iDreamPost

ఎయిర్ ఫైబర్ ఎలా పని చేస్తుంది? సాధారణ రూటర్ కంటే బెటరేనా?

ఎయిర్ ఫైబర్ ఎలా పని చేస్తుంది? సాధారణ రూటర్ కంటే బెటరేనా?

ఇప్పుడు స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, వైఫై కనెక్షన్ లేని ఇళ్లు చాలా తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా నగరాలు, మహానగరాల్లో అయితే దాదాపుగా అందరూ వైఫై కనెక్షన్ పెట్టించుకుంటారు. అయితే చాలా మందికి ఈ ఫైబర్ కనెక్షన్స్ ద్వారా అనుకున్నంత స్పీడ్ గా ఇంటర్నెట్ రావడం లేదని కంప్లైంట్ చేస్తుంటారు. వారిది 100 ఎంబీపీఎస్ ప్లాన్ అయినా కూడా చాలా తక్కువ స్పీడ్ తో ఇంటర్నెట్ వస్తుంటుంది. దానికి చాలా కారణాలు ఉండచ్చు. కానీ, అలాంటి ఇబ్బందులకు ఇప్పుడొక సొల్యూషన్ దొరికిందనే చెప్పాలి. అదేంటంటే.. వైర్ ఫైబర్ ప్లేస్ లో ఇప్పుడు ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి వచ్చింది. అసలు ఆ ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి? దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి? సాధారణ రూటర్ కంటే బెటరేనా? అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం అంతా టెక్నాలజీ మీదే నడుస్తోంది. ఏ చిన్న పని జరగాలి అన్నా ఇంటర్నెట్ అవసరం బాగా ఏర్పడింది. ఇప్పుడు అన్నీ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ డివైజ్ లు అయిపోయాయి. వాటిని పూర్తిస్తాయిలో వాడాలి అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే. మొబైల్ కి అయితే సెల్ నెట్ వర్క్ ద్వారా ఇంటర్నెట్ వస్తుంది. కానీ, ఇంట్లో ఉండే స్మార్ట్ డివైజ్ ల కోసం అయితే వైఫై పెట్టించాల్సిందే. ఇప్పుడు అందరూ కేబుల్స్ ద్వారా వచ్చే ఫైబర్ నెట్ వర్క్ నే వాడుతున్నారు. కానీ, చాలా మందికి ఈ రూటర్స్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ తో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా హాల్ నుంచి బెడ్ రూమ్ లోకి ఇంటర్నెట్ రాకపోవడం, స్పీడ్ బాగా తక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తుంటాయి. దానిని అధిగమించేందుకు వైఫై ఎక్స్ టెండర్లను వాడుతుంటారు. వాటి అవసరం కూడా లేకుండా వైఫై 6(ఎయిర్ ఫైబర్) అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం జియో, ఎయిర్ టెల్ సంస్థలు ఎయిర్ ఫైబర్ డివైజ్ లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే ఎయిర్ ఫైబర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.

ఎయిర్ ఫైబర్ పని తీరు:

ఎయిర్ ఫైబర్ కు వైఫై రూటర్ కు పెద్దగా తేడా ఉండక పోవచ్చు. కానీ, డిజైన్ పరంగా మాత్రం ఎయిర్ ఫైబర్ ఎంతో స్లిమ్ గా, పోర్టబుల్ గా ఉంది. పైగా దీనికి కేవలం ఛార్జింగ్ కేబుల్ ఒకటే ఉంటుంది. దీనిలో మీరు సిమ్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా ఇంటర్నెట్ పొందుతారు. ఈ డివైజ్ ని మీ ఇంట్లో ఏ చోటునైనా పెట్టుకోవచ్చు. ఒకసారి ఆన్ చేసిన తర్వాత ఈ డివైజ్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా? ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంది? వైఫై సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనే విషయాలను చూపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆన్ చేసిన తర్వాత మీరు ఎలాంటి అంతరాయం లేకుండా స్పీడ్ ఇంటర్నెట్ ని పొందవచ్చు.

ఏది బెటర్?:

నార్మల్ రూటర్, ఎయిర్ ఫైబర్ లో ఏది బెటర్ అని అడిగితే.. సమాధానం మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ ఫైబర్ అనేది 5జీ నెట్ వర్క్ ఉన్న ప్రాంతంలో ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. 4జీ ఇంటర్నెట్ తో మీకు ఎయిర్ ఫైబర్ అంతగా ఉపయోగంగా అనిపించదు. కానీ, 5జీ నెట్ వర్క్ ఉన్న ప్రాంతంలో మాత్రం ఎయిర్ ఫైబర్ ఎంతో మంచి ఫలితాలను ప్రదర్శిస్తోంది. ఎయిర్ ఫైబర్ ద్వారా 100 ఎంబీపీఎస్ కి మించిన స్పీడుతో ఇంటర్నెట్ ని పొందచ్చు. అంతేకాకుండా వైర్ ఫైబర్ తో పోలిస్తే.. ఎయిర్ ఫైబర్ రేంజ్ దాదాపుగా రెండింతలుగా ఉంటుంది. సాధారణ రూటర్ 25 మీటర్ల రేడియస్ వస్తే.. ఎయిర్ ఫైబర్ 45 మీటర్ల రేడియస్ రేంజ్ తో వస్తుంది. యాక్టివ్ 5జీ కనెక్షన్ తో మీరు మీ ఇంటికి కాస్త దూరంగా వెళ్లికూడా వైఫైని పొందవచ్చు.

ఎయిర్ టెల్ ప్లాన్స్:

ఎయిర్ ఫైబర్ లో ప్రస్తుతం ఎయిర్ టెల్ ఢిల్లీ, ముంబయి నగరాల్లో అందుబాటులో ఉంది. ఎందుకంటే అక్కడ ఎయిర్ టెల్ 5జీ నెట్ వర్క్ ఎంతో స్పీడ్ గా ఉంటుంది. ఎక్స్ ట్రీమ్ ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి అంటే.. ఈ డివైజ్ కొనుగోలు చేయాలి అంటే 2,300 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ప్రస్తుతం ఒకే ఒక ప్లాన్ ను అందిస్తున్నారు. నెలకు 100 ఎంబీపీఎస్ స్పీడ్ తో రూ.799ల ప్లాన్ అందిస్తున్నారు. మీరు రూ.2,500 డిపాజిట్, 6 నెలలకు రూ.4,435, రూ.798 జీఎస్టీతో కలిపి మొత్తం రూ.7,733 కట్టాల్సి ఉంటుంది. అయితే సాధారణ ఫైబర్ ప్లాన్ తో సమానంగానే ఎయిర్ ఫైబర్ ప్లాన్ ని ఉంచారు. అయితే ఎయిర్ టెల్ ఫైబర్ నెట్ వర్క్ కు ఎలాంటి సేఫ్టీ డిపాజిట్ లు ఉండవు. స్పీడ్, రేంజ్, పోర్టబుల్ డిజైన్ పరంగా చూసుకుంటే ఎయిర్ ఫైబర్ అనేది ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎంతో మంచి ఆప్షన్ గా చెప్పచ్చు. అయితే ఈ డివైజ్ ని మీరు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి అంటే కచ్చితంగా స్ట్రాంగ్ 5జీ నెట్ వర్క్ ఉండాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి