీలో బడ్జెట్ ఆమోదం కోసం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల కోసమంటూ అప్పట్లో మూడు రోజులు మాత్రమే చంద్రబాబు ఏపీలో ఉన్నారు. ఇటీవల జూమ్ సమావేశాల సందర్భంగా తాను కరోనా తగ్గేవరకూ బయటకు రాలేనంటూ ప్రకటించారు కూడా. ఏపీ ఫైట్స్ కరోనా అంటూ ఓ వెబ్ సైట్ ఏర్పాటు చేసి, దాని ద్వారా కార్యకలాపాలు చేస్తామంటూ ఆయన చెప్పుకున్నారు. కానీ ప్రజల అవసరాల మేరకు విపక్ష పాత్ర పోషించడంలో విఫలమయినట్టు ఆయన తీరు చాటుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ లింగమనేని ఎస్టేట్ లో అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు తీరు మీద ఆపార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ విషయాన్ని పలువురు చంద్రబాబు ముందు ప్రస్తావించారు. ఏపీని వదిలి హైదరాబాద్ లో స్థిరపడిన తరుణంలో ఆయనను ప్రజలు విశ్వసించే అవకాశం లేదని, తమను కూడా జనం ప్రశ్నిస్తున్నారని పలువురు టీడీపీ నేతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందుకు తోడుగా ఏపీ హైకోర్ట్ వ్యవహారాలు కూడా తుది అంకానికి చేరుకున్నాయి. అమరావతి అంశంలో రోజువారీ విచారణ మొదలయ్యింది. వాటిని ప్రభావితం చేసే ప్రతీ అంశాన్ని టీడీపీ వదలడం లేదనే చెప్పవచ్చు. కొద్దిరోజుల క్రితం హైకోర్ట్ న్యాయమూర్తులు వెళుతున్న దారిలో మోకాళ్లపై నిలబడిన తీరు దానికి తార్కాణం. ఇప్పుడు కేసు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మరిన్ని ప్రయత్నాలు చేసే యోచనలో ఉన్నట్టుగా పలువురు భావిస్తున్నారు. అలాంటి వాటికి అందుబాటులో ఉండే ఉద్దేశంతోనే ఆయన సైలెంట్ గా కరకట్ట నివాసంలో వచ్చి చేరినట్టుగా అనుమానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి