iDreamPost

ఆంధ్రాకు కుదరని ప్రత్యేక హోదా పుదుచ్చేరిలో ఎలాసాధ్యం ?

ఆంధ్రాకు కుదరని ప్రత్యేక హోదా పుదుచ్చేరిలో ఎలాసాధ్యం ?

వాడుకొని వదిలేయడంలో చంద్రబాబుని మించిపోతున్నారు బీజేపీ నేతలు. అధికారం కోసం బీజేపీ ఎన్ని అడ్డదారులు తొక్కిందో మధ్యప్రదేశ్, కర్ణాటకలో జరిగిన పరిణామాలు తేటతెల్లం చేశాయి. ఇప్పటికే ఏపీ ప్రజల చెవిలో పువ్వులు పెట్టిన బీజేపీ.. తాజాగా పుదుచ్చేరి ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టేందుకు సిద్ధమైంది.

14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు .. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఏపీతో పాటు తెలంగాణ, బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాలు తమకు హోదా ఇవ్వాలని కోరుతున్నాయని, కానీ ఇచ్చే పరిస్థితి లేదని ఇటీవలే జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనూ బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

తాజాగా జరుగుతున్న పుదుచ్చేరి ఎన్నికల్లో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న బీజేపీ నేతలు.. తాము అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి ప్రత్యేక హోదా కేటగిరి ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. తమకు అధికారం ఇస్తే హోదా ఇస్తామని ప్రకటించారు.

ఏరు దాటేందుకు ఓడ మల్లన్న.. ఏరు దాటడం అయిపోగానే బోడి మల్లన్న అన్న సామెతను బీజేపీ నేతలు చూచా తప్పకుండా పాటిస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో .. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ప్రకటించారు. హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఉండాలని ప్రస్తుత ఉప రాష్ట్రపతి, అప్పటి బీజేపీ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. సీన్ కట్ చేస్తే బీజేపీ అధికారం చేపట్టి ఏడేళ్లు అవుతున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు.

విడిపోయి, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రానికి హోదా ఇచ్చి ఆదుకోవాలని ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. వ్యక్తి గతంగా ప్రధాని మోదీని కలిసి నాలుగైదు సార్లు విజ్ఞప్తి కూడా చేశారు. కానీ, 14 ఆర్థిక సంఘాన్ని బూచిగా చూపి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని బుట్టదాఖలు చేస్తూ వస్తోంది.

33 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో అధికారం కోసం బీజేపీ ఇస్తున్న హామీలను చూస్తుంటే ప్రజలు మండిపడుతున్నారు. ప్రధాని అభ్యర్థి చేసిన వాగ్దానాన్నే అమలు చేయని బీజేపీ.. ఇప్పుడు ఇస్తున్న హామీలను నెరవేరుస్తుంది అంటే .. తాము నమ్మడానికి చెవిలో పువ్వులు పెట్టుకోలేదని పుదుచ్చేరి ప్రజలు అంటున్నారు. అధికారం కోసం ఇంతగా దిగజారిపోతున్న బీజేపీని చూస్తూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Also Read : కేంద్రం వ‌దేలిసినా.. జ‌గ‌న్ ఆప‌న్న‌హ‌స్తం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి